కాలభైరవుడు కరుణిస్తే …….

Sharing is Caring...

కాలభైరవుడు కరుణిస్తే …. అన్నికార్యాలు  సజావుగా జరుగుతాయి .  మన దేశంలో కాలభైరవ ఆలయాలు ఎక్కువగా లేకున్నా కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. కాలభైరవుడిని కొలిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం . ఆయనను ఆరాధిస్తే ఆయుష్ కూడా పెరుగుతుందంటారు. ఇంతకూ ఈ కాలభైరవుడు ఎవరు ? ఆ వివరాలు తెలుసుకుందాం.

కాలభైరవుడు శివుని  అపరాంశ అని భక్తులు నమ్ముతారు.  కాలభైరవుడు అనగానే వెంటనే హేళనగా కుక్క అనేస్తారు. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్క అంటే విశ్వసనీయతకు మారుపేరు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక.మన పురాణాల ప్రకారం అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోథ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు,భీష్మ భైరవుడు, శంబర భైరవుడు అని 8 రకాల కాలభైరవులున్నారు . వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు.

స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. నాలుగు చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె, డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ”ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌” అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ ఆలయాలు తక్కువ.  కాలభైరవ క్షేత్రాలు ఎక్కువగా  ఉన్నాయి.

ఈ క్షేత్రాలలో ఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ క్రమంలోనే గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. అక్కడి ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవం.  నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు. ఖాట్మండు నగర మధ్యంలో వున్న కాలభైరవ మూర్తి ముందు సత్య పరీక్షలు జరిగేవట .  ఆ విగ్రహం ముందు ఎవరైన అబద్దం చెపితే సజీవులై వుండరని నమ్మకం. ఇటువంటిదే కాణిపాకంలో వినాయకుని గురించి కూడా చెబుతారు. ఈ ఆధునికయుగంలో ఇవన్నీ  ఆశ్చర్యం కలిగిస్తాయి.

ఇక గ్రహబలాలను అధిగమించి అదృష్ట జీవితాన్ని, సంకల్ప సిద్ధిని పొందడం భైరవోపాసనతో సాధ్యం అంటారు. కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి  అనేక సంవత్సరాలు కాలభైరవాలయంలో సాధన చేసినట్లు చెబుతారు. మంత్ర తంత్ర సాధనల్లో ఏం సాధించాలనుకున్నా ముందు భైరవుని అనుమతి తీసుకుంటారు. అతీంద్రియ శక్తులను కాలభైరవుడు ప్రసాదిస్తాడని అంటారు. కానీ భైరవుని అనుగ్రహం పొందడం అంత సులభం కాదంటారు.ఈ కాల భైరవుడి  గురించి మరెన్నో పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 

న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది.కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లోని  శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు.  ద్రాక్షారామంలో కాలభైరవుడికి  ప్రత్యేక ప్రాధాన్యముంది.నిజామాబాద్‌లోని సదాశివనగర్ ఇస్సన్నపల్లిలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది.ప్రకాశం జిల్లాలో ఒంగోలు కు సమీపం లోని మాచవరం లో కాలభైరవుని దేవాలయం ఉంది.2009 లో ఈ దేవాలయాన్ని నిర్మించారు.

——  Ksk . Theja

Read Also >>>>>>>>      మధ్య మహేశ్వరుడి ని దర్శించడం కష్టమే!

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!