దూద్ కాశీ కి వెళ్లొచ్చిన అనుభూతి నిచ్చే మూవీ!

Sharing is Caring...

Different Movie ……………………………

ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. సినిమా చూడటం పూర్తయ్యాక నిజంగానే దూద్ కాశీ కి వెళ్లి చూడాలనిపిస్తుంది కూడా.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి ఇదే మొదటి చిత్రం.(అంతకుముందు ఒక లఘు చిత్రం తీసాడు ) వేరే వాళ్ళు అయితే ఈ సినిమా తీయడానికి ధైర్యం చేయరు. సినిమాలు కమర్షియల్ అంశాలు ఏమీ ఉండవు. తెర వెనుక అశ్వనీదత్ ఉన్నాడు కాబట్టి సినిమా తీయడం సులువైంది.ఈ కాన్సెప్ట్ సినిమా గా తీయడానికి దర్శకుడికి ఒక క్లారిటీ కావాలి. అది నాగ్ అశ్విన్ కి ఉండ బట్టే తన ఆలోచనలను అద్భుతంగా తెర పైకి ఎక్కించాడు. సినిమా రిజల్ట్ గురించి ఆలోచించకుండా తీసినట్టే అనిపిస్తుంది.

ఇలాంటి సెల్ఫ్ రియలైజేషన్ సబ్జెక్ట్ ను ప్రేక్షకులు చాలామంది ఇష్ట పడరు. అయితే అశ్విన్ అందరిని ఒప్పించేలా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ను రూపొందించారు. అవసరమైన చోట్ల ఎమోషన్ ను పండించాడు. ఎక్కడా కూడా అశ్లీలం .. అసభ్యం లేకుండా కథను నడిపించాడు. సినిమా ముప్పాతిక భాగం ‘ప్రయాణమే’ కాబట్టి బోర్ కొట్ట కుండా జాగ్రత్త పడ్డాడు.

డబ్బు సంపాదన కీలకమై …జీవితంలో వేగంగా పైకి ఎదగాలనే కాంక్షతో మనిషి ఎంత సెల్ఫిష్ గా మారి పోతున్నాడో, జీవితాన్ని జీవించడం మానేసి ఎంత యాంత్రికంగా తయారవుతున్నాడో చూపించే ప్రయత్నం ‘ఎవడే సుబ్రమణ్యం’లో అశ్విన్ చేశారు.‘అసలు తను ఎవరు?’ అని సుబ్రమణ్యం ఈ ప్రయాణంలో తనలో తనని ఎలా చూసుకున్నాడో, తన గురించి తానేం తెలుసుకున్నాడో అన్నదే ఈ చిత్రం.

దాదాపు నెలరోజుల పాటు హిమాలయాల్లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. రోడ్లు లేకపోవడంతో టీమ్ సభ్యులు షూటింగ్ స్పాట్ చేరుకోవడానికి ట్రెక్కింగ్ చేసారు.కొన్ని ప్రదేశాల్లో ఆక్సిజన్ అందక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. చిన్నచిన్న టిక్కీలు వంటి ఇళ్లలో బస జేసి షూటింగ్ పూర్తి చేసుకున్నారు. కథంతా ప్రధానంగా నానీ .. మాళవిక లపై నే సాగుతుంది. చిన్నపాత్రల్లో స్థానికులనే ఉపయోగించుకున్నారు.

30 రోజులు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండి టీమ్ పనిచేశారు. సెల్ ఫోన్స్ .. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా లేదని అప్పట్లోనే నాగ్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి కష్టానికి తగిన ఫలితం కూడా అందుకున్నారు. అన్నట్టు ఈ సినిమాకు సీక్వెల్ తీస్తామని ఆ మధ్య అశ్విన్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఆ ప్రాజెక్టు ఏమైందో మరి ?

కథా పరంగా చిన్నలోపాలు ఉన్నప్పటికి దర్శకుడు సమర్ధవంతంగా సబ్జెక్టు ను డీల్ చేసాడనే చెప్పాలి. నాని . మాళవిక అయ్యర్ లు వారి పాత్రలకు న్యాయం చేశారు. దేవరకొండ విజయ్ కరెక్ట్ గా సూట్ అయ్యారు. మిగిలిన పాత్రల పరిధి తక్కువ. అందరూ బాగానే చేశారు. హిమాలయాల అందాలను రాకేష్‌, నవీన్‌లు ఆకట్టుకునేలా చిత్రీకరించారు. రాధాన్‌ నేపధ్య సంగీతం బాగుంది. కథనం కొంత స్లో అనిపిస్తుంది. ఇది అందరికి నచ్చే సినిమా కాదు. భిన్నమైన సినిమాలు చూసే వారికి బాగా నచ్చుతుంది. ఆరేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమా యు ట్యూబ్ లో ఉంది. అపుడు చూడని వాళ్ళు ఇపుడు చూడవచ్చు.

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!