వెండితెర పై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part1)

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………….

Ntr  experiments on silver screen …………………………….విజయాలను, పరాజయాలను  ప‌క్క‌న పెట్టి నిర్మాత‌గా ప్ర‌యోగాలు చేసిన న‌టుడు నందమూరి తారక రామారావు. రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ మీద స్వీయ దర్శకత్వంలో నందమూరి నిర్మించిన చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. నటన పరంగానే కాదు..

.ఆలోచనల పరంగానూ కొత్తదనాన్ని అందించిన ఘనత రామకృష్ణ సినీ స్టూడియోస్ చిత్రాలకు దక్కుతుంది. నటుడుగా తను చేయాలనుకున్న పాత్రలు ఈ బ్యానర్ లోనే పోషించారు రామారావు.అలాగే… తన అభిప్రాయాలను ప్రకటించే చిత్రాల నిర్మాణానికీ ఈ బ్యానర్ సినిమాలనే అస్త్రాలుగా చేసుకున్నారాయన.

తాతమ్మ కలతో రామకృష్ణ సినీ యాత్ర ప్రారంభం అయింద‌నుకుంటాను. తాతమ్మ కల సెన్సార్ వివాదాలను తెలుగువారికి బాగా పరిచయం చేసిన సినిమా. ఇందిరాగాంధీ ప్రభుత్వ ఆలోచనల మీద…ఎమర్జన్సీ రోజుల్లోనే విమర్శ ఎక్కుపెట్టడం మామూలు విషయం కాదు.

ఎన్.టి.ఆర్ లాంటి సాహసికి మాత్రమే సాధ్యమైన విషయం. తనకు అనిపించింది చెప్పడానికి ఏ నాడూ వెనకాడని వ్యక్తిత్వం నందమూరి తారక రామారావుది. అదే ఆయన సినిమాల్లోనూ కనిపించేది. పెరుగుతున్న జనాభాను కట్టడి చేయడానికి ఇందిరాగాంధీ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని సీరియస్ గా అమలు చేసే ప్రయత్నం చేశారు.

దేశ ద‌రిద్రానికి కార‌ణం జ‌నాభా అని చెప్పేవారు ఇందిరాగాంధీ,సంజ‌య్ గాంధీలు. అయితే ఈ దేశ జ‌నాభాకు అన్నం పెట్ట‌ద‌గ్గ సంప‌ద ఈ దేశంలో ఉంది… కానీ మొత్తం సంప‌దంతా కొద్దిమంది ద‌గ్గ‌రే పోగుప‌డ‌డం వ‌ల్ల మెజార్టీ ప్ర‌జ‌లు ద‌రిద్రంలో మ‌గ్గిపోతున్నారు. సంప‌ద అంద‌రికీ స‌మానంగా పంపిణీ చేయాల‌నే ఆలోచ‌న కాక జ‌నాభా స‌మ‌స్య‌ను ముందుకు తీసుకు వ‌చ్చి అభ్యుద‌య ఫోజు కొట్టారు ఇందిర‌మ్మ. 

ఈ కుటుంబ నియంత్ర‌ణ కార్య‌క్ర‌మం మీద కొన్ని విమ‌ర్శ‌లు చేసే ప్ర‌య‌త్నం చేశారు ఎన్టీఆర్ . అందుకే తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ అనే పదాన్ని తొలగించి కుటుంబ సంక్షేమంగా మార్చింది. సరిగ్గా ఇదే అంశం మీద ఎన్.టి.ఆర్ తనదైన పద్దతిలో స్పందించి తీసిన చిత్రమే తాతమ్మకల.

ఉమ్మడి కుటుంబాలకు కాదని పట్టణాలకు ఎగబడడం … పిల్లలు వద్దనుకోవడం లాంటి ఆలోచనల మీద నందమూరి సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. భానుమతి పాత్రతో చెప్పించే డైలాగ్స్ వివాదానికి దారి తీశాయి. సుప్రీం కోర్టు కు వెళ్లి మరీ సర్టిఫికెట్ తెచ్చుకోవాల్సి వచ్చింది. చాలా కట్స్ తర్వాత విడుదలైన చిత్రం తాతమ్మకల.

1974లో విడుదలైన తాతమ్మకల తర్వాత వేములవాడ భీమకవి చిత్రాన్ని నిర్మించారు ఎన్.టి.ఆర్. బాలయ్యతో టైటిల్ రోల్ వేయించారు. అయితే రామకృష్ణ సినీ స్టూడియోస్ లో నిర్మాణం జరుపుకున్న తొలి చిత్రం మాత్రం దానవీరశూర కర్ణ. ఈ చిత్రం క్రియేట్ చేసిన రికార్టులు చాలానే ఉన్నాయి. మొద‌టి రెండ‌వ విడుద‌ల‌లో క‌లిపి రెండు కోట్లు ఆ రోజుల్లో వ‌సూలు చేసిన సినిమా అది.

