Bharadwaja Rangavajhala …………….
సముద్రాల రాఘవాచార్యులు…తెలుగు సినిమా సాహిత్యంలో చాలా విస్తృతంగా వినిపించే పేరు.
పి.వి.దాసు, గూడవల్లి రామబ్రహ్మం లాంటి వాళ్ల ద్వారా బెజవాడ నుంచీ మద్రాసు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన సముద్రాల రాఘవాచార్యులు ఇది అది అని కాదు ఏ తరహా పాటనైనా రక్తి కట్టించారు.
ఓ దశలో తెలుగు సినిమా పాటకు సర్వనామ రచయిత అయ్యారు.మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు ఆరుద్రతో అన్నమాట …నేను సముద్రాల అనే కలం పేరుతో రాస్తాను అని. ఘంటసాల వెంకటేశ్వరరావు అనే సంగీత దర్శకుడు గాయకుడ్ని ఇండస్ట్రీకి అందించింది సముద్రాలే.
సముద్రాల మాటలు పాటలు కూడా రాసేవారు.నరసరాజు గారు లాంటి కొందరు కేవలం మాటలు మాత్రమే రాసేవారు.అన్నపూర్ణ వారి తొలి చిత్రం దొంగరాముడు లో ఓ నాన్ వెజ్ గీతం రాయాల్సి వచ్చింది సముద్రాలకు. రారోయి మా యింటికి పాటలో అరకోడి కూర, రొయ్యపొట్టు చారు అనే పదాలు ఆయన కళా దర్శకుడు సూరపనేని కృష్ణారావు దగ్గర తెల్సుకుని వాడారు.
పింగళి నాగేంద్రరావు, మల్లాది రామకృష్ణశాస్త్రి, కొసరాజు, ఆత్రేయ లాంటి కవులున్నప్పటికీ స్టార్ రైటర్ సముద్రాలే … ఆయన కుమారుడు రామానుజాచార్య కూడా చాలా పాటలు రాశారు. ఆ మధ్య రాఘవాచార్యులు గారి సినీగీతాలను ఆయన మనవరాళ్లు అచ్చు వేయించారు.
నాగయ్య గారి విగ్రహం పక్కనే ఆయన విగ్రహాన్ని హైద్రాబాద్ ఫిలింనగర్ లో ఏర్పాటు చేశారు.సముద్రాల అనే ఇంటిపేరు వల్లే సముద్రమంత సినీ సాహిత్యాన్ని ఆయన సృష్టించి ఉండవచ్చు… గూడవల్లి గారితో ప్రజామిత్ర పత్రిక కాలంలో తీసిన ఆయన ఫొటోల్లో నామాలు కనిపించవు. కానీ తర్వాత తీసిన అన్ని ఫొటోల్లోనూ నామాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
తెలుగు సినిమా సాహిత్యం లో ఆయనది మర్చిపోలేని స్థానం. దర్శకుడు విశ్వనాథ్ దీ సముద్రాల రాఘవాచార్యుల వారిదీ ఒకటే ఊరు.పెదపులివర్రు అనుకుంటా.సముద్రాల వారు రాసిన హిమగిరి సొగసులు, జీవము నీవే కదా , చిగురాకులలో చిలకమ్మా, ఎందుకోయీ తోటమాలీ, ఏమనెనే చిన్నారి ఏమనెనే … పాటలు నాకు చాలా చాలా ఇష్టం.
Tharjani ……..
తెలుగు సినిమా తొలి దశాబ్దమైన 1930లలోని మొదటి ‘మాయాబజార్’ (1936), ‘ద్రౌపదీ వస్త్రాపహరణం’ (1936) నాటి నుంచి సినీ రచనలో ఉంటూ, ఆ పై జీవించిన మూడు దశాబ్దాల కాలంలో ‘యోగి వేమన’, ‘దేవదాసు’, ‘విప్రనారాయణ’, ‘భూకైలాస్’, ‘శ్రీసీతారామ కల్యాణం’, ‘నర్తనశాల’ లాంటి ఎన్నో సినీ ఆణిముత్యాలకు మాటలు,పాటలు అందించిన గొప్ప రచయిత సముద్రాల సీనియర్.
తెలుగు సినిమా రచనలో తొలి తరానికి చెందిన సముద్రాల సీనియర్ (రాఘవాచార్య) రాసిన పాటలు, మాటలు ఇవాల్టికి జనంలో నిలిచిపోయాయి.అక్కడక్కడా వినిపిస్తుంటాయి. సముద్రాల సీనియర్ రాసిన మధుర గీతాలు ఎన్నో ఉన్నాయి.
జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే (లవకుశ) జననీ శివకామినీ (నర్తనశాల) రాజశేఖరా నీపై మోజు తీరలేదురా (అనార్కలి) శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా (లవకుశ) సీతారాముల కల్యాణం చూతము రారండీ ( సీతారాము కళ్యాణం)
జయహే కృష్ణావతారా ( శ్రీకృష్ణావతారం) పిలువకురా అలుగకురా (సువర్ణ సుందరి )కరుణా చూడవయా పరము జూపవయా మురళీ మోహనా వినీల మేఘశ్యామా(దీపావళి ) పలుకరాదటే చిలుకా సముఖములో రాయబారమెందులకే (షావుకారు ) ఓ చిగురాకులలో చిలకమ్మా.. చిన్నమాట వినరావమ్మా,రారోయి మా ఇంటికి (దొంగ రాముడు ) సలలిత రాగ సుధారససారం, సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి,దరికి రాబోకు రాబోకు రాజా (నర్తన శాల ) ఇలా రాసుకుంటే పోతే బోలెడు పాటలు ఉన్నాయి.

