Golden Treasures…………………………
ఈజిప్ట్ పాలకుడైన టుటన్‌ఖామెన్ ని సమాధి చేసి మూడు వేల సంవత్సరాలు అవుతోంది.ఆయన ఎలా మరణించారు అనేది ఇప్పటికీ మిస్టరీయే. నాటి నుంచి టుటన్‌ఖామెన్ సమాధి ఎడారి గర్భంలోనే ఉంది.
1922వ సంవత్సరంలో బ్రిటిష్ ఈజిప్టు శాస్త్రవేత్త హోవార్డ్ కార్టర్.. అతని బృందం కలిసి ఈజిప్టు రాజుల ఘాటీలో టుటన్‌ఖామెన్ సమాధిని తవ్వడం ప్రారంభించారు. ఈ సమయంలోనే అనేక రహస్యాలు వెలుగులోకి వచ్చాయి.
1922, నవంబర్ 4న కార్టర్ బృందం తవ్వకాలు జరుపగా.. ఇసుకలో ఖననం చేసినటువంటి సమాధి మెట్లను గుర్తించారు. అనంతరం ఆ బృందం మెట్ల దారిని కూడా కనుగొన్నది. నవంబర్ చివరి నాటికి వారు ఒక గది, ఒక భారీ ఖజానా, సమాధి తలుపులను గుర్తించారు.
కార్టర్, అతని బృందం అక్కడ ఉన్నటువంటి ఓ తలుపుకు రంధ్రం చేశారు. ఆ తర్వాత అందులోనుంచి లోపలికి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అది బంగారు నిధులతో నిండిన గది.. టుటన్‌ఖామెన్ మమ్మీ ఉన్నటువంటి శవపేటికను మాత్రం చాలా కాలం తర్వాత పరిశోధకులు గుర్తించారు.
టుటన్‌ఖామెన్ ఈజిప్ట్ పాలకుడు. ఆయన్ని కింగ్ టుట్ అని కూడా ఆనాటి ప్రజలు పిలుచుకునేవారు. ఈయన 1333 బీసీలో కేవలం తనకు 9 ఏళ్ల వయసున్నప్పడే ఈజిప్ట్ రాజు అయ్యారు. కొంత కాలం తర్వాత రాజు మరణించారు. దీంతో నాటి రాజ కుటుంబీకులు సంప్రదాయం ప్రకారం గా వివిధ లేపనాలతో రాజు మృతదేహాన్ని మమ్మీగా తీర్చిదిద్దారు.
ఆ తర్వాత దాన్ని భద్రపరిచారు.అంతేకాదు రాజు మమ్మీతో పాటు వివిధ రకాల కళాకృతులను.. నగలు, నిధులను కూడా అతని సమాధిలో పెట్టి ఖననం చేసేశారు. కానీ కాలక్రమేణా ఈ సమాధి చివరికి ఎడారి ఇసుకలో కలిసిపోయింది. సమాధి నుంచి బయటపడ్డ వస్తువుల జాబితా ను రూపొందించేందుకు కార్టర్ బృందానికి దాదాపు 10 ఏళ్ల సమయం పట్టింది.
సమాధిని కనుగొన్న అనంతరం కింగ్ టుట్ అత్యంత ప్రసిద్ధి చెందిన ఈజిప్ట్ చక్రవర్తుల్లో ఒకరిగా గుర్తింపు దక్కించుకున్నారు. మరో విషయం ఏంటంటే కింగ్ టూట్ అసలు ఎలా చనిపోయాడు అనే విషయం మాత్రం ఓ మిస్టరిగానే మిగిలిపోయింది. అయితే ఆయన అనుమానస్పద స్థితిలో చనిపోయాడని కొందరు.. మరికొందరు ప్రమాదం చనిపోయాడని అంటున్నారు.
కాగా ఈ సమాధిని గుర్తు తెలియని దుండగులు రెండుసార్లు దోచుకున్నారు. దీంతో రాజ కుటుంబీకులు భద్రత పెంచారు. రాజు సమాధి ఉన్న వ్యాలీ అఫ్ కింగ్స్ లో మరెన్నో సమాధులు కూడా ఉన్నాయి. తరచుగా వరదలు వచ్చి బురద,ఇసుకలో సమాధి కూరుకుపోయింది. దీన్నే హోవార్డ్ కార్టర్ బృందం తవ్వి బయటకు తీసింది.