Divorce Effect ……………………………
తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి.
ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవల మూలంగా పిల్లలు మానసిక వత్తిడికి గురవుతుంటారు. వారిలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. అనేక సమస్యలు పిల్లల మదిని తొలిచి వేస్తాయి. తల్లిదండ్రులు విడిపోవడాన్ని పిల్లలు అంత త్వరగా జీర్ణం చేసుకోలేరు. తల్లిదండ్రులలో ఏ ఒక్కరు దూరమైనా పిల్లలు బాధపడతారు. అలాంటిది విడాకుల రూపం లో తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు తమ నుంచి దూరం అవడాన్ని పిల్లలు తట్టుకోలేరు.
తమకు అండగా నిలిచే తల్లిదండ్రులు దూరం గా వెళ్ళిపోవడం పిల్లలకి కొంచెం ఇబ్బందికర విషయమే. ఆ గాయాలు మానవు. చదువుపై అంతగా శద్ధ కనబర్చలేరు. ఫలితంగా చదువులో వెనుకబడతారు. ఇంటా, బయట సమస్యలను ఎదుర్కొంటుంటారు. ముభావంగా ఉంటారు. చివరకు దురలవాట్లకు లోనవుతారు.కొందరైతే ఇంటి నుంచి పారి పోయే ప్రయత్నం చేస్తారు.ఇంకొందరు ఆత్మ హత్యా యత్నం కూడా చేస్తారు.
మరీ చిన్నపిల్లలు అయితే తరచుగా అటు తండ్రి ఇంటికి –ఇటు తల్లి ఇంటికి రావడం పోవడం ఎందుకో అర్థం కాదు. తమ తల్లిదండ్రులు పరస్పరం ప్రేమగా ఉండకపోతే… తమను ప్రేమగా చూడటం మానేస్తారని ఆందోళన చెందుతారు. ప్రతి అంశానికి ఎదురు తిరుగుతుంటారు. క్రమంగా వారిలో మొండి తనం పెరుగుతుంది.
స్కూల్ లో చదివే పిల్లలు అయితే తల్లి తండ్రి విడాకులు తీసుకుని తప్పు చేశారనే భావన లోకి వెళతారు. స్కూల్ లో తోటి పిల్లల హేళనకు కూడా గురవుతారు. ఆ హేళన వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఆ ప్రభావం చదువులను చెడగొడుతుంది. స్నేహితులతో గొడవలకు దిగుతారు.మరికొంత మందికి పాఠశాల మారడం… అలాగే కొత్త ఇంటికి/ప్రాంతానికి వెళ్లడం ఇబ్బందిగా ఉంటుంది.
కొత్త వాతావరణం లో అంత త్వరగా ఇమడలేరు. ఒంటరి తల్లి/తండ్రి తో కలిసి జీవించడం కూడా వారికి కష్టంగా ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. విడాకుల తర్వాత ఆర్థిక ఇబ్బందులు కూడా సర్వసాధారణం. ఈ ప్రభావం కూడా పిల్లలపై పడుతుంది. కాన్వెంట్ లో చదివే పిల్లవాడు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితి పిల్లలను ఇబ్బంది పెడుతుంది. తల్లిపై లేదా తండ్రి పై ఆబాలుడు /బాలిక ద్వేషం పెంచుకుంటారు. వారితో సరిగ్గా మాట్లాడరు. మనసులో వ్యతిరేకతను పెంచుకుంటారు.
తల్లి తండ్రుల విడాకులు గురించి టీనేజర్లు అయితే మనసులో కోపం పెంచుకుంటారు. ఇద్దరూ విడిపోవడం పట్ల బంధువుల.. స్నేహితుల రియాక్షన్ ను వాళ్ళు తట్టుకోలేరు. తమ భవిష్యత్ పట్ల భయం వేస్తుంది.పెళ్లి సంబంధాలు వస్తాయా రావా ? … పెళ్లి అవుతుందా ? కాదా ?అని ఆందోళనకు గురవుతారు. తండ్రి మరీ దుర్మార్గుడు అయితే తల్లి పట్ల సానుభూతితో సర్దుకుపోతారు.
తండ్రి మంచి వాడైతే తల్లి ని సాధిస్తుంటారు. పేరెంట్స్ ఫీలింగ్స్ ను అర్ధం చేసుకోలేరు. నలుగురిలో తమకు తలవంపులు తెచ్చారని ఫీలింగ్ ను మనసులో పెట్టుకుంటారు. కొందరైతే తీవ్రంగా స్పందిస్తారు. తల్లిదండ్రులను నిందిస్తారు. వారిపై ఆగ్రహం ప్రకటిస్తారు. ఇంటినుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తారు.
ఇక పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకుంటే పిల్లలు మరింత నరకం అనుభవిస్తారు. కొత్త తండ్రి /తల్లి తో కలవలేరు. సొంత తల్లి /తండ్రి స్థానంలో కొత్తవాళ్లను చూడలేరు. బయటికి చెప్పుకోలేకపోయినా వారి మనసులో పేరెంట్స్ పై దురభిప్రాయం ఏర్పడుతుంది. అది వాళ్ళ కేరీర్ ను దెబ్బ తీస్తుంది. మొత్తం మీద పిల్లలపై పేరెంట్స్ విడాకుల ప్రభావం పెను ప్రభావమే చూపుతుంది. పేరెంట్స్ విడాకుల తర్వాత చాలా మంది పిల్లలు తమ తల్లితో కానీ తండ్రితో కానీ సన్నిహితంగా ఉండలేకపోతున్నారని ఒక అధ్యయనం లో తేలింది.
——-KNM