అతగాడికి అంత సీన్ ఉందా ?

Sharing is Caring...

పై ఫొటోలో దివంగత నేత వైఎస్ వెనుక కనిపిస్తున్న సూరీడు గురించి కొన్ని మీడియా సంస్థలు ఎందుకు హైలైట్ చేస్తున్నాయో తెలీదు. ఈ సూరీడు వైఎస్ దగ్గర 1977 నుంచి పనిచేసిన వ్యక్తిగత సహాయకుడు. పర్సనల్ గన్మెన్ స్థాయి నుంచి  ప్రమోట్ చేసి తన వద్ద అసిస్టెంట్ గా వైఎస్ పెట్టుకున్నారు. వైఎస్ బతికి ఉన్నపుడు ఆయనను కనిపెట్టుకుని ఉండే వాడు.  వైఎస్ కూడా అతగాడిని సొంత మనిషిగా చూసేవారు. ఇంటి వద్ద … ఆఫీస్ వద్ద ఎక్కడా చూసినా వైఎస్ వెనుక కనిపించే వాడు. వైఎస్ అధికారంలో కొచ్చాక సూరీడు కి అడిషనల్ పర్సనల్ సెక్రటరీ హోదా కల్పించారు.

కడప జిల్లాకే చెందిన సూరీడు అసలు పేరు సూర్యనారాయణ రెడ్డి. వైఎస్ రాజారెడ్డి ఇతగాడిని వైఎస్ వద్ద అసిస్టెంట్ గా పెట్టారు. గన్ లైసెన్స్ ఇప్పించి  పర్సనల్ గన్ మ్యాన్ గా మార్చారు. పూర్వాశ్రమంలో సూరీడు ఒక రేషన్ షాప్ డీలర్ గా కూడా చేసాడని అంటారు. వినయ విధేయతలకు, నమ్మకానికి పెట్టింది పేరు. వైఎస్ ఉన్నంత వరకు దాన్ని అతగాడు నిలబెట్టుకున్నాడు. వైఎస్ హయాంలోనే  డిపెప్ కుంభకోణం లో సూరీడు పై ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వైఎస్ ఒక రోజు గట్టి క్లాస్ పీకారని అంటారు.

వైఎస్ చనిపోయాక  సూరీడు ఆయన కుటుంబానికి దూరమయ్యాడు. దానికి కూడా కొన్ని కారణాలున్నాయి. జగన్ కేసులకు సంబంధించి సూరీడు ను కూడా సీబీఐ విచారించింది. అపుడు సూరీడు కేవీపీ,జగన్ ల గురించి కొంత సమాచారం చెప్పాడు అనే ప్రచారం జరిగింది. వైఎస్ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు .. ఎవరు ఆయన తో సన్నిహితంగా ఉండేవారు అన్న విషయాలు సీబీఐ లక్ష్మి నారాయణ అడిగిన మేరకు చెప్పాడని అంటారు.  ఈ విషయాలు తెలిసి జగన్,షర్మిల, విజయమ్మలు సూరీడు ను దూరంగా ఉంచారు. కేవీపీ కూడా దగ్గరకు రానీయలేదు. జగన్ ను కలిసే ప్రయత్నాలు చేసాడు కానీ అవేవి ఫలించలేదు.

కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లిన సూరీడు మాజీ మంత్రి ఆదినారాయణ ద్వారా నాలుగేళ్ళ క్రితం టీడీపీ నేతలను కూడా కలిసాడు. ఫోటోలు దిగాడు. అప్పటి సీఎం చంద్రబాబు ను కలిసే ప్రయత్నం చేసాడు. అప్పట్లో టీడీపీ లో చేరబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. వాళ్ళు కూడా సూరీడు ను నమ్మలేదని అంటారు.ఇతను పొలిటికల్ లీడరో … మాజీ ఎమ్మెల్యేనో అయితే పార్టీ లో చేర్చుకునే వారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అన్న ముద్ర ఉండటంతో  ఇతను జగన్ కోవర్ట్ ఏమో అని దూరంగా ఉంచారని అంటారు. 

మొన్నటి ఫిబ్రవరిలో కాంగ్రెస్ నేత రేవంత్ ని కలిసాడు. వేదికపై రేవంత్ కి శాలువా కప్పాడు. అప్పటినుంచి సూరీడు గురించి పలు కథనాలు మీడియా వండి వార్చడం మొదలెట్టింది. మళ్ళీ నిన్ననో మొన్ననో రేవంత్ పీసీసీ ప్రెసిడెంట్ అవుతున్నారని తెలిసి వెళ్లి ఫోటో దిగారు. అప్పటి నుంచి మళ్ళీ ప్రచారం ..వైఎస్ నీడ, వైఎస్ శిష్యుడు అని ఊదర గొడుతున్నారు. ఆమధ్య బీజేపీ ఎంపీ అరవింద్ ను కలసి ఫోటోలు దిగగానే ఏవేవో  కథనాలు ప్రచారంలోకి  వచ్చాయి. అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే ఏది పడితే అది రాసి పడేస్తున్నారు. ఫోటో దిగగానే ప్రచారాలు మొదలెట్టేస్తున్నారు. నిజానికి సూరీడు ఏపార్టీలో లేరు. ఏ పార్టీ కార్యకర్త కాదు. అతనేదో ట్రయల్స్ వేస్తున్నారు కానీ అవి ఫలించడం లేదు. 

————-KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!