Ghantasala the Great ………………..
“ఘంటసాల ది గ్రేట్”…. దిగ్గజ గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ బయోపిక్ తీశారు. సినిమా నిర్మాణం పూర్తి అయింది. త్వరలో విడుదల కానుంది.ఘంటసాల అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.ఒక గాయకుడి జీవిత చరిత్ర ఆధారం గా వస్తోన్న మొదటి బయోపిక్ ఇదే కావచ్చు.
తెలుగు సినిమా తొలి తరం మాస్ హీరోలు అక్కినేని, నందమూరిలతో పాటే సినిమా ప్రవేశం చేశారు ఘంటసాల. ఇద్దరికీ ఘంటసాల ప్లేబ్యాక్ పాడితేనే జనం వింటారు అనేంతగా పాడారు. నటుడి నట ధర్మాన్ని ఆకళింపు చేసుకుని పాడితే చాలు…ప్రేక్షకులు ఆ నటుడే పాడుతున్న అనుభూతి పొందుతారనేవారు ఘంటసాల.
ప్లేబ్యాక్ సింగింగ్ కు ఆయన ఒక ఒరవడి తీర్చారు అనేది ఇందుకే. గాత్రంతో నటించడం ఆయన ప్రత్యేకత.ప్లేబ్యాక్ సింగర్ కు ఉండాల్సిన మొదటి లక్షణం గాత్రంతో నటించగలగడం … అలా పాడేస్తే నటుడి పని సులువైపోతుంది.
ఘంటసాల చిన్నతనంలో స్టేజ్ పెర్ఫామెన్స్ ఇచ్చేవారు. అలా ఆయనలో నటుడు… కవి ఉన్నారు.బహుదూరపు బాటసారి పాట ఆయన రాసినదే. ఆయనలో సంగీత దర్శకుడు ఉన్నాడు. ఈ త్రివేణీ సంగమం ఆయనతో అద్భుతాలు చేయించింది.
కవి భావాన్ని, పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకుని…పాత్రలో లీనమై గాత్రంతో నటించేవారాయన.అందుకే తెర మీద ఆ పాటలు ఆ నటుడే పాడుతున్నట్టుగా ప్రతిఫలించేవి. ఇదే ఆయన సక్సస్ మంత్ర.. … ఈ రోజుకీ మన మనసులతో ఆ గానం వీడని బంధం వేసుకుని పెనవేసుకుపోడానికి అదే కారణం..
అలా సంగీతానికి సొబగులద్దిన టాలీవుడ్ దిగ్గజ,గాయకుడు సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల వేంకటేశ్వరరావు బయోపిక్ ను ఎంతో గ్రాండ్ గా సి.హెచ్. రామారావు స్వీయ దర్శకత్వంలో తెర కెక్కించారు. ఈ చిత్రంలో ఘంటసాల లైఫ్ లోని విభిన్న ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారు.
మహాగాయకుడిగా ఆయన ప్రస్థానం, సంగీత రంగంలో ఆయన చేసిన సేవలు, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన వ్యక్తిత్వం వంటి విభిన్న కోణాలను కథగా మలచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమాలో ఘంటసాల పాత్ర పోషించిన కృష్ణ చైతన్య సింగర్ కాదు.. యాక్టర్ కాదు. ఘంటసాల పాటలు వింటూ పెరిగారు. మేకప్ లో ఘంటసాల మాదిరిగానే ఉన్నారు.
అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో శ్రీమతి సి.హెచ్. ఫణి నిర్మాణ సారథ్యంలో సి.హెచ్. రామారావు రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.ఈ సినిమాలో కొత్త నటుడు కృష్ణ చైతన్య ఘంటసాలగా, నటి మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించారు. నటుడు సుమన్ ముఖ్య పాత్రను పోషించారు.
ఘంటసాల ది గ్రేట్’ (Ghantasala The Great) డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే వాయిదా పడింది.

