Pudota Showreelu…………………………..
This is a must see place for nature lovers………………..రెండేళ్లుగా భయాల మధ్య బందీ అయిన నేను, ఎప్పుడెప్పుడు అలా కొండకోనల్లో తిరిగి వద్దామా,,పచ్చని ప్రకృతిలో సేద తీరుదామా అనుకుంటూ వుండగా,తమ్ముడి ద్వారా కాళహస్తి దగ్గరున్న వెయ్యి లింగాల కోన గురించి తెలిసింది. చుట్టూ ఎత్తైన కొండలు,అడవులతో నిండి వుండే కాళహస్తి కి ఆరు కి.మీ దూరంలో ఈ వెయ్యి లింగాల కోన వుంది.
కాళహస్తి నుండి రామాపురం వెళ్ళే దారిలో ఈ కోన వుంది. రోడ్ నుండి ఒకటిన్నర కి. మీ లోపలకు నడవాలి.సొంత వాహనాలు,ఆటోలలో గూడా కొండ వరకూ చేరుకోవచ్చు. అక్కడ నుండి కొండ ఎక్కటం మొదలుపెట్టాలి.కొండ పాదాల చెంతనే వున్న అందమైన జలపాతం తొలిగా మనకు కనువిందు చేసి,” నా ఈ సౌందర్యానికే అబ్బురపడుతున్నావా,ఇక పైకి ఎక్కి చూడు ఎన్నెన్ని అందాలో” అంటూ తొందర చేస్తుంది.
దట్టమైన అడవి,వెదురు పొదలు,పేరు తెలియని ఎన్నో పూల జాతులు సుగంధ పరిమళాలను వెదజల్లు తూ ఉండగా ఆ కొండ తన చేతులు చాచి ఆహ్వానిస్తూ ఉంటుంది. దిగువ జలపాతం చూసి, అక్కడే వున్న మార్కండేయ మందిరం దర్శించుకుని, నేను, సుపర్ణ,దామన్న కొండ ఎక్కటం మొదలు పెట్టాము.
మెట్లు కొద్దిగా నిటారుగా వున్నా ఎక్కటానికి ఇబ్బంది అనిపించలేదు.కాస్త చదునుగా వున్న చోట మెట్లు లేవు..నడవటానికి వీలుగా కాలి బాట వున్నది. దట్టమైన పెద్ద పెద్ద చెట్లు, ఎన్నో ఏళ్ల నుండి అలా పెనవేసుకుని బలపడ్డ దృఢమైన తీగలు,వెదురు పొదలతో నిండి ఉండి,నడుస్తూ వుంటే ఏ మాత్రం కష్టం తెలియ కుండా చెట్ల ఆకులు విసనకర్ర ల లాగా గాలి విసురుతూ వున్నాయి.. అందుకేనేమో అసలు అలసటే తెలియ లేదు.
ఆ పెద్ద కొండ శిఖరాగ్రానికి చేరుకోగానే,అక్కడ ఏ నాటి రాజులో కట్టించిన చిన్న నీడ నిచ్చే విశ్రాంతి మందిరం. నాలుగు పెద్ద పెద్ద రాతి దిమ్మెలపై,పైన రాతి పలకలు పరిచిన కట్టడం. కూర్చోవటానికి అనువుగా రాతి పలకలు.చల్లని ప్రదేశం.హాయిగా అనిపించింది. అక్కడే ప్రతి రోజూ చల్లని మజ్జిగ అమ్మే ఒకే ఒక అవ్వ. ఉప్పు, కొతిమీర కలిపిన చల్లని మజ్జిగ.. గ్లాసు పది రూపాయలు.అలిసి దప్పిక గొన్నశరీరానికి ఒక్కో గుక్కా లోపలికి వెళుతూ వుంటే,అమృతం తాగినట్లు వున్నది.
అక్కడ అవ్వ ఒక్కతే.ఇక ఎవ్వరూ ఆమెకు పోటీ లేరు.ఇక ఏ ఇతర తినుబండారాలు అమ్మటం లేదు. “అవ్వా, రోజూ మజ్జిగ కుండ మోసుకుని ఇంత పెద్ద కొండ ఎక్కి,దిగుతావు కదా.నీకు పోటీ గూడా ఎవరూ లేరు..నీ కష్టానికి తగ్గట్టు గ్లాస్ మజ్జిగ 20/రూ అమ్మవచ్చు కదా”అని అన్నాను..
