నిజం గాను .. మంచి మిత్రులే !

Sharing is Caring...

సూపర్ స్టార్ కృష్ణ .. హీరో శోభన్ బాబు కథానాయకులుగా నిర్మితమైన చిత్రం “మంచి మిత్రులు”. నిజ జీవితంలో కూడా ఈ ఇద్దరు మంచి మిత్రులు కావడం విశేషం. ఇద్దరు కలసి వేషాలకోసం తిరిగిన రోజులున్నాయి. మద్రాస్ లో నాటకాలు కూడా కలసి వేశారు. ఇద్దరు ఒకేసారి పరిశ్రమలోకి ప్రవేశించినప్పటికీ  ముందుగా సూపర్ స్టార్ టాప్ రేంజ్ లోకి వెళ్లారు.

తరువాత పదేళ్లకు శోభన్ బాబు కి హీరో గా గుర్తింపు వచ్చింది. గూఢచారి 116  సినిమాకు మొదట శోభన్ బాబునే హీరో గా సెలెక్ట్ చేశారు. జయలలిత తల్లి సంధ్య అందుకు అంగీకరించలేదు. తర్వాత కృష్ణ ఫోటోలు చూసి ఒకే అన్నారు. ఆ సినిమాలో జయలలిత హీరోయిన్ గా చేశారు. ఒక చిన్న పాత్రలో శోభన్ చేశారు. ఆ సినిమా తో సూపర్ స్టార్ దశ తిరిగింది. ఈ ఇద్దరు కలసి ఎన్నో సినిమాలు చేశారు. వాటిలో మంచిమిత్రులు ఒకటి. ఇందులో ఇద్దరివీ మంచి పాత్రలే.

సూపర్ స్టార్ గోపి గా .. గంగారాం గా డిఫరెంట్ షేడ్స్ లో నటించిన సినిమా ఇది. కృష్ణ .. శోభన్ ఇద్దరూ స్నేహితులు . కలసి ఒకే రూములో ఉంటుంటారు. నిజాయితీ స్వభావం గల కృష్ణ పదే పదే ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటాడు. శోభన్  సర్దుకుపోయే తత్వం ఉన్నవాడు. కోపం తగ్గించుకుని సర్దుకుపోతే మంచిదని శోభన్ ఇచ్చిన సలహా కృష్ణకు నచ్చదు. ఇద్దరూ ఆ కారణంగా విడిపోతారు. ఐదేళ్ల తరువాత ఒక రోజు కలుద్దామని చెరో దారి పడతారు.

కృష్ణ సిటీ కొచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకదు. అనుకోకుండా ఒక నేరం లో చిక్కుకుంటాడు. నాగభూషణం కాపాడతాడు. అతగాడిని విడిపించే క్రమంలో కృష్ణ నేరస్థుడి గా మారతాడు. గజదొంగ గంగారాం అవతారం ఎత్తుతాడు. ఇక శోభన్ బాబు కృష్ణ ఇంటికే చేరతాడు. అక్కడే ఉంటూ సీఐడీ అధికారి అవుతాడు. ఇక అక్కడ్నుంచి కథ అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. ఈ సినిమాలో కృష్ణ విజయనిర్మల లు అన్నాచెల్లెళ్లుగా నటించారు. శోభన్ పక్కన హీరోయిన్ విజయనిర్మలే.

కథ మొత్తం కృష్ణ .. శోభన్ చుట్టూనే నడుస్తుంది. అయిదేళ్ల తర్వాత ఇద్దరు కలిసినపుడు ఎవరు ఏమిటో తెలుస్తుంది. తరవాత కృష్ణ ను బంధించాలని శోభన్ .. అతగాడిని అంతమొందించాలని కృష్ణ ప్రయత్నిస్తారు. క్లయిమాక్స్ లో ఇద్దరూ బులెట్లు లేని తుపాకులతో వస్తారు. మరో పోలీసు పక్కనుంచి కాలుస్తాడు.దీంతో గాయపడిన గంగారాం మరణించడంతో సినిమా ముగుస్తుంది.

దర్శకుడు తాతినేని రామారావు కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు.సూపర్ స్టార్ ను గంగారామ్ పాత్రలో విభిన్నంగా చూపారు.మేకప్ పట్ల శ్రద్ధ చూపారు.సూపర్ స్టార్ పాత్రకు తగిన హావభావాలు పలికించారు. డైలాగు మాడ్యులేషన్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నారు. శోభన్ పాత్ర కంటే  కృష్ణ పాత్రే కథలో కీలకం. ఆ పాత్రకు సీనియర్ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ అద్భుతమైన డైలాగ్స్ అందించారు.

ఈ సినిమా విడుదలై 52 ఏళ్ళు అవుతుంది. మంచి మిత్రులు అప్పట్లో పెద్ద హిట్ మూవీ. ముందు తమిళ్ తరువాత హిందీలో కూడా వచ్చింది. అన్ని భాషల్లో ఆదరణ పొందింది. సూపర్ స్టార్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా.  ఇద్దరు మిత్రులు కలిసే ముందు “ఎన్నాళ్లో వేచిన ఉదయం/ ఈనాడే ఎదురవుతుంటే ” అనే పాటను ఇద్దరిపై చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది.  సినారె ఆ పాట రాశారు . ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ అది. ఘంటసాల, ఎస్పీ కలసి పాడిన గీతమది. ఎస్పీ కోదండపాణి సినిమాకు సంగీతం అందించారు.  యూట్యూబ్ లో ఈ సినిమా ఉంది. చూసినవారు .. చూడని వారు చూడొచ్చు. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!