Not so scary movie ………………….
ఇదొక తమిళ హర్రర్ మూవీ. అడవి అందాలను తిలకిద్దామని ..అలాగే ట్రెక్కింగ్ చేద్దామని వెళ్లిన మిత్ర బృందం అడవిలో ఎలా ఆత్మ బారినపడ్డారు అనే కథ ఆధారంగా తీసిన సినిమా. 95 శాతం షూటింగ్ అడవిలోనే జరిగింది. పేరుకే ఇది హర్రర్ మూవీ కానీ భయపెట్టె సన్నివేశాలు లేవు. ఏమవుతుందో అన్న ఉత్కంఠ రేకెత్తించే సినిమా.
మీనా (గాయత్రి) చరణ్ (దేవ్ రామ్ నాథ్) ప్రేమికులు .. వీరిద్దరూ మరో ముగ్గురు స్నేహితులు జెర్రీ, చారు, సేతులతో కలసి అరాణ్మణైకాడు అటవీ ప్రాంతానికి వెళతారు. గెస్ట్ హౌస్ వాచ్ మాన్ మారిని (బాలా శరవణన్)ను గైడ్ గా తీసుకెళతారు. ఫారెస్ట్లో కొంత దూరం వెళ్ళాక ఒక చోట నిషేధిత ప్రదేశమని బోర్డు కనపడుతుంది.
లోపలికి వెళ్లకుండా కంచె కూడా ఏర్పాటు చేసి ఉంటుంది.. లోపల దుష్టశక్తి ఉందని వెళ్లకూడదని మారి చెబుతాడు. ఆవిషయమై మారితో మీనా ,చారు లు గొడవ పడతారు. చరణ్ సర్ది చెప్పడంతో లోపలికి వెళ్లకుండా వ్యూ పాయింట్ చూద్దామని బయలుదేరతారు. ఒకరి వెనుక ఒకరు నడుస్తుండగా చారు కి పక్కన యేవో శబ్దాలు వినబడతాయి.అటుగా వెళుతుంది.
లోయ అంచున నిలబడి చూస్తుండగా ఎవరో తోసినట్టు ఫీల్ అవుతుంది . అంతలో మారి ఆమెను వెనక్కి లాగుతాడు. వ్యూ పాయింట్ చూసాక అందరూ ఒక చోట టెంట్స్ వేసుకుంటారు. ఈ క్రమంలోనే మీనా, చరణ్ ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్ జెర్రీ ప్రయత్నిస్తాడు. జెర్రీ ని టీజ్ చేసేందుకు మిగతా వారు దాక్కుంటారు.
చెట్టు వెనుక దాక్కున్నారని అక్కడకు వెళ్లిన జెర్రీ కి ముసలి ఆత్మ కనబడుతుంది. భయపడి వెనక్కి వస్తుండగా చారు చెట్టుచాటున దాక్కున్నట్టు కనిపిస్తుంది. అక్కడికి వెళ్లగా అతని కాలు పట్టుకుని ఎవరో లాగుతారు. దాంతో జారి కింద పడతాడు. అపుడు ఫ్రెండ్స్ వస్తారు నవ్వుతూ .. జెర్రీ ని పిరికివాడంటూ ఎగతాళి చేస్తారు.
ఈ సందర్భం లోనే సిద్ధూ జెర్రీ ఘర్షణ పడతారు. జెర్రీ మీకు ధైర్యముంటే నిషేధ ప్రాంతమున్న బోర్డుకి కట్టి రమ్మని హ్యాండ్ కర్చీఫ్ విసురుతాడు.. మారి చెప్పినా వినకుండా చారు, సిద్ధూ బోర్డు దగ్గరకు బయలు దేరుతారు.. ఇక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది.
అడవిలో ఆత్మ వీళ్ళతో ఎలా ఆడుకుంది ? పాడు బడిన ఇంట్లో ఏముంది ? ఏయే అనుభవాలు ఎదురైనాయి? పేచీ అనే భయంకరమైన ఆత్మ అక్కడ ఎందుకుంది ? దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి ? చెట్టులో బంధించబడిన పేచీ ఆత్మ ఎలా బయటకు వచ్చింది? ఆత్మ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ఐదుగురు ఫ్రెండ్స్ ఏం చేశారు? తమ ప్రాణాలను కాపాడుకున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
దర్శకుడు రామచంద్రన్ కథపై మరింత కసరత్తు చేసి ఉండాల్సింది. ముఖ్యంగా ఆత్మ పగ సాధింపు విషయం కన్విసింగ్ గా లేదు. సినిమా ఓపెనింగ్ సీన్ బాగా తీశారు..హీరోయిన్ కు పేచీ ఆత్మతో లింక్ పెడుతూ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కానీ ముగింపు వేరే విధంగా తీస్తే బాగుండేది.
తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను షూట్ చేశారు. నటన పరంగా అందరూ బాగా చేశారు. సాంకేతికంగా చూస్తే సినిమా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది. సినిమాలో డ్రోన్ షాట్స్ అద్భుతంగా తీశారు.
పార్థిబన్ అడవి అందాలను బాగా తెరకెక్కించారు. రాజేష్ మురుగేసన్ బాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయింది. సినిమా అంతగా ఆడలేదు. అమెజాన్ ప్రైమ్ , ఆహా ఓటీటీ ల్లో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తి ఉన్నవారు చూడవచ్చు. ఒక గంటా యాభై నిమిషాల చిన్న సినిమా.

