Bharadwaja Rangavajhala ……
జీవితాంతం జైల్లో ఉంచేకన్నా వాళ్లకి మరణశిక్ష విధించడమే మంచిది కదా…అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ మధ్య వ్యాఖ్యానించింది. అంతే కాదు..మనమంతా ఏదో ఆశలతో జీవిస్తాం. జీవితాంతం విడుదలౌతామనే ఆశ లేకుండా జైల్లో ఉండే ఖైదీలు అలా ఉండిపోవడంలో అర్ధమేముందని కూడా అభిప్రాయపడింది.
1993 మార్చి ఎనిమిదో తేదీన చిలకలూరిపేట లో ఇద్దరు దళిత యువకులు హైద్రాబాద్ వెళ్తున్న బస్సుకు నిప్పంటించారు. ఆ ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. పేర్లు చలపతీ, విజయవర్ధనరావు. ఈ ఇద్దరికీ కోర్టు ఉరిశిక్ష వేసింది. దళిత ప్రజాస్వామిక మేధావులు, ప్రజాసంఘాలు కలసి ఉరి ఆపాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అంతిమంగా అప్పటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ఉరి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఆ ఇద్దరూ…ఆనాటి నుంచి జైల్లోనే మగ్గిపోతున్నారు. లైఫ్ ఈజ్ లైఫ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది. దాని ప్రకారం జీవిత ఖైదీ విడుదలకు ఉన్న ఏకైక అవకాశం ప్రభుత్వాలు అప్పుడప్పుడూ దయతో ఇచ్చే జీవోలే. ఆ జీవోల్లో కూడా కొన్ని కండీషన్లు పెడతారు. వాటిలో ఒకటి మరణశిక్ష పడి జీవిత ఖైదుగా మారిన వారు విడుదలకు అనర్హులు అనేది. ఇది ప్రతి జీవోలోనూ కంపల్సరీగా ఉంటుంది. అదుండడం వల్ల చలపతీ, విజయవర్ధనరావులు విడుదల కాలేకపోతున్నారు.
చాలా మంది ఇప్పటికీ జీవితఖైదు అంటే పద్నాలుగేళ్లని మూఢంగా నమ్మేస్తారు. అది తప్పు. జీవిత ఖైదీకి విడుదల లేదు. స్వతంత్రమొచ్చి యాభై ఏళ్లైందనో…ఫలానా నాయకుడు పుట్టి వందేళ్లైందనో, ఫలానా ప్రభుత్వం ఓడిపోయి కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిందనో ప్రభుత్వాలు ఇచ్చే జీవోల్లో ఉండే కండీషన్లు అప్లై కాకపోతేనే జీవిత ఖైదీకి విడుదల అనేది సంభవం. లేకపోతే జీవితాంతం జైలే.
ఇలా 27 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్న చలపతీ విజయవర్ధనరావులు చాలా క్రితం గవర్నర్ కి జైలు నుంచే ఓ పిటీషన్ పెట్టుకున్నారు. అయ్యా…మాకు విడుదల ఎటూ లేదు…మెర్సీకిల్లింగ్ కింద మమ్మల్ని చంపేయండి అనేది ఆ పిటీషన్ సారాంశం. అయితే…గవర్నర్ గారు ఆ పిటీషన్ ను తిరస్కరించారు. కారణం రాష్ట్రపతి అంతటివాడు క్షమాభిక్ష పెడితే చంపేయమని నేను చెప్పడం సబబు కాదని గవర్నర్ గారి అభిప్రాయం.
ఇలా జీవోల్లో ఉన్న ప్రతిబంధకాల వల్ల జైల్లో మగ్గిపోయిన ఖైదీల్లో ఖదీర్ , గణేష్ కూడా ఉన్నారు. ఇందులో ఖదీర్ పాతబస్తీలో పోలీసు కానిస్టేబుల్. డిఎస్పీ సత్తయ్యను కాల్చిచంపిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా ఆరోగ్యం పాడైన చివరి రోజుల్లో విడుదల చేసారు. విడుదలైన రెండోరోజే మరణించారు .
గణేశ్ ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి హత్య కేసులో జీవిత శిక్ష పడిన ఖైదీ. ఆనాటి కాల్పుల్లో సుబ్బరామిరెడ్డి గన్ మేన్ చనిపోయాడు. దీంతో యూనిఫామ్ లో ఉన్న పబ్లిక్ సర్వెంట్ అనే క్లాజు వర్తించి ఆయన విడుదల లేక ఆయనా చాలాకాలంగా జైల్లోనే ఉన్నాడు . ఇటీవలే పెరోల్ పై బయటికి వచ్చాడు. జీవిత ఖైదు గురించి చాలా సెన్సిటివ్ గా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పెద్దమనసుతో వీరందరినీ విడుదల చేస్తే బాగుంటుంది. వీరందరి విడుదల గురించిన విషయం కోర్టు దృష్టికి తీసుకుపోవడం ప్రజాస్వామిక వాదులందరి లక్ష్యం కావాల్సిఉంది.
ఇది కూడా చదవండి >>>>>> ఆ సూపర్ హిట్ పాటను ఇద్దరు రాశారట !!