Ravi Vanarasi …………
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు సుపరిచితమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి సంచలనం రేపాడు. సినిమా లో అతని పాత్ర ఒక అయిదు నిమిషాలు పాటు ఉండొచ్చు అంటున్నారు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి తెలుసుకుందాం.
డేవిడ్ ఆండ్రూ వార్నర్ 1986 అక్టోబర్ 27న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో జన్మించాడు.సిడ్నీలోని మాట్రావిల్లె లోని హౌసింగ్ కమిషన్ ఎస్టేట్‌లో పెరిగాడు. వార్నర్ మాట్రావిల్లే పబ్లిక్ స్కూల్, రాండ్విక్ బాయ్స్ హైస్కూల్ లో చదివాడు.
13 సంవత్సరాల వయసులో క్రికెట్ కెరీర్ ప్రారంభించాడు. అతని కోచ్ కుడిచేతి వాటం బ్యాటింగ్‌కు మారమని కోరాడు, కానీ అతని తల్లి ఎడమచేతి వాటం బ్యాటింగ్ కొనసాగించమని ప్రోత్సహించింది.తల్లి సలహానే వార్నర్ అనుసరించాడు.
వార్నర్ సిడ్నీ కోస్టల్ క్రికెట్ క్లబ్ తరపున అండర్-16 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు.15 సంవత్సరాల వయసులో తూర్పు సబర్బ్స్ క్లబ్ తరపున మొదటి తరగతిలో అరంగేట్రం చేశాడు.ఆస్ట్రేలియన్ అండర్-19 జట్టుతో శ్రీలంకలో పర్యటించాడు.
వార్నర్ రాష్ట్ర జట్టుతో రూకీ కాంట్రాక్టును సంపాదించాడు. ఆ తర్వాత కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా, తన దూకుడైన ఆటతీరుతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీల్) లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 2016లో కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్ గెలిపించాడు.
హైదరాబాద్‌తో అతడికి ఏర్పడిన అనుబంధం వల్ల తెలుగు సంస్కృతి, సినిమాలపై ఆసక్తి పెరిగింది. సోషల్ మీడియాలో తెలుగు పాటలకు డబ్‌స్మాష్ వీడియోలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. భార్య కాండిస్ వార్నర్, ఇద్దరు కూతుళ్లతో కలిసి తరచూ భారతీయ సంస్కృతిని ఆస్వాదిస్తూ కనిపిస్తాడు.
ఈ క్రమంలో వార్నర్ యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘రాబిన్ హుడ్’ లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. క్రికెట్ పిచ్‌పై తన ఆటతీరుతో అలరించే వార్నర్, ఇప్పుడు వెండితెరపై నటనా ప్రతిభను చూపించేందుకు సిద్ధమయ్యాడు.
అయితే అతని ఈ సినీ ప్రయాణం ప్రారంభం కాకముందే ఊహించని వివాదం తలెత్తింది. ఒక ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.వార్నర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజేంద్రప్రసాద్ ‘సారీ ‘చెప్పాడు. ఇక ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. మార్చి 28 న విడుదల కానుంది.