ఒక్క తప్పుతో ‘దోసె కింగ్’ జాతకం తిరగబడిందా ?

Sharing is Caring...

‘జైభీమ్’  సినిమాతో పాపులర్ అయిన  దర్శకుడు జ్ఞానవేల్ ‘దోసె కింగ్ ‘సినిమాను హిందీలో తీస్తున్నారు. 20 ఏళ్ళ కిందట జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. వందల కోట్లకు అధిపతి,  రెస్టారెంట్ రంగంలో అగ్రగామి , వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్ కథే ఈ దోసె కింగ్.

22 దేశాల్లో43  చైన్ హొటళ్ళు పెట్టి  30 వేల కోట్ల టర్నోవర్ స్థాయికి చేరుకున్న రాజగోపాల్  చేసిన తప్పుకు ఒకమ్మాయి జీవితం బలై పోయింది. అయినా ఆమె భయపడలేదు. ధైర్యంగా రాజగోపాల్ ను ఎదుర్కొన్నది.   ఆమె పేరే  జీవజ్యోతి .. ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్ లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్ కి   1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు.

శరవణ భవన్ లో వేలాది మంది ఉద్యోగులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. 1972లో ఒక వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొడుకులున్నారు. 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. రాజగోపాల్ ను తన గార్డియన్ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. 

జీవజ్యోతి శాంతకుమార్ అనే లెక్కల మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమని అడిగాడు. అందుకు శాంతకుమార్ జీవజ్యోతి ససేమిరా అన్నారు.  

జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్ తో  5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్ తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పాడు. 

శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్ మని అడుగుదాం’ అనేసరికి అతను చెన్నై వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. ఇద్దరినీ బంధించి  రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం కోడై కెనాల్ అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి పంపాడు.

అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ కి కష్టాలు మొదలయ్యాయి. పోలీసులు జీవజ్యోతి సహకరించడంతో ఆమె ధైర్యంగా పోరాడింది. రాజగోపాల్ కు ఉన్న పలుకుబడి పనిచేయలేదు. జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది.

ఫలితంగా రాజగోపాల్ కేవలం 9 నెలలు జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్ కి  10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది.

దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్.  జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటాన్ని కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించింది.  అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్ లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డుకి  తరలించారు. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు.

జీవ జ్యోతి నుంచి బయోపిక్ రైట్స్ కొనుక్కుని ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీస్తున్నారు. కాగా ‘ది బిగ్ షాట్స్: దోసా కింగ్’ పేరుతో ఇదే కథను ఇంగ్లిష్ లో వెబ్ సిరీస్ గా తీశారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!