ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం !

Sharing is Caring...

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పౌరాణిక చిత్రాలు రెండే రెండు. అందులో ఒకటి కురుక్షేత్రం కాగా మరొకటి ఏకలవ్య. కురుక్షేత్రం 1977 లో విడుదల కాగా ఏకలవ్య 1982 లో రిలీజయింది. ఈ రెండు సినిమాల్లోనూ కృష్ణ తనదైన శైలిలో నటించారు. అర్జునుడిగా .. ఏకలవ్యుడిగాను మెప్పించారు.

ఈ రెండు సినిమాలను  బయట ప్రొడ్యూసర్స్ నిర్మించారు. కురుక్షేత్రం సినిమా నిర్మాణం మధ్యలో కృష్ణ భాగస్వామి అయ్యారు. ఏకలవ్య ను ప్రముఖ  నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి (ఎం ఎస్ రెడ్డి)నిర్మించారు. ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా తీశారు. కృష్ణ ఏకలవ్య సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వక ముందు 1976 లోనే ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఏకలవ్యుని కథను తెర కెక్కించాలని ప్రయత్నించారు.

ఎన్టీఆర్ తో కృష్ణుడు, ద్రోణుడు పాత్రలు , బాలకృష్ణతో ఏకలవ్యుడి పాత్ర చేయించాలని దాసరి ఆలోచన. స్వర్గం నరకం నిర్మాతలు ముందుకొచ్చారు. ఆరుద్ర సింగల్ లైన్ స్టోరీ కూడా సిద్ధంచేశారు. ఎన్టీఆర్ ఆ సమయంలో కర్ణ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్నారు. దాసరి ఎన్టీఆర్ ను సంప్రదిస్తే తర్వాత  చూద్దాం అన్నారు.

బాలకృష్ణ కూడా స్టడీస్ ముగిశాకనే  బయటి సినిమాల్లో నటిస్తారు అని చెప్పారు. తర్వాత కృష్ణ ను సంప్రదిస్తే అప్పట్లో ఆయన కూడా బిజీగా ఉన్నారు.శోభన్ బాబు ని అడిగితే ఒకే అన్నారు.హీరోయిన్ గా చేయడానికి జయప్రద కూడా సరేనంది. కృష్ణుడిగా రామకృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు. బడ్జెట్ ఎక్కువే అయ్యేలా అనిపించి నిర్మాతలు తటపటాయించారు. ఈ లోగా దాసరికి వేరే పెద్ద ప్రాజెక్టు రావడంతో ఆ సినిమా చర్చలు – సంప్రదింపుల దశలోనే ఆగిపోయింది.

ఆ తర్వాత ఐదేళ్లకు నిర్మాత ఎం ఎస్ రెడ్డి ఏకలవ్య చిత్ర నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన ముందుగా కృష్ణ ను  సంప్రదించారు. ఆయన అడగ్గానే కృష్ణ ఒకే అన్నారు. అలా ఏకలవ్య కథ తిరిగి తిరిగి సూపర్ స్టార్ దగ్గరకే వచ్చింది. దానవీర శూర కర్ణ తో పాపులర్ అయిన రచయిత కొండవీటి వేంకటకవి, ఎం ఎస్ రెడ్డి, అప్పలా చార్య, దర్శకుడు విజయా రెడ్డి కలసి కథను ఫైనలైజ్ చేశారు.

వేంకటకవి,అప్పలాచార్య మాటలు రాసారు. సినిమాలోని పాటలు, పద్యాలూ ఎం.ఎస్.రెడ్డి రాసారు . కవిగా మంచి పేరున్న మల్లెమాల మొదటి నుంచి తన సినిమాలకు తానే పాటలు రాసుకునేవారు. ఏకలవ్య లో అన్ని పాటలు బాగుంటాయి. మహదేవన్ మంచి బాణీలు అందించారు.  విజయారెడ్డి తెలుగు వాడైనా కన్నడ సినిమాలు తీసి పాపులర్ అయ్యారు.

ఏకలవ్య ప్రారంభం నుంచి ముగింపు దాకా ఎక్కడ బోర్ కొట్టకుండా దర్శకుడు కథను వేగం నడిపారు. సినిమా 90 శాతం అవుట్ డోర్ లో తీశారు. ఎస్ ఎస్ లాల్ కెమెరా పనితీరు సంగతి చెప్పనక్కర్లేదు.  యుద్ధ సన్నివేశాల్లో ట్రిక్ ఫోటోగ్రఫీ బాగుంటుంది.

ద్రోణుడు అడగగానే తన బ్రొటన వేలుని ఏక లవ్యుడు గురుదక్షిణ గా సమర్పించడం అనే పాయింట్ ఆధారం చేసుకుని సినిమా మొత్తం నడుస్తుంది. సీతారామరాజు తర్వాత సూపర్ స్టార్ ఇష్టపడి చేసిన పాత్ర ఇది.  సుదీర్ఘంగా ఉండే డైలాగులను కూడా కృష్ణ అలవోకగా చెప్పేసాడు ఈ సినిమాలో. హీరోయిన్ గా  జయప్రద .. ఏకలవ్యుడి తల్లిగా కృష్ణకుమారి నటించారు.

ద్రోణుడిగా గుమ్మడి .. అర్జునుడుగా శరత్ బాబు నటించారు. తెలుగు లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను హిందీ లో “వీర్ ఏక్ లవ్య్ ” పేరుతో డబ్ చేశారు. అక్కడ కూడా మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. సినిమా స్టార్టింగ్ లోనే ” మ్రోగింది ఢమురుఖం … మేల్కొంది హిమ నగం “.. పాట వస్తుంది.  ఈ పాట గురించి పార్ట్ 2 లో చెప్పుకుందాం. 

———–KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!