రహమాన్ కి రాగాలు తెలియవా ?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala……………………………………………..

ప్రముఖ సంగీతదర్శకుడు రహమాన్ కి రాగాలు తెలియవని కొందరు విమర్శకులు అంటుంటారు.కానీ రహమాన్ అందించిన పాటలు చూస్తే ఆయనకు సంగీతం పై మంచి పట్టు ఉన్నవాడే అనిపిస్తుంది.వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ అనేస్తారుగానీ ఎ.ఆర్.రెహమాన్ సంగీతంలో భారతీయ రాగాలు తొంగి చూస్తూనే ఉంటాయి.

ఆ మధ్య రెహమాన్ చేసిన తెలుగు స్ట్రెయిట్ చిత్రం ‘ఏమాయచేశావే’లో ‘భాగేశ్వరి’ వినిపిస్తుంది.ఏ మాయ చేశావే సినిమా క్లైమాక్స్ కు ముందు కాస్త ఉత్సాహంగా వినిపించే మళయాళ గీతం భాగేశ్వరిలో చేశారు. ఆ పాట హీరో మానసిక స్థితికి అద్దం పడుతుంది.

ఇదే ‘ఏమాయచేశావే’మూవీలోనే ‘బిళహరి’ ఆధారంగా చేసిన కంపోజిషన్ ఒకటి వినిపిస్తుంది. కర్ణాటక రాగాలను ఆధారం చేసుకుని స్వరాలు కూర్చినా…వెస్ట్రన్ ఇస్ట్రుమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కనిపించేలా ఆర్కెస్ట్రా నడిపించడం ఎ.ఆర్. రెహమాన్ ప్రతిభ. కుందనపు బొమ్మా అంటూ వినిపించే పాట బిళహరి ఛాయల్లో నడిచినట్టు అనిపిస్తుంది.

ప్రేమ అనే పదం సంస్కృత జన్యం. కాదలం అనేది ద్రవిడ వ్యవహారికం. పోతన కూడా కాదలి కోడలా అనే ప్రయోగం చేశారు భాగవతంలో అంటారు వేటూరి. సరిగ్గా ఈ నేపథ్యంలోనే వేటూరి కాదలి వేణుగానం కానడ పలికె అంటూ రాశారు.’అలై పొంగేరా ‘కన్నా పాటను కానడలోనే స్వరపరిచారు సంగీత దర్శకుడు రెహమాన్.

శాస్త్రీయ రాగాధారిత గీతాలు కంపోజ్ చేయడంలో సిద్దహస్తుడు రెహమాన్. మధ్యమావతిలోనూ మంచి పాటలు అందించారు. వాటిలో ‘ప్రియురాలు పిలిచె’లో వచ్చే ఐశ్యర్య గీతిక పలికే గోరింకా కాస్త ప్రత్యేకం. నిర్మాత ఎ.ఎమ్.రత్నం శివగణేష్ కలసి తెలుగు చేసిన ఈ గీతాన్ని సాధనా సర్గమ్ చాలా బాగా గానించారు.ఇళయరాజాతో సంగీతం చేయించుకునే భారతీరాజా కూడా ఓ దశలో రెహ్మాన్ వైపు టర్న్ అయ్యారు.

ఆయన తీసిన ఓ తమిళ సినిమాలో రెహమాన్ శుద్ధ సావేరిలో ఓ టిపికల్ యుగళగీతాన్ని కంపోజ్ చేశాడు. ఉన్నికృష్ణన్ , చిన్మయి పాడిన ఈ పాట చాలా ఎనర్జీ తో నింపేశాడు రెహమాన్. Ennuyir Thozhiye – Kankalal Kaidhu Sei అని యుట్యూబులో కొడితే ఆ పాట వచ్చేస్తుంది.

ఎమ్మెస్వీ, ఇళయరాజాలకు భిన్నంగా తిలంగ్ రాగంలో హుషారైన గీతాన్ని కంపోజ్ చేశాడు రెహ్మాన్. రొటీన్ కు భిన్నంగా అనిపించాలనే తపనే కాదు… సన్నివేశాన్ని రక్తి కట్టించేలా సంగీతం అందించాలనే తపన కూడా రెహ్మాన్ లో ఎక్కువే.

