A city worth seeing……………………………………………………………….
జైసల్మేర్ … ఇది థార్ ఎడారికి సమీపంలో ఉన్న నగరం. సూర్యాస్తమయాలు.. సూర్యోదయాల సమయంలో, సూర్యకిరణాలు ఇసుక మీద పడి అక్కడ నుండి బౌన్స్ అయి ఆకాశంలో బంగారు రంగులో మెరుస్తుంటాయి.
లైట్ మారుతున్న సమయంలో వ్యాపించే కాషాయం-పసుపు రంగులు,మెరిసే బంగారు కిరణాలు జైసల్మేర్ నగరంపై ప్రసరిస్తాయి.ఈ కిరణాల కారణం గా జైసల్మేర్ బంగారు నగరంగా మెరిసిపోతూ కనిపిస్తుంది. అందుకే దీన్ని గోల్డెన్ సిటీ అని పిలుస్తారు.
సోనార్ ఖిలా లేదా గోల్డెన్ ఫోర్ట్ అని పిలిచే జైసల్మేర్ కోట తప్పక చూడాల్సిన ప్రదేశం. గోల్డెన్ ఫోర్ట్ ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఒకప్పుడు ఇది చక్రవర్తి నివాసం. కోట పై నుండి నగరాన్నివీక్షిస్తే పసుపు, బంగారు రంగుల్లో మిళితమై కనిపిస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి యాత్రీకులు అక్కడికి వెళుతుంటారు.
థార్ ఎడారి సమీపంలో ఉన్నందున ఇక్కడి టూరిజం శాఖా పలు కార్యక్రమాలు చేపట్టింది. ఎడారిలో రాత్రి బస, సూర్య అస్తమయాన్ని చూసి రాత్రికి ఎడారిలో బస, హాఫ్ డే కేమెల్ సవారీ వంటి ప్రత్యేక ఆకర్షణలను ప్రవేశపెట్టింది. వీటికి పర్యాటకుల నుంచి స్పందన బాగుంది. ఇక్కడే కోటలో జైన దేవాలయం ఉంది. ఇందులో అబ్బురపరిచే అద్భుత శిల్ప సంపద కనువిందు చేస్తుంది.
తానొత మాతా ఆలయం,వార్ మ్యూజియం, కొఠారీ పత్వాన్ హవేలీ, సాగర్ లేక్, డెజర్ట్ నేషనల్ పార్క్, కులధారా విలేజ్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. జైసల్మేర్ నుండి దాదాపు 17 కి.మీ దూరంలో ఈ కులధారగ్రామం ఉంది. అలాగే బడా బాగ్ ఆలయం జైసల్మేర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంది.
ఇక్కడి ఉద్యానవనం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. గత కాలపు కథలను తెలియ జేసే ఎన్నో సమాధులు ఇక్కడ ఉన్నాయి. అలాగే గడిసర్ సరస్సు ను కూడా చూడవచ్చు. ఇది మానవ నిర్మిత రిజర్వాయర్.బోట్ షికారు చేయవచ్చు.
జైసల్మేర్ ను సందర్శించడానికి అక్టోబర్ నుంచి మార్చి వరకు అనుకూలమైన సమయం. ఆసమయంలో అక్కడ ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుండి 27 డిగ్రీల మధ్య ఉంటుంది. ఎడారి నగరంగా ఉన్నందున, జైసల్మేర్‌ను సందర్శించడానికి శీతాకాలం అనువుగా ఉంటుంది. వివిధరకాలుగా టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.