అస్తిపంజరాల సరస్సు గురించి విన్నారా ?

Sharing is Caring...

Still a mystery…………………………………

ఇండియాలో మిస్టరీలకు కొదువ లేదు. ఎన్నో చిత్ర,విచిత్రమైన విషయాలు.. ఊహకందని మిస్టరీలు ఈ దేశం సొంతం. ఆ కోవలోనిదే ఈ అస్థిపంజరాల సరస్సు.ఇది ఉత్తరాఖండ్‌లోని రూప్‌కుండ్‌లో ఉన్నది. ‘అస్థిపంజరం సరస్సు’ అని పిలుచుకునే ఈ సరస్సు హిమాలయాలలో 5,029 మీటర్ల ఎత్తులో ఉంది. సరస్సు చుట్టూ హిమానీనదాలు, మంచు పర్వతాలు ఉన్నాయి. ఈ సరస్సు రెండు మీటర్ల లోతులో ఉంటుంది.

ప్రతి ఏటా వందలాది మంది ట్రెక్కింగ్ కోసం .. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వస్తుంటారు. చుట్టూ మంచుకొండలు కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది. శీతల పవనాలు వీస్తుంటాయి. కొండల నడుమ ఉండే ఈ సరస్సులో ప్రతి సంవత్సరం మంచు కరిగిన సమయంలో వందలాది పుర్రెలు కనిపిస్తాయి. ఈ అస్థిపంజరాలు .. పుర్రెలు ఎవరివో మిస్టరీ గా ఉండిపోయింది.

తొలుత 1841 లో టిబెట్ యుద్ధం నుండి తిరిగొచ్చే సమయంలో హిమాలయాల్లోని వాతావరణ ప్రభావం కారణంగా అక్కడ చిక్కుకుని మరణించిన కశ్మీర్ జనరల్ జోరవర్ సింగ్, అతని అనుచరుల పుర్రెలు అనుకున్నారు.

ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా  ఆ మార్గాన్ని దాటుతున్నప్పుడు మరణించిన జపాన్ సైనికులవని భావించారు. ఆ తర్వాత స్థానిక రాజు తన పరివారం తో నందాదేవి జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ఘోర విపత్తు సంభవించిందని అంచనా వేశారు. 1200 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ ఘటన ఎలా జరిగిందనేది ఎవరూ నిర్ధారించలేదు..

ఈ అస్థిపంజరాలను మొదటిసారిగా 1942 లో బ్రిటిష్ ఫారెస్ట్ గార్డ్ ఒకరు చూసారు. అస్థిపంజరాలతో పాటు, చెక్క కళాఖండాలు, ఇనుప ఈటెలు, తోలు చెప్పులు, ఉంగరాలు కూడా కనిపించాయి. పరిశోధకులు, పురావస్తు అధికారులు ఈ మిస్టరీ  ముడి విప్పటానికి చాలా కృషి చేశారు.

చివరికి ఈ అస్థిపంజరాలు 9 వ శతాబ్దపు భారతీయ తెగకు చెందినవని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. వీరంతా వడగళ్ల తుఫాన్ కారణంగా మృతి చెందారని తేల్చారు. వడగళ్ళు తలపై పడిన కారణంగా చాలామందికి గాయాలు అయ్యాయని కనుగొన్నారు.

భీకర వాతావరణం,అనుకూలించని పరిస్థితులు .. వడగళ్ల వాన కారణంగా ఒకే సారి అందరూ అక్కడ మరణించారని భావించారు. ఇండియా, యుఎస్, జర్మనీకి చెందిన 16 సంస్థల నుండి 28 మంది పరిశోధకులు ఐదు సంవత్సరాల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. మరణించిన వారు ఎవరు ? ఎక్కడి వారు ? అనే విషయాలపై  పలు అభిప్రాయాలు వెలిబుచ్చారు. ఇవన్నీ అంచనాలే …అన్ని నిజం కాకపోవచ్చు. ఇప్పటికి ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది.

ఇక రూప్‌కుండ్ సుందరమైన పర్యాటక ప్రదేశం. హిమాలయ శిఖరాల దిగువన ఉన్న చమోలి జిల్లా లో ఉంది.హిమాలయాలలో ట్రెక్కింగ్ జరిగే ప్రాంతాల్లో ఇది ముఖ్యమైనది. ఇక్కడ ట్రెక్ చేయడానికి శరదృతువు (సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ వరకు) అనుకూలంగా ఉంటుంది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!