దానికి ఆ అవ్వ”అమ్మా ఈ మజ్జిగ అమ్మి నేనేదో బోలెడంత సంపాదించాలి .. అనుకోవటం లేదు.కష్టపడి శివయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు కాస్త దప్పిక తీర్చటమే తప్ప నాకు సంపాదన మీద మోజు లేదు. రోజూ ఈ చిన్ని పొట్ట గడిస్తే చాలమ్మా” అన్నది..ఓహ్ ఎంత గొప్ప మాట..అవ్వతో మాట్లాడాక మళ్ళీ కొండ ఎక్కటం మొదలు పెట్టాం..
కోతులు కనబడగానే మా చేతుల్లోకి ఆయుధాలు తీసుకున్నాం.హహ హా అవే,పక్కనే వున్నవెదురు కట్టెలు. పెద్ద కొండ ఎక్కి దిగి దాన్ని ఆనుకుని వున్న చిన్న కొండ ఎక్కటం మొదలు పెట్టాం. చల్లని వాతావరణంలో హాయిగా కబుర్లు చెప్పుకుంటూ,ప్రకృతిని పరికిస్తూ నడుస్తున్నాము.
దూరంగా శిఖర దర్శనం అయింది..కొండ ఎక్కగానే ప్రశాంతంగా వున్న సహస్ర లింగేశ్వరుని గుడి..ముందుగా ఆ గుడికి కొద్ది దూరంలో దిగువన ప్రవహిస్తున్న జలపాతం దగ్గరకు వెళ్ళాం..కొండల మీద నుండి నీళ్ళు అక్కడే వున్న ఒక చిన్న పాలరాతి శివలింగం మీద పడుతూ వున్నాయి..ఈ నీళ్ళు ఎంతో ఔషధ విలువలు కలిగిన నీళ్ళు అని స్థానికులుచెబుతున్నారు..అందుకే ఎక్కువ మంది ఇక్కడ ఈ నీళ్లలో మునుగు తున్నారు..నీళ్ళు సీసాలలో నింపుకుని వెళ్తున్నారు.
ఇక్కడే మునులు తపస్సు చేసేవారట.రాత్రివేళ దేవతలు ఈ జలపాతం లోస్నాన మాడతారట.ఈ అడవిలోనే భక్త కన్నప్ప వేటాడుతూ .. ఈ శివలింగాన్నేపూజించాడని పూజారి చెప్పారు. ఇక్కడే పొరలుగా వున్న రాతి పై ఏనాడో శిల్పులు చెక్కిన శిల్పాలు ఉన్నాయి.శివపార్వతులు,వినాయకుడు,కుమారస్వామి, నంది,నారద,భక్త కన్నప్ప ఇంకా ఎందరో దేవతల శిల్పాలు చెక్కి వున్నాయి.
ఈ జలపాతం చూసి,అక్కడి నుండి అడవిలో కొండల మధ్య కొలువై వున్న,వెయ్యి లింగాల శివాలయానికి వెళ్ళాము.. ఒక పెద్ద శివలింగంపై వెయ్యి చిన్నచిన్నశివలింగాలు చెక్కి ఉన్నాయి..ఆ ప్రాంగణ మంతా ఎంతో శుభ్రంగా,ప్రశాంతంగా వుంది.. పర్యాటకుల రద్దీ ఎక్కువ లేదు..కాబట్టే ఇంకా ఈ ప్రాంతం ప్లాస్టిక్ తో , చెత్తాచెదారం తో నిండి పోలేదు.
కానీ అద్భుతమైన శిల్పాలు చెక్కిన అప్పటి శిల్పులు తమ పేర్లు చెక్కుకొలేదు గానీ,ప్రేమికులు మాత్రం ఆ ఎత్తైన రాళ్లపై తమ తమ పేర్లు,ప్రేమ చిహ్నాలు చెక్కి,ఆ రాళ్ళను కలుషితం చేశారు.. ఈ కొండకు కార్తీక మాసంలో,శివరాత్రి కి మాత్రమే భక్తుల రద్దీ వుంటుందని,తక్కిన రోజుల్లో ఎక్కువ మంది రారని చెప్పారు. అందుకే కాబోలు అడవి అందాలు కనువిందు చేస్తూ వున్నాయి..
ప్రకృతి ప్రేమికులు తప్పక చూడాల్సిన ప్రదేశం ఇది..