Has the worship of Lajja Gauri decreased?
ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత… లజ్జ గౌరి
….
ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవత విగ్రహం కర్నాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో, పురావస్తు శాఖ మ్యూజియంలో కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథకోలా లోని నాగనాధ ఆలయం నుంచి సేకరించారు. చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కూడలి సంగమేశ్వర ఆలయం నుంచి సేకరించినది.
ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం వుండడం, ఇదే భంగిమలో వుండడం చాలా అరుదైన, ఆశ్చర్యం కలిగించే అంశం. క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాలనుంచి కూడా లజ్జ గౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సంతానాన్ని ఇచ్చే దేవతగా లజ్జ గౌరిని కొలుస్తారు.
హరప్పా, మొహంజదారో నాగరికతల్లో ఈ విగ్రహారాధన వుంది. అంతకు ముందూ వుంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, మొరాకో.. ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి. గుహల్లో చిత్రించిన బొమ్మల్లోనూ ఈ విగ్రహాలు వున్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జ గౌరి ఆరాధన ఆచారం వుంది.
భారతదేశంలో క్రీస్తు శకం ఆరునుంచి పన్నెండో శతాబ్దం వరకూ లజ్జ గౌరి ఆరాధన పతాక స్థాయిలో వున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముస్లిం దండయాత్రల తర్వాత.. విగ్రహారాధనను.. ముఖ్యంగా స్త్రీ విగ్రహారాధనను, అందునా నగ్నంగా వున్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహ పరిచారని తెలుస్తోంది.
తర్వాత బ్రిటిష్ హయాంలో… నగ్న దేవతను ఆరాధించడం అనాగరిక, అశ్లీల చర్యగా పరిగణించారు. కాలక్రమంలో లజ్జ గౌరి ఆరాధన, ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి వుండవచ్చు కానీ… పూర్తిగా ఏమీ మాసిపోలేదు.
లజ్జ గౌరికి సంబంధించిన ప్రస్తావన తొలుత మనకు కనిపించేది రుగ్వేదంలో… అదితి పేరిట. అదితి అంటే ఆదిశక్తి.
In the first age of the gods, existence was born from non-existence. The quarters of the sky were born from Her who crouched with legs spread. The earth was born from Her who crouched with legs spread, And from the earth the quarters of the sky were born.
Rig Veda, 10.72.3-4
…. ….
Aditi is the sky
Aditi is the air
Aditi is all gods …
Aditi is the Mother, the Father, and Son
Aditi is whatever shall be born.
Rig Veda, I.89.10
విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీ గా పరిగణిస్తారు. ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు. ఎన్ని నిర్వచనాలు వున్నా… స్థూలంగా వాటి సారం ఒకటే. సంతానాన్ని, సంపదను, ధనధాన్యాదులను ప్రసాదించే శుభకర దేవత అని. ఈ దేవతను భారతదేశంలో రేణుక, మాతంగి, యల్లమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా… పార్వతీదేవి ప్రతిరూపంగానే కొలుచుకుంటారు.
లజ్జ గౌరికి సంబంధించి మరో ఆసక్తికర కథ కూడా ప్రచారంలో వుంది. నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది, దేవత అయింది.
లజ్జ గౌరి విగ్రహానికి తల వుండదు. తల స్థానంలో.. పరిపూర్ణంగా వికసించిన కమలం వుంటుంది. చేతిలో కమలం/తామర తూడులు వుంటాయి. ఆభరణాలు ధరించి వుంటుంది. వికసిత కమలం శక్తికి సంకేతం. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు.. సహస్రార చక్రం ఉద్దీపనకు వికసిత కమలం సంకేతం.
నగ్నంగా ఉండే లజ్జ గౌరీ విగ్రహం నచ్చినా నచ్చకపోయినా మన చరిత్ర మనకు నచ్చాలి. మెచ్చాలి.
Mother Goddess పట్ల విశ్వాసం, ఆరాధ్యభావం వున్న వారెవరూ లజ్జ గౌరి బొమ్మను చూసి సిగ్గుపడరు. రాజముద్రికగా, నాణెంగా కూడా లజ్జగౌరి చెలామణిలో వుంది. లజ్జగౌరిని మీరు ఆరాధించనక్కర్లేదు. చరిత్రను కనీసం గౌరవించండి.
లజ్జ గౌరీ గురించి తెలుగులో పుస్తకాలు ఏమి లేవు … ఆంగ్లంలో మాత్రం మాక్స్ లీ మార్టిన్ ఒక పుస్తకం రాశారు.
———– Vasireddy Venugopal