ఉత్తేజ భరితం నాటి పోరాటం !

Sharing is Caring...

Exciting struggle of the day!…………………………………….

ఎందరో యోధుల త్యాగఫలం ఈ నాటి మన స్వేచ్ఛ. 1498 నుంచి 1947 వరకు.. 449 ఏళ్ళు మనమంతా విదేశీ పాలకుల పడగ నీడలో గడిపాము.ఇవన్నీ మర్చిపోలేని చేదు జ్ఞాపకాలు. పోర్చుగీసులు, డచ్చులు, డేన్స్‌, బ్రిటిషర్లు , ఫ్రెంచ్‌ పాలకులు వరసపెట్టి మన దేశాన్ని ఏలారు.

కోటానుకోట్ల భారతీయ సంపదను వారంతా ఇష్టమొచ్చిన రీతిలో  దోచుకున్నారు. వారికీ వారికీ మధ్య జరిగిన యుద్ధాల్లో లక్షల మంది భారతీయలు ప్రాణాలు కోల్పోయారు.  1833లో గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన  విలియం బెంటిక్‌ నుంచి 1948 లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ వరకు మనపై బ్రిటిష్ పాలకుల పెత్తనం కొనసాగింది.

1856 వరకు బ్రిటిషర్లతో  జరిగిన పోరాటం ఒక ఎత్తయితే, 1857లో ఝాన్సీ లక్ష్మీబాయితో మొదలయిన సమరం మరో ఎత్తుగా చెప్పుకోవాలి.1857 నాటి భారత ప్రథమ స్వతంత్ర సంగ్రామం తరువాత వరుసగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి . బ్రిటిష్‌ కబంధ హస్తాల నుంచి భారత్‌ను విముక్తి చేయడమే లక్ష్యంగా జరిగిన పోరాటాలలో ఎందరో యోధులు  ప్రాణాలు కోల్పోయారు.

1876లో సురేంద్రనాథ్‌ బెనర్జీ ఇండియన్‌ నేషనల్‌ మూవ్‌మెంట్‌ స్థాపించగా, 1885లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పుట్టింది.  1905లో స్వదేశీ ఉద్యమం, 1916లో హోమ్‌ రూల్‌, 1919లో ఖిలాఫత్‌, 1922లో చౌరీచౌరా, సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో దండి యాత్ర,శాసనోల్లంఘన ఉద్యమం జరిగాయి. 1942లో క్విట్‌ ఇండియా నుంచి 1948 జనవరి 30న గాంధీజీ చనిపోయేవరకు జరిగిన అనేక పోరాటాలలో స్వచ్చందంగా ఎంతోమంది నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

1919లో రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన పోరాటం.. జలియన్‌వాలా బాగ్‌లో జరిగిన మారణ కాండలో వందల మంది ప్రజల బలిదానం భారత స్వాతంత్య్ర  పోరాట చరిత్రలో మైలురాళ్లు. మహాత్మాగాంధీతో పాటుగా గోపాలకృష్ణ గోఖలే, చిత్తరంజన్‌దాస్‌, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్  త్యాగి, లాలా లజపత్‌రాయ్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మోతీలాల్‌ నెహ్రూ, బాలగంగాధర్‌తిలక్‌, భగత్‌సింగ్‌, సుఖదేవ్‌, రాజ్‌గురు, అనీబిసెంట్‌, సుభాష్‌చంద్రబోస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ, వల్లభ్‌భాయ్‌ పటేల్‌, రాజేంద్రప్రసాద్‌, అంబేద్కర్‌ వంటి  ఎందరో నాయకులు పోరాటంలో పాల్గొన్నారు.

ఎన్నోసార్లు అరెస్టయ్యారు. లాఠీదెబ్బలు తిన్నారు. ఈ మధ్యలోనే బెంగాల్‌ విభజన, వందేమాతరం ఉద్యమం వచ్చాయి. బ్రిటిషర్ల వలస పాలనకు చరమగీతం పాడి.. భరతమాతకు దాస్యశృంఖాల నుంచి విముక్తి కలిగించి.. కీలక ఘట్టంగా నిలిచింది క్విట్‌ ఇండియా ఉద్యమం. 1942 ఆగస్టు 8న విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అంటూ  గాంధీ ఇచ్చిన పిలుపుతో  ఉత్తేజితులై భారతీయులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. అయిదేళ్లలో  దేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది.

