తల లేని గణపతి’ ఆలయం గురించి విన్నారా ?

Sharing is Caring...

తల లేని వినాయకుడి ఆలయం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అలాంటి ఆలయం మనదేశంలోనే ఉంది. ఈ ఆలయాన్ని ముండ్కటియా ఆలయం అంటారు. కేదార్ లోయ ఒడిలో ఈ ఆలయం ఉంది. ప్రపంచంలోనే తల లేకుండా పూజలు అందుకుంటున్న వినాయకుడి ఏకైక ఆలయం ఇదే.

ఈ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సోన్‌ ప్రయాగ్  నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది..ఈ స్థలాన్ని దేవభూమి అని కూడా అంటారు.శివపురాణం ప్రకారం పార్వతీ దేవి స్నానం చేస్తుండగా .. వచ్చిన శివుడిని  గణేషుడు అడ్డుకుంటాడు.

దీంతో శివుడు ఆగ్రహించి కుమారుడని తెలియక గణేశుని తలను నరుకుతాడు. ఆ ప్రదేశం ఇదే అని అంటారు. ముండా అంటే తల.. కటియా అంటే తెగిపోయింది అని అర్ధం. ఈ  రెండు పదాల కలయిక తో ఈ ప్రాంతానికి ముండ్కటియా అనే పేరు స్థిరపడిపోయింది. 

కేదార్‌నాథ్‌కి వెళ్లే పాత దారిలో ట్రెక్కింగ్ చేసే భక్తులు ఇక్కడ ఆగి వినాయకుడిని ప్రార్ధించి వెళుతుంటారు. కేదార్ లోయలోని అటవీప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని పెద్దగా ఎవరూ సందర్శించరు. ఆలయం దిగువన మందాకిని నది ప్రవహిస్తుంటుంది.  2013 లో వచ్చిన వరదలు కేదార్‌నాథ్ లోయ ప్రాంతాన్ని బాగా దెబ్బతీశాయి. కొండ చరియలు విరిగి పడ్డాయి.

సోన్‌ప్రయాగ్ మార్గంలో కొండ చరియలు అడ్డంగా ఉండటం తో అటు నడిచి వెళ్లడం కొంచెం కష్టమే. ఈ కారణం గా భక్తులు ఇటు ఎక్కువగా రారు. ఈ ఆలయం దాదాపుగా ఎప్పుడూ  నిర్మానుష్యంగానే ఉంటుంది. అరుదుగా భక్తులు వస్తుంటారు.

సోన్‌ ప్రయాగ్-గౌరికుండ్ హైవేపై పక్కగా 200 మీటర్ల మేరకు నడవాల్సి ఉంటుంది. 2013 విపత్తుకు ముందు, సంవత్సరానికి 10,000 మంది యాత్రీకులు గణేష్ ఆలయాన్ని సందర్శించేవారు. కానీ ఇపుడు ఆ సంఖ్య తగ్గిపోయింది. ఈ గణేష్ ఆలయాన్ని ఆధునీకరించి .. అభివృద్ధి చేసి … వెళ్లే మార్గాన్ని సరిచేస్తే  గత వైభవం వస్తుంది. పర్యాటక కేంద్రం గా మారుతుంది. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!