దాన వీర శూర కర్ణ సినిమా మరోసారి నందమూరి తారక రామారావు తాత్విక ధోరణులను ప్రపంచానికి పరిచయం చేసింది. త్రిపురనేని రామస్వామి చౌదరి, పెరియార్ రామస్వామి ఆలోచనలు నందమూరి తారక రామారావు మీద వేసిన ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది దాన వీర శూర కర్ణలో. హేతువాదిగా పాపులర్ అయిన కొండవీటి వెంకటకవికి క‌త్తి ప‌ద్మారావును జ‌త చేసి పౌరాణిక చిత్రానికి రచన చేయించడం మామూలు విషయమా?

మరో వైపు ఎన్.టి.ఆర్ ఇంటర్ చదివే రోజుల్లోనే విశ్వనాథ సత్యనారాయణ శిష్యరికం చేశారు.  నాటకాల్లో దుర్యోదనుడి పాత్ర చిత్రణ ప్రభావం కూడా ఎన్.టి.ఆర్ మీద ఉంది. ఈ తాత్విక నేపధ్యంలో రూపుదిద్దుకున్నదే దాన వీర శూర కర్ణ సినిమాలో దుర్యోధనుడి పాత్ర. సాంకేతికంగానూ తారాగణ పరంగానూ అత్యున్నత ప్రమాణాలతో తీసిన కురుక్షేత్రం తో పోటీగా విడుదలైన దాన వీర శూర కర్ణ అదరగొట్టే హిట్ కొట్టడం వెనుక నందమూరి తాత్విక ధోరణి ప్రజలకు కొత్తగా అనిపించడమే కారణం.

దాన వీర శూర కర్ణ సంచలన విజయం తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన చిత్రం చాణక్య చంద్రగుప్త. డి.ఎల్ రాయ్ రాసిన చాణక్య నాటకం ప్రేరణతో పింగళి నాగేంద్రరావు రాసుకున్న స్క్రిప్ట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. పింగళి మరణించిన ఆరేళ్లకు ఈ సినిమా విడుదల కావడం విశేషం.

ఎన్.టి.ఆర్, ఎఎన్నార్, శివాజీ గణేశన్ నటించిన ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే సంచలనం సృష్టించింది. ఈ చిత్ర విశేషాల్లో ప్రధానమైనవి ఎన్టీఆర్ స్వంత చిత్రంలో ఆయన దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వర్రావు నటించడం. వీళ్ల‌కు తోడు శివాజీ గణేశన్ భాగస్వామి కావడం మరో విశేషం.

పింగళి తో త‌న సినిమాల‌కు స్క్రిప్ట్ వర్క్ చేయించాలనుకున్నారు రామారావు. అందుకోసం ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఆ త‌ర్వాత ఆరోగ్యం దెబ్బ‌తిన‌డం … పింగళి నాగేంద్రరావు మరణించదంతో డైలాగ్స్ ఇతర కార్యక్రమాలన్నీ కొండవీటి వెంకటకవితో కానిచ్చేశారు. పాటలు మాత్రం యధావిధిగా నారాయణరెడ్డే రాశారు.

ఈ సినిమాలో అక్కినేని నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా స్మశానంలో సీన్ అయితే నాగేశ్వరరావు బాగా పండింది.అయితే పింగళి నాగేంద్ర‌రావు లోనూ,ఆ మాట కొస్తే డి.ఎల్ రాయ్ లోనూ క‌నిపించే ధోర‌ణి తాము అనుకున్న ల‌క్ష్యానికి అనుగుణంగా న‌డ‌ప‌డానికి తాము రాసేది చారిత్రాత్మ‌క నాట‌క‌మైనా పౌరాణిక‌మైనా కొత్త పాత్ర‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టి … కొత్త ఆలోచ‌న‌లు క‌లిగించే ప్ర‌య‌త్నం చేసేవారు.

ఈ ధోర‌ణిని వారే ర‌చ‌యిత‌లుగా పూర్తిగా బాధ్య‌త తీసుకుని ప‌నిచేస్తే స‌మ‌ర్ధించుకునే ప‌ద్ద‌తిలో న‌డిచేది క‌థ‌.స‌గం ఆయ‌న రాసి మ‌రో స‌గం వేరే ఎవ‌రో పూర్తి చేయ‌డంతో సినిమాలో స్క్రిప్టు ప‌రంగా చాలా అతుకులు క‌నిపిస్తాయి. … అలా వ‌సూళ్ల ప‌రంగా పెద్ద ప్ర‌బావం చూపించ‌క‌పోయినా … చాణ‌క్య చంద్ర‌గుప్త భారీ ఓపెనింగ్స్ రాబ‌ట్టింది. రెండు రూపాయ‌ల ముప్పై పైస‌ల బాల్క‌నీ టిక్కెట్టు రెండు వంద‌ల దాకా అమ్ముడ‌య్యింది మొద‌టి రోజు.

pl.read it also …….. వెండితెర పై ప్రయోగాలు ఆయనకే సాధ్యం ! (part1)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!