Srinivasreddy Lethakula …………………… All are living characters
కొందరి రచనల్లో కొన్నే బాగుంటాయి.మరి కొందరు రాసిన ప్రతి వాక్యం అమూల్యంగా ఉంటుంది.వారి ప్రతి రచన పాఠకుల్ని ఇట్టే ఆకర్షించుకుంటుంది.అలా రాసిన ప్రతి వాక్యాన్ని పాఠకుల చేత కదలకుండా చలింపజేసే శక్తి డా.యస్.యల్.భైరప్ప గారికి ఉంది.
నంజనగూడు అనే ఊరు మైసూర్ కి దగ్గర కపిల నది ఒడ్డున జరిగిన కథ ఇది. ఈ నవలలోని ముఖ్య పాత్రలు శ్రీనివాస శ్రోత్రి, భార్య భాగీరథమ్మ,వారి దివంగతుడైన కొడుకు నంజుండడు, చిన్న వయసులోనే విధవ అయిన కోడలు కాత్యాయని, వారి ఇంటి (పని)మనిషి లక్ష్మి,
మనుమడు శ్రోత్రీ,ప్రాచీన భారతీయ రాజ్య శాస్త్రము, ధర్మము లాంటి ప్రపంచ ప్రఖ్యాతి గ్రంథాలు రాసిన సదాశివరావు, ఆక్స్ఫర్డ్ లో ఇంగ్లీష్ లిటరేచర్ చదివినా వారి తమ్ముడు రాజు(ఇతనినే కాత్యాయిని పునర్వి వాహం చేసుకుంటుంది),రావు గారి భార్యలు నాగలక్ష్మి,కరుణ రత్నే(శ్రీలంకకు చెందిన ఈమె ముందు శిష్యురాలు తర్వాత రెండో భార్య అవుతుంది ),ముఖ్య పాత్రలు.
ఈ పాత్రలన్నీ మనకు సజీవ పాత్రలుగా గోచరిస్తాయి.ఒక్కొక్క పాత్ర తమ ధ్యేయాన్ని సాధించడానికి అవతరించిన వారుగా మనకు కనిపిస్తారు.వేద శాస్త్ర పారంగతుడు ,కేవలం మడి కట్టుకొన్న బ్రాహ్మణుడిగానే కాక ,సాంఘిక సమస్య విలువలను, దేశ,కాల,మాన పరిస్థితులను గుర్తెరిగిన సదాచార సంపన్నుడుగా,భర్తగా, మామగా,తాతయ్యగా, ప్రఖ్యాతి గ్రంధకర్త ప్రొఫెసర్ రావు గారికి మార్గ నిర్దేశకుడిగా,శ్రీనివాస శ్రోత్రి గారు ఈ నవలలో మనకు కనిపిస్తాడు.
చివరకు తన పుట్టుక రహస్యం తెలుసుకుని,ఆస్తినంతటినీ ఇచ్ఛా పూర్వకంగా దానం చేసి సన్యాసించడంతో నవల ముగుస్తుంది. శ్రోత్రి గారి పుట్టుక రహస్యం ,కాత్యాయిని,రావుగారి తమ్ముడు రాజుతో పునర్వివాహం …ఇత్యాది విషయాలు తెలియాలంటే ఈ గ్రంథ పఠనం అవశ్యం.
ఈ నవలలో హంగులన్నీ ఉన్నాయి. పాత్రలన్నీ మనము నిత్యము చూచు వారి వలనే కాక, స్వభావ చిత్రణ, మనస్తత్వ నిరూపణ, సన్నివేశ కల్పన, భాష వైశిష్ట్యం, రమణీయ వర్ణనగా ,ఒక ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని, ఆధునిక దృష్టికోణం నుండి పరిశీలించిన గుణ సముదాయాలు హృద్యంగా,సహజంగా వున్నాయి మరియు చిత్రీకరించబడ్డాయి.
కథాకాలం నాటి పరిస్థితులు ఇండిపెండెన్స్ కి పూర్వం అయినా కూడా రచయిత ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఇందులో మనకు సదాచారాలు ,ఆధునిక పోకడలు, సాంఘిక నియమాలు ఆచరించడం, ఉల్లంఘించడం, షేక్స్పియర్ నాటకాలు, గ్రంథ రచనలు, రీసెర్చ్, పునర్వివాహాలు, నాటి సమాజ స్థితిగతులను కంటికి కట్టినట్టుగా చూపారు.
అలాగే మహాభారత కాలం నాటి ముఖ్యాంశం అయినా, సంతానం లేని గృహస్థుడు కేవలం వంశవృద్ధి ఉద్దేశంతో కొన్ని శాస్త్ర కర్మలను అనుసరించి “నియోగం” అనే పద్ధతి ద్వారా మరొకర్ని సంతానప్రాప్తికి ఉపయోగించుకోవడం అనే విషయాన్ని ఇందులో రచయిత అత్యద్భుతంగా ఆవిష్కరించాడు.
మన పూర్వికులు చేసిన పనుల్లో ఏయే వాటిని తిరస్కరించాలి ,ఏయే వాటి వల్ల స్ఫూర్తి పొంది ముందుకు నడవాలి అన్న విచక్షణ జ్ఞానంతో పాటు, గతం నుంచి నేర్చుకోవాల్సిన మంచి ఉన్నట్లే, నేర్చుకోకూడనివి కూడా ఉంటాయన్న సత్యం ఉంటుంది.
ఇది అందరికీ అన్వయించబడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు అని,ఈ నవలలోని ముఖ్య పాత్ర అయిన శ్రీనివాస శ్రోత్ర ద్వారా చెప్పించడంలో రచయిత కృతకృత్యుడయ్యాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. అనువాదకుడు అయిన ప్రొ. ఎస్ నాగభూషణం గారి అనువాదం సాఫీగా సాగింది.
ప్రతులకు: ఎస్ వి నారాయణ గారు,
Mobile No:9866115655.