మణిరత్నం తీసిన “దొంగ దొంగ” సినిమాలో వినిపించే ‘తీ తీ తీయని ‘అంటూ హీరా పాడే పాట తిలంగ్ లో స్వరం చేసినదే. మెలోడీ అనేకాదు విషాదం సైతం అద్భుతంగా పలుకుతుంది శంకరాభరణ రాగంలో. ధీర శంకరాభరణంలో రెహ్మాన్ కంపోజ్ చేసిన పాటల్లో హృదయాలను తాకే గీతం బొంబాయి లో ‘ఉరికే చిలుకా’. రెహ్మాన్ సంగీతంతో పోటీ పడి ఆ గీతాన్ని చిత్రీకరించారు మణిరత్నం. శాస్త్రీయ రాగాలను సినిమా పాటలకు వినియోగించడంలో రెహ్మాన్ ది ప్రత్యేక ముద్ర.

మాండు రాగానికి నీలాంబరి, తోడి, మోహన రాగాలను దన్నుగా నిలబెట్టి చేసిన రాగమాలిక ‘ఇద్దరు’ చిత్రంలో వినిపిస్తుంది. వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ పాటలో ‘మదనమోహినీ చూపులోన మాండు రాగమేలా’ అంటాడు. అలాగే మరో చోట ‘క్షణానికో తోడి రాగం’ అంటాడు. సంగీతపు గుట్టుమట్టులు తెలిసిన కవి కదా వేటూరి.

నటభైరవి హిందూస్తానీ సంగీతంలో అసావేరీ ఠాట్ లో ఉన్నట్టుంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ పద్దతిలో చూస్తే రీతి గౌళ అంటారు. భక్తి మాత్రమే కాదు…గొప్పగా అనిపించే అనుభూతులను వ్యక్తీకరించడానికి అద్భుతంగా పనికొచ్చే రాగం నటభైరవి. మణిరత్నం తీసిన’ సఖి ‘సినిమా కోసం రెహ్మాన్ కంపోజ్ చేసిన ‘స్నేహితుడా ‘పాట నటభైరవి పద్దతిలోనే అనిపిస్తుంది.

ఎస్. రాజేశ్వరరావు, ఎమ్మెస్వీ , మహదేవన్, ఇళయరాజాల తర్వాత దక్షిణాది సినిమా సంగీతానికి చుక్కానిగా నిలబడ్డ సంగీత శిఖరం ఎ.ఆర్.రెహ్మాన్. బిగ్ సినిమాల డైరక్టర్ శంకర్ తొలి చిత్రం ‘జంటిల్ మేన్’ లో రెహ్మాన్ ధర్మవతి రాగంలో స్వరం కట్టిన ఓ టిపికల్ యుగళగీతం వినిపిస్తుంది.రాజశ్రీ రచనలో సాగే ఈ పాటకు ఓ విశేషం ఉంది. సాధారణంగా భారతీయులు పాశ్చాత్య సంగీతాన్నించి ప్రేరణ పొందుతారంటారు కదా.

కానీ ఈ పాటను ప్రేరణగా తీసుకుని ఓ వెస్ట్రన్ ఆల్బమ్ వచ్చింది.ఆ పాటే’ కొంటెవాణ్ణి కట్టుకో’ … లవ్ బర్ట్స్ అంటూ తెలుగులోకి వచ్చిన డబ్బింగ్ సినిమాలో ‘మనసున మనసున ‘అంటూ వినిపించే రాజశ్రీ సాహిత్యాన్ని శుద్ద సారంగ ఛాయల్లో నడిపిస్తాడు.

చారుకేశి రాగంలో పాటలు చేసిన సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహ్మాన్ కూడా ఉన్నారు. నిర్మాత ఎ.ఎమ్.రత్నం కొడుకు జ్యోతి కృష్ణ డైరక్ట్ చేసిన ‘నీ మనసు నాకు తెలుసు’ మూవీలో ఓ ఆహ్లాద గీతం చారుకేశిలోనే సాగుతుంది. “ఏదో ఏదో “… అంటూ సాగుతుంది. కార్తిక్, గోపికాపూర్ణిమ పాడారనుకుంటా ఆ పాట. ఇలా… చెప్పుకుంటూ పోతే చాలా పాటలు ఉన్నాయి.

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. DRKREDDY October 2, 2020
error: Content is protected !!