చోటా కైలాష్ గురించి విన్నారా ?

Sharing is Caring...

Lord shiva living place ………………..

ఆది కైలాష్ పర్వతం….. హిందూ మతంలో గొప్ప ఆధ్యాత్మిక, పౌరాణిక ప్రాధాన్యతను కలిగి ఉంది. దీనిని టిబెట్‌లోని ప్రధాన కైలాస పర్వతానికి ‘ప్రతిరూపం’ లేదా ‘చిన్న కైలాష్’ అని పిలుస్తారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న ఆది కైలాష్ హిందువులకు, జైనులకు, బౌద్ధులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర కేంద్రం.

ఆది కైలాష్ పర్వతాన్ని శివుడు, పార్వతి నివసించే పవిత్ర స్థలంగా భక్తులు నమ్ముతారు.ఇది పంచ కైలాష్ పర్వతాలలో ఒకటి. యాత్రికులు ఈ పర్వతాన్ని దర్శించడం వలన పాపాలు నశించి, ఆత్మ ప్రక్షాళన అవుతుందని, అంతర్గత శాంతి లభిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు.

రామాయణం ప్రకారం, శివభక్తుడైన రావణుడు ఇక్కడ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసి, గొప్ప శక్తులను, పది తలలను వరంగా పొందాడు. మహాభారతంలో కూడా ఈ ప్రదేశ ప్రస్తావన ఉంది. పాండవ సోదరులు తమ వనవాస సమయంలో ఇక్కడ ఆశ్రయం పొందారని, వేద వ్యాసుడు ఈ పవిత్ర పర్వతం వద్ద ధ్యానం చేశారని చెబుతారు.

ఆది కైలాష్ సమీపంలో గౌరీ కుండ్ , పార్వతి సరోవర్ వంటి ఇతర స్థలాలు ఉన్నాయి. ఇవి ఈ ప్రాంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి. ఈ యాత్రలో భాగంగా భక్తులు ‘ఓం’ ఆకారంలో సహజంగా మంచుతో ఏర్పడిన ఓం పర్వతాన్ని కూడా దర్శించవచ్చు.దీన్ని దైవిక సృష్టికి ప్రతీకగా భావిస్తారు.

ఆది కైలాష్ యాత్ర ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కత్గోడం (Kathgodam) లేదా హల్ద్వానీ నుండి ప్రారంభమవుతుంది. యాత్ర కత్గోడం నుంచి బయలుదేరి పిథోరఘర్,ధార్చుల,గుంజి, జోలింగ్‌కాంగ్  కి చేరుకుంటుంది. ఇదే ఆది కైలాష్ బేస్ క్యాంప్..గతంలో ఈ యాత్ర సుమారు 200 కి.మీల మేర నడవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం బాగా మెరుగుపడింది. ధార్చుల నుండి ఆది కైలాష్ బేస్ క్యాంప్ (జోలింగ్‌కాంగ్) వరకు వాహనాలు (ప్రధానంగా 4×4 జీపులు లేదా ఎస్‌యూవీలు) వెళ్తాయి.

బేస్ క్యాంప్ నుండి పర్వత దర్శనం కోసం కేవలం 2 నుండి 4 కి.మీల స్వల్ప దూరం మాత్రమే నడవాల్సి ఉంటుంది. ఒకవేళ నడవలేని వారు గుర్రాలపై వెళ్ళవచ్చు.హెలికాప్టర్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కత్గోడం నుండి కత్గోడం వరకు మొత్తం యాత్ర పూర్తి చేయడానికి 8 రోజులు పడుతుంది. టూర్ ప్యాకేజీలు 7 నుండి 10 రోజుల వరకు అందుబాటులో ఉన్నాయి.యాత్ర అంత క్లిష్టతరమైనది కాదు. రోడ్డు సౌకర్యం ఉన్నందున సులభంగా వెళ్ళవచ్చు.

