Subbarao Adimulam ………
మణికేశ్వరం..ఇది పురాతన శైవక్షేత్రం.ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా (పూర్వపు ప్రకాశం జిల్లా) అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్నఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు.
ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్నకాశీ అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని, ఇక్కడ పరమ శివుడు స్వయంభువుగా వెలిశాడని అంటారు.
స్థల పురాణం ప్రకారం ఉప్పు అమ్ముకొని జీవించే భక్తుడు శివరాత్రి రోజున పరమ శివుని పూజించడానికి శివలింగం లబించక పోవడం తో తన వద్ద ఉన్న మానిక ( కొలపాత్ర) ను లింగం గా భావించి పూజలు చేస్తాడు. శివుడు అతగాడి భక్తికి మెచ్చుకుని ఆ మానిక నే శివలింగం గా మార్చేస్తాడు. ఆందుకని ఈ క్షేత్రానికి మణికేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.
చరిత్రకారుల కథనం ప్రకారం ఒకప్పుడు ఇది బౌద్ధక్షేత్రం గా విలసిల్లింది. ఆలయానికి ముందుభాగంలో ఉన్న పాలరాతి స్థంభం… లోపల స్థంభాలపై ఉన్నఅక్షరాలు, బౌద్ధపు ఆనవాళ్ళను తెలియ జేస్తున్నాయి. ఇవి క్రీ.శ.మూడవ శతాబ్దం నాటివని అంటారు.
ఆలయ ఆవరణలో, గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలో లభించిన కొన్ని పురాతన స్తంభాలు, శాసనాలు బౌద్ధ నిర్మాణ శైలిని పోలి ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దేవాలయ ప్రాంగణంలో కొన్నిశాసనాలు,స్థంభాలపై కలువ పువ్వు రేకులు, సింహం బొమ్మ కనిపిస్తాయి.
మణికేశ్వరానికి సమీపంలో ఉన్న అద్దంకి ప్రాంతం ప్రాచీన కాలం నుండి బౌద్ధ, జైన మతాలకు నిలయంగా ఉండేది. గుండ్లకమ్మ నది ఒడ్డున అనేక బౌద్ధ స్తూపాలు, విహారాలు ఉండేవని చరిత్ర చెబుతోంది.
అనేక పురాతన బౌద్ధ క్షేత్రాలు కాలక్రమేణా శైవ లేదా వైష్ణవ క్షేత్రాలుగా మారినట్లే, మణికేశ్వరంలో కూడా బౌద్ధారామాలు ఉన్న చోట శైవ క్షేత్రం ఏర్పడి ఉండవచ్చని ఒక వాదన ఉంది. అయితే, ప్రస్తుత ఆలయం మాత్రం పూర్తిస్థాయి హిందూ సంప్రదాయంలో, స్వయంభూ లింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
కార్తీక మాసం…శివ రాత్రి సమయాల్లో ఇక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మణికేశ్వరుని మొక్కు కుంటే కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం.ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నశ్మశానంలో శవదహనాలు జరుగుతుంటాయి. గుండ్లకమ్మ నదీ ప్రవాహం ఈ ఆలయాన్నిఅనుకుని వెనుక భాగమైన పడమటి దిశ గా పారుతుంది.
ఈ పరిసరాలను బట్టే మణికేశ్వరాన్ని చిన్నకాశీ అంటారు. ఒకప్పుడు ఈ శ్మశానంలో పేరుతెలియని పురాతన వృక్షం ఉండేది. కార్తీక మాసం లోనే అది పూలు పూచేది అంటారు. అయితే మల్లవరం జలాశయం నిర్మించిన పిదప మణికేశ్వరంలోని ఈ ప్రాంత మంతా నీటి నిల్వలు పెరగటంతో ఆ వృక్షం అంతరించి పోయిందని భక్తులు చెబుతుంటారు.
అదలా ఉంటే మణికేశ్వరానికి చారిత్రిక ప్రాధాన్యత కూడా ఉంది. గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతంలో క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్ద కాలానికి చెందిన రాక్షస గూళ్ళు బయటపడ్డాయి.ధర్మవరం, కొణిదెన ప్రాంతాలలో జైన, బౌద్ధకాలాల నాటి అనేక పురాతన కట్టడాల ఆనవాళ్ళు, రాతి సమాధులు బయటపడ్డాయి.
విజయనగర రాజుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందినట్లు చరిత్ర చెబుతోంది. ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం మరియు ఎత్తైన గోపురాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.ఈ ఆలయం రాహు కేతు దోష నివారణ పూజలకు కూడా ప్రసిద్ధి చెందింది.అద్దంకి పట్టణం నుండి సుమారు 16 కి.మీ. దూరంలో ఈ ఆలయం ఉంటుంది.


