Ganesha of thousands of years ago………………………..
పై ఫొటోలో కనిపించే గణేశుని విగ్రహం చత్తీస్ ఘడ్ రాష్ట్రం లోని దంతెవాడ జిల్లా బైలదిల్లా పర్వత శ్రేణుల్లోని రాతి కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు,కొండలు. భూతద్దం వేసి చూసినా జనావాసాలు ఎక్కడా కనిపించవు. సముద్ర మట్టానికి దాదాపు 2994 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియ పై ఈ వినాయక విగ్రహాన్ని వెయ్యేళ్ళ క్రితం గిరిజనులు ప్రతిష్టించారని అంటారు.
అప్పటినుంచి ఎండకు వానకు చెక్కుచెదరకుండా ఈ గణేష్ విగ్రహం అలాగే ఉంది. ఈ కొండ ఉన్న ప్రాంతాన్ని డోల్కల్ అంటారు. అందుకని ” డోల్కల్ గణేష్ “అని పిలుస్తుంటారు.పచ్చటి ప్రకృతి , సుందర పరిసరాల మధ్య పర్వత శిఖరం పై ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించడం అంత సులభమైన విషయం కాదు. అప్పట్లో ఎంత శ్రమ పడ్డారో ఎవరికి తెలియదు.
ఈ ప్రాంతం 10,11 శతాబ్దాలలో చిందక్ నాగ రాజవంశీయుల పాలనలో ఉండేది అంటారు. ఆ సమయంలోనే ఈ విగ్రహ ప్రతిష్ట జరిగి ఉండొచ్చని చరిత్ర కారులు , పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నట్టు కథనమొకటి ప్రచారం లో ఉంది. విలక్షణంగా లలితాసనములో ఉన్న గణేశుని బొడ్డుపై చెక్కిన పాము గుర్తు కనిపిస్తుంది.
దాదాపు మూడు అడుగుల పొడవు ,రెండున్నర అడుగుల వెడల్పులో ఉన్న విగ్రహం చుట్టూ ఒక ఆలయాన్ని పోలిన రాతి దిబ్బలు కనిపిస్తాయి.ఈ విగ్రహం వెనుక ఒక పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. పరుశురాముడు శివుడిని చూసేందుకు కైలాసానికి వెళుతుండగా వినాయకుడు అడ్డగించారట.
దాంతో ముక్కోపి అయిన పరశురాముడు గణేషుడిని ఎత్తుకుని బైలదిల్లా పర్వతాలపైకి విసిరి వేసాడట. తన ఆయుధం గొడ్డలితో గణేశుని దంతంపై కొట్టగా అది విరిగి పోయిందని చెప్పుకుంటారు. ఈ క్రమంలోనే కొండకు దగ్గర్లో ఉన్న గ్రామానికి పర్సపాల్ అనే పేరు వచ్చింది.
‘ డోల్కల్ ‘ అనేపేరు ఢోల్ అనే పదం నుండి వచ్చింది. డోలు అంటే ఒక వాయిద్య పరికరం. ఇక కల్ అంటే కొండ.దూరం నుంచి చూస్తే కొండ డోలు ఆకారంలో కనిపిస్తుందట. ఈ డోల్కల్ పై ఉన్న గణేశుడు తమ రక్షకుడని గిరిజనులు భావిస్తుంటారు. ఈ డోల్కల్ చేరుకోవడం కష్టంతో కూడిన వ్యవహారం.
విగ్రహం ఉన్న ప్రదేశానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్సపాల్ కి ముందు గా చేరుకోవాలి. అక్కడ నుంచి 16 గంటలు ట్రెక్కింగ్ చేస్తూ డోల్కల్ శిఖరానికి చేరుకోవాలి. 2012 వరకు ఈ డోల్కల్ గణేశుడి గురించి బయట ప్రపంచానికి తెలియదు. కొంత మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్లి తమ అనుభవాలను ప్రజలతో పంచుకున్నారు. దీంతో కొంతమంది పర్యాటకులు, భక్తులు ధైర్యం చేసి గణేషుడిని చూసేందుకు వెళ్తున్నారు.
చీమలు దూరని చిట్టడవిలా ఉండే ఈ ప్రాంతమంతా మావోయిస్టులు సంచరిస్తుంటారని కూడా అంటారు. ఇదిలా ఉంటే 2017 లో గణేశుని విగ్రహం అదృశ్యమైంది. ఈ విషయం ప్రజలలో కలకలం రేపింది. గిరిజనులు, పరిసర ప్రాంత ప్రజలు, పోలీసులు వచ్చి చూసి షాక్ తిన్నారు. చుట్టు పక్కల అంతా గాలించారు.
సుమారు 1000 అడుగుల లోతట్టు ప్రాంతంలో చెల్లాచెదురుగా పడిన విగ్రహం తాలూకు ముక్కలు కనిపించాయి . వాటిని భద్రంగా తెచ్చి పెట్టగా … పురావస్తు శాస్త్రవేత్తల బృందం తునకలైన విగ్రహం ముక్కలను జాగ్రత్తగా పేర్చి,కూర్చి మళ్ళీ గణేషుడిని తయారు చేశారు. ఆ విగ్రహాన్ని పోలీసులు తీసుకువచ్చి మళ్ళీ అక్కడే పెట్టారు.
విగ్రహం అక్కడ ఉంటే జనాలు వస్తుంటారు కాబట్టి నక్సల్స్ దానిని పేల్చివేసి ఉంటారని పోలీసులు అనుమానం. దంతెవాడ ఎస్పీ మావోలే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అప్పట్లో చెప్పారు. నక్సల్స్ మాత్రం ఎస్పీ మాటలను ఖండించారు. మరి విగ్రహం ఎలా ముక్కలు అయింది ? వెయ్యేళ్ల నుంచి చెక్కు చెదరని విగ్రహన్ని ఎవరు ధ్వంసం చేశారు ? విరిగిన ముక్కలన్ని ఎలా దొరికాయి ? అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఈ మిస్టరీని ఎవరూ చేధించలేకపోయారు.
—— KNMURTHY