ఇది సముద్ర మట్టానికి సుమారు 14,000 – 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అతి తక్కువ ఆక్సిజన్ స్థాయిల వల్ల AMS (Acute Mountain Sickness) లేదా శ్వాస ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాబట్టి శారీరక దృఢత్వం (Fitness) వైద్య పరీక్షలు ముఖ్యం.ఇది సరిహద్దు ప్రాంతం కాబట్టి, భారతీయ పౌరులు కూడా ముందుగానే ఇన్నర్ లైన్ పర్మిట్ (Inner Line Permit) తీసుకోవడం తప్పనిసరి.

టిబెట్‌లోని కైలాస మానస సరోవర్ యాత్రతో పోలిస్తే ఉత్తరాఖండ్‌లోని ఆది కైలాష్ యాత్ర పలు అంశాలలో భిన్నమైనది.కైలాస యాత్ర..ఇది చైనా ఆధీనంలోని టిబెట్‌లో ఉంది. దీని కోసం అంతర్జాతీయ సరిహద్దులు దాటాల్సి ఉంటుంది.ఆది కైలాష్ అయితే … మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రం (పిథోరఘర్ జిల్లా)లో ఉంది. ఇది పూర్తిగా భారత భూభాగంలోనే ఉంటుంది.

కైలాస యాత్ర కు పాస్‌పోర్ట్,చైనా వీసా అవసరం.ఆది కైలాష్ యాత్రకైతే పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం లేదు. కేవలం ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ వంటివి)  స్థానిక యంత్రాంగం ఇచ్చే ఇన్నర్ లైన్ పర్మిట్ (Inner Line Permit) ఉంటే సరిపోతుంది.

కైలాస యాత్ర చాలా క్లిష్టమైనది.. ఎక్కువ ఎత్తులో (సుమారు 22,000 అడుగులు) ఉంటుంది. వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఆది కైలాష్ యాత్ర అయితే రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో  సులభతరమైంది. దీని గరిష్ట ఎత్తు సుమారు 15,000 అడుగులు. నడక దూరం కూడా చాలా తక్కువ. కైలాస యాత్ర కు  సుమారు 15 నుండి 20 రోజులు పడుతుంది..

ఖర్చు కూడా ఎక్కువ (సుమారు ₹2 లక్షల నుండి ₹3.5 లక్షల వరకు).ఆది కైలాష్ యాత్ర  7 నుండి 10 రోజుల్లో పూర్తవుతుంది. ఖర్చు కైలాస యాత్రతో పోలిస్తే చాలా తక్కువ.ఒక వ్యక్తికి సుమారు ₹30,000 నుండి ₹50,000 వరకు ఉంటుంది.

ప్యాకేజీలో సాధారణంగా వసతి, భోజనం, రవాణా పర్మిట్లు ఉంటాయి. వ్యక్తిగత ఖర్చులు, పోర్టర్ సేవలకు అదనంగా ఖర్చవుతుంది. ఈ యాత్రను ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తాయి.KMVN (కుమాన్ మండల్ వికాస్ నిగం) ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి చెందిన ఈ సంస్థ అధికారికంగా యాత్రను నిర్వహిస్తుంది. వీరు ధార్చుల లేదా కత్గోడం నుండి ప్యాకేజీలను అందిస్తారు.

అధికారిక వెబ్‌సైట్ KMVN ద్వారా బుక్ చేసుకోవచ్చు.యాత్ర కు వెళ్లేవారు మార్గ మధ్యంలో రాత్రిళ్ళు రెస్ట్ తీసుకునేందుకు వసతులు పరిమితంగా ఉంటాయి. టూర్ ఆపరేటర్స్ అవన్నీ చూసుకుంటారు. 2026 మే-జూన్ ,సెప్టెంబర్-అక్టోబర్ నెలలు యాత్రకు మంచి సమయం.

Sharing is Caring...
Support Tharjani

Leave a Comment!

error: Content is protected !!