Awesome architecture………………………………………………..
పై ఫొటోలో కనిపించే మూడు తలల శివుని విగ్రహం పురాతనమైనది. మనలో చాలామంది ముక్కంటి గురించి విని ఉంటారు కానీ ఈ మూడు తలల శివుడి గురించి విని ఉండరు. దీనినే త్రిమూర్తి విగ్రహం అని కూడా అంటారు. ఇది 5 వ శతాబ్దం నాటిదని చెబుతారు. ఈ త్రిమూర్తి విగ్రహంలో మూడు ముఖాలు బ్రహ్మ, విష్ణు శివుడివి అంటారు. ఏక రాతిలో చెక్కిన విగ్రహమిది. ఇది అరుదైన విగ్రహం. ఈ తరహా విగ్రహం మరెక్కడా ఉన్నట్టు సమాచారం లేదు.
ఈ విగ్రహంలో మధ్య ముఖం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎడమ వైపు ముఖం ప్రశాంతంగా ఉన్న స్త్రీ మూర్తిని పోలి ఉంటుంది. కుడి వైపు ఉన్న ముఖం కొంత రౌద్ర ఆకారం లో గోచరిస్తుంది.మూడు ముఖాలు దైవ స్వభావాన్ని సూచిస్తాయి. ఈ విగ్రహం ఎలిఫెంటా గుహల్లో ఉంది.
ఈ ఎలిఫెంటా గుహలు ముంబై నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.ఎలిఫెంటా ద్వీపంలో ఉన్న ఈ గుహలకు చారిత్రక ప్రాధాన్యత ఎంతో ఉంది. ప్రధాన గుహ గన్ కొండపై ఉంది. ఇందులోనే శివుని శిల్పాలు, భంగిమలు వివిధ ఆకృతుల్లో మనకు కనిపిస్తాయి.
అక్కడే నాట్య భంగిమలో ఉన్న నటరాజ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. అలాగే వివిధ యోగ భంగిమల్లో ఉన్న శివుని విగ్రహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. శివ లీలలకు సంబంధించిన విగ్రహాలన్నీ ఉన్నాయి. కొన్ని శిధిలావస్థ లో ఉన్నాయి. ఇక్కడే ఒక మ్యూజియం కూడా ఉంది.అందులో పురాతన శిల్ప సంపదను చూడవచ్చు. కలచూరి రాజా వంశానికి చెందిన రాజు కృష్ణరాజు హయాంలో ఈ నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ ఎలిఫెంటా గుహలను ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తించింది. ఇవి మధ్యయుగ కాలం నాటివి. గుహలను తొలచి విగ్రహాలు చెక్కారు. ఈ గుహలు 5వ శతాబ్దం నాటివి.ఈ గుహల్లో హిందూ దేవుళ్ళ విగ్రహాలు కొన్నింటిలో ఉండగా మరికొన్నింట్లో బుద్ధుని పెయింట్స్, స్థూపాలు, నాడు భౌద్ధ సన్యాసులు వాడిన వస్తువులు,తదితరాలున్నాయి.
గుహల బయట ఏనుగుల శిల్పాలను చూసి పోర్చుగీసు వారు ఈ ప్రాంతానికి ఎలిఫెంటా అని పేరు పెట్టారు. అప్పట్లో ఈ ఏనుగుల శిల్పాలను లండన్ కు తరలించే ప్రయత్నాలు చేయగా అవి కింద పడి.. విరిగిపోయాయని అంటారు. ముంబై సిటీలోని గేట్ వే ఆఫ్ ఇండియా టర్మినల్ నుండి ఈ ఎలిఫెంటా దీవికి బోటు లేదా ఫెర్రీలో వెళ్ళవచ్చు.ప్రయాణం సుమారు గంట పడుతుంది. ప్రతి గంటకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. జెట్టీ నుండి దిగి నేరుగా ప్రధాన గుహ మెట్ల వద్దకు చేరుకోవచ్చు. జీవితంలో తప్పనిసరిగా చూసి తీరాల్సిన గుహలు ఇవి