కాగా రవి అస్తమించని సామ్రాజ్యంగా పదే పదే చెప్పుకునే ఆంగ్లేయులకు రెండో ప్రపంచ యుద్ధంలో గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 1939లో హిట్లర్‌ ప్రారంభించిన ఈ యుద్ధంలో ఐరోపాలోని బ్రిటిష్‌ సేనలు మట్టికరిచాయి. బ్రిటిష్‌ సేనలు  ప్రాణాలు అరచేతులో పెట్టుకుని ఫ్రాన్స్‌‌లోని డన్‌ కర్క్‌ నుంచి నౌకల్లో స్వదేశానికి పరారయ్యారు.

తూర్పు నుంచి జపాన్‌ గండం ముంచుకొచ్చింది. ఆసియాలో బ్రిటిష్‌ సామ్రాజ్య అంతర్భాగాలైన మలయా, సింగపూర్‌, ఇండోనేసియా, పాపువా న్యూగినియా, బర్మాల నుంచి బ్రిటిష్‌ సేనలను పారదోలిన తరవాత ఈశాన్య భారత్‌ పొలిమేరల దాకా జపాన్ సైన్యం దూసుకొచ్చింది.ఈ పోరులో బ్రిటిష్‌ సేనలు పెద్ద సంఖ్యలో చనిపోయారు. 

ఇక చేతుల్లో ఉన్న భారతదేశాన్ని జపాన్ హస్తగతం చేసుకుంటుందనే భయం బ్రిటిషర్లను  వెంటాడింది. మరోవైపు హిట్లర్‌ దాడులతో భయాందోళనలు పెరిగాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపాల నుంచి ముప్పేట దాడితో బ్రిటన్‌ ఉక్కిరిబిక్కిరైంది. ఆసియాలో జపాన్‌ దూకుడును అడ్డుకోవడానికి భారతీయుల సహకారం తీసుకోవాలని  బ్రిటన్‌కు మిత్రరాజ్యాలు సలహా ఇచ్చాయి.

నాడు వినిస్టెంట్ చర్చిల్‌.. భారతీయుల పట్ల తనకున్న హేయభావాన్ని కాసేపు పక్కనపెట్టారు. కాంగ్రెస్‌, ముస్లింలీగ్‌లతో రాయబారానికి 1942 మార్చిలో లేబర్‌ పార్టీ నేత సర్‌ స్టాఫర్డ్‌ క్రిప్స్‌ నాయకత్వంలో ప్రతినిధులను భారత్‌కు పంపారు. రెండో ప్రపంచ యుద్ధంలో తమకు సహకరిస్తే భారతదేశానికి సాధ్యమైనంత త్వరగా స్వయంపాలనను అందిస్తామని హామీ ఇచ్చారు. చివరకు పూర్తి స్వరాజ్యం కాకుండా బ్రిటిష్‌ సామ్రాజ్యంలో అంతర్భాగంగా డొమినియన్‌ ప్రతిపత్తి ఇస్తామంటూ బేరం పెట్టింది.

బ్రిటిష్‌ రాణికి విధేయత ప్రదర్శిస్తూ ఉండాలని షరతులు పెట్టింది. భారత్‌ నుంచి విడిపోదలచిన రాష్ట్రాలకు ఆ స్వేచ్ఛను ఇస్తామని ప్రతిపాదించింది. క్రిప్స్‌ రాయబారాన్ని కాంగ్రెస్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. క్రిప్స్‌ రాయబారం విఫలం కావడంతో 1942 జులైలో వార్ధాలో సమావేశమైన కాంగ్రెస్‌ కార్యవర్గం బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని తీర్మానించింది.  నాడు నాయకులు పిలుపు ఇవ్వగానే ప్రజలు ఉద్యమం చేపట్టారు. 

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!