అగ్నిపర్వతం నుంచి ఎగిసిపడుతున్న బంగారం !!

Sharing is Caring...

Active volcano Mount Erebus—————

ఆ దేశంలో బంగారు వర్షం కురుస్తోంది. ఆ వర్షం ఆకాశం నుంచి కాదు భూమి నుంచి. భూమి నుంచి వర్షం ఏమిటి అనుకుంటున్నారా ?భూమి పై ఉన్న ఎరేబస్ అగ్ని పర్వతం నుంచే ఈ బంగారు వర్షం కురుస్తోంది. అదేనండీ పైకి చిమ్ముతోంది.

ఈ అగ్ని పర్వతం అంటార్కిటికాలో ఉంది. పర్వతంలో ఉన్న పుత్తడి కరిగిపోయి బయటికి రేణువుల రూపంలో వెల్లువెత్తుతోంది. కేవలం బంగారం మాత్రమే కాదు, జింక్,రాగి వంటి అనేక ఇతర విలువైన ఖనిజాలు కూడా బయటకు వస్తున్నాయి.

ఈ అగ్నిపర్వతం నుండి వెలువడే లావా  1000°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ను కలిగి ఉందని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అగ్నిపర్వతం నుంచి వెలువడే కణాలు – 20 మైక్రోమీటర్ల కంటే చిన్నవిగా ఉన్నాయి .. అగ్నిపర్వతం నుండి 1000 కిలోమీటర్లకు పైగా ఇవి గాలిలో యెగిరి పడుతున్నాయి.

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనే ‘నాసా’ ఈ సమాచారాన్ని నివేదించింది. అంటార్కిటికాలో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి బంగారం, ఇతర విలువైన ఖనిజాలు వెలువడుతున్నాయని ఫొటోలతో సహా ప్రపంచానికి తెలియ జేసింది.

భూమి మధ్యలో నుంచి వెలువడుతున్న లావాతో పాటు విలువైన ఖనిజాలు కూడా బయటకు వస్తున్నాయని నాసా చెబుతోంది. అగ్నిపర్వతం నుంచి వచ్చే బంగారం పరిమాణం కూడా తక్కువేం కాదని అంటోంది . ప్రతిరోజూ దాదాపు 80 గ్రాముల బంగారం బయటికి వస్తుందని నాసా అంటోంది.దాని విలువ సుమారు 6 వేల డాలర్లు ఉంటుందని అంచనా.

అక్కడ బంగారం వర్షం కురిసినా ఆ బంగారాన్ని సేకరించే ధైర్యం మాత్రం ఎవరికీ లేదు. ముందు కెళితే మాడి మసైపోతారు . అగ్నిపర్వతం నుంచి వెలువడే వాయు పీడనం వల్ల బంగారం స్ఫటికాల రూపంలో బయటకు వచ్చినా.. దాని చుట్టూ మరుగుతున్న లావా ను చూస్తే ఎవరికైనా భయం కలగక మానదు.

బంగారం పై ఆశ ఉన్నా .. బతికి ఉంటే బలుసాకు తినవచ్చు అని భయపడి ఆ సమీపానికి కూడా వెళ్ళరు.. అసలు అనుమతులు లభించవు. అది పూర్తిగా నిషేదిత ప్రాంతం.ఇక కొన్ని బంగారు రేణువులు గాలిలో కలిసిపోయి అగ్నిపర్వతం నుంచి 621 మైళ్ల దూరం వరకు చిమ్ముతున్నట్లు చెబుతున్నారు.

అగ్నిపర్వతం నుండి పైకి లేస్తున్న బంగారానికి సంబంధించిన చిత్రాలను నాసా విడుదల చేసింది. కాగా మౌంట్ ఎరెబస్ అంటార్కిటికాలోనే అత్యంత ఎత్తైన, ప్రమాదకర అగ్నిపర్వతంగా రికార్డుల్లో కెక్కింది. కొన్నేళ్ల క్రితం ఒకసారి న్యూజిలాండ్ విమానం మౌంట్ ఎరెబస్‌లో కూలిపోవడంతో అందులో ఉన్న 257 మంది వరకు మరణించారు. మౌంట్ ఎరెబస్ మంచు కప్పబడిన అగ్నిపర్వతమని పైలట్‌ గుర్తించ లేకపోయారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!