Bharadwaja Rangavajhala ….
కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ఆత్మగౌరవం నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది.
రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి … అందెను నేడే అందని జాబిల్లీ ఇలా హాయైన సంగీతాన్ని అందించడమే కాదు … ఎందుచేతో విశ్వనాథ్ గారి చిత్రాల్లో మిగిలిన దర్శకుల చిత్రాలతో పోలిస్తే జోలపాటలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ విషయం చెప్పడమే నా ముఖ్యోద్దేశ్యం. ఈ విషయం ఆయన గుర్తించారో లేదోగానీ … నిజం.
అసంకల్పితంగా జరిగిపోయి ఉండవచ్చు.ఆయన సినిమాలకు ఆయనే కథ సమకూర్చుకోవడం వల్ల కావచ్చు … ఆయన మీద చిన్నతనంలో విన్న లాలి పాటల ప్రేరణ ఉండడం వల్లనూ కావచ్చు … మనసు సేద తీరే లాలి పాటలు విశ్వనాథ్ గారి చిత్రాల్లోనే అధికంగా వినిపిస్తాయి … వటపత్రసాయికి వరహాల లాలీ – స్వాతి ముత్యం తల్లి పాడే లాలి పాటలే కాదు .
ప్రేయసి పాడే లాలి పాటలనూ ఊహించగలగడం దర్శకుడుగా ఆయనలోని ఆర్ద్రతను తెలియచేస్తుంది. నిండు హృదయాలు చిత్రం కోసం కథానాయిక వాణిశ్రీ కథానాయకుడు ఎన్టీఆర్ కు జోలపాడే సందర్భం ఉంటుంది. స్క్రిప్ట్ రాసుకునేప్పుడే అబద్దపు పల్లవులు రాసుకోవడం విశ్వనాథ్ కు అలవాటు. ఆ అలవాటు నుంచి వచ్చిన పల్లవి రామలాలీ మేఘశ్యామలాలీ … దీన్ని పుచ్చుకుని నారాయణరెడ్డిగారు కొనసాగి చరణాలు పూర్తి చేశారు.
రామలాలి మేఘ శ్యామలాలి – నిండు హృదయాలు జోలపాటల క్రేజ్ పెంచిన దర్శకుడుగా కూడా విశ్వనాథ్ గారిని చెప్పుకోవాలి … జోలపాట అనేది కేవలం పాట కాదు …. పిల్లలైనా పెద్దలైనా …. అలసిన మనసులకు సాంత్వన కలిగించడం లాలిపాట లక్ష్యం … సాంత్వన పొందిన మనసు నెమ్మదిగా నిద్రలోకి జారుకుని సేదతీరుతుంది …. అలా శక్తి పుంజుకుంటుంది. తిరిగి జీవన సమరంలోకి మళ్లుతుంది.
ఇదే జీవన చక్రం. ఈ మర్మాన్ని ఎరిగి ఉండడం చేత రకరకాల సందర్భాలకు ఆయన లాలి పాటల తరహా గీతాలను ఎంచుకుంటూ ఉంటారేమో అని అనుమానం. చుక్కాల్లారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిల్లి – బాలు పాడిన వర్షన్ అమ్మని మర్చిపోని వాడికి అమ్మ పాడిన లాలి పాటని మర్చిపోవడం కూడా కుదరదు … అమ్మతనానికీ జోలపాటకూ ఉన్న సంబంధం అది. విశ్వనాథ్ గారిలో … ఈ రెండూ చెదరకుండా ఉండడం వల్లే కావచ్చు … ఆయన సందర్భం దొరికినప్పుడల్లా లాలి పాట పెట్టేయడానికి ప్రయత్నం చేస్తూంటారు.
ఆ లాలిపాటతోనే సినిమాలు విజయతీరాలు చేరిన సందర్భాలూ ఉన్నాయి. ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు – జీవన జ్యోతి.. ఏ తల్లి పాడేను జోలా ఏ తల్లి ఊపేను డోలా … ఎవరికి నీవు కావాలి ఎవరికి నీ మీద జాలి అంటూ ఓ తండ్రి కాని తండ్రి పాడే లాలిపాట వింటూ పాప ఏడుపు ఆపి నిద్రపోతుంది ….అంటరాని కులంలో పుట్టి అనాధ అయిన ఆ పాపకు లోకం తనను ఎందుకు పట్టించుకోవడంలేదో అర్ధం కాదు.
ఏడ్చినా తన వైపు జాలి చూపదెందుకో పోల్చుకోలేకపోతుంది … ఆ పాప కోసం …. కులం వదిలేసి కదిలిన ఓ హృదయం అక్కున చేర్చుకుంటుంది. ఈ సందర్భానికి దేవులపల్లి కృష్ణశాస్త్రిగారితో జోల పాట రాయించుకున్నారు విశ్వనాథ్ … ఆ సాహిత్యానికి స్వరరాజేశ్వరుడు బాణీ కట్టారు. ఘంటసాల సుశీల ప్రాణం పెట్టి పాడారు.
ఏ తల్లి పాడేను జోలా – కాలం మారింది…. అంత దవ్వునుంచే అయ్యడుగులు తెలిసేనా ఓసి వేలెడంత లేవు బోసి నవ్వులదానా …. ఈ మాటలు వింటుంటేనే మనసులు పులకరిస్తాయి …ఉయ్యాలలో జాబిలి కూనల్లాంటి పిల్లలు పెద్దవాళ్లని చూసి పలకరిస్తూ … ఎత్తుకోమని చేతులు చాస్తూ … కాళ్లు కొట్టుకుంటూ …. ఉంటే చూడడం ఓ మురిపెం. సరిగ్గా ఇలాంటి సందర్భాన్ని తన సినిమా కోసం కల్పన చేశారు విశ్వనాథ్.
ఇక్కడా దేవులపల్లి కృష్ణశాస్త్రిగారే … ఆ సన్నివేశానికి తన కవిత్వంతో రససిద్ది కల్పించారు. చాలులే నిదురపో జాబిలికూనా …. బుజ్జగిస్తూ …. లాలిస్తూ పాడే పాటలు కనుకే వీటిని జోలపాటలనీ లాలిపాటలనీ అంటారు.
ఈ లాలించడానికి వారి ముందు వారికి తెలియని లోకాన్ని ఆవిష్కరిస్తూ …. పాటల్లోనే ఓ కల్పన చేస్తారు కవులు…
చందమామ ను పిలుస్తారు … అదిగదిగో చందమామ అనగానే పిల్లలు అటు వైపు చూస్తారు …. చూసి అదేదో భలే ఉందే అనుకునే లోపు ….ఆ చందమామ నీ కోసం పాలబువ్వ తెస్తుంది … హాయిగా తినేసి బజ్జో అని చెప్తాం …. నిజంగానే చందమామ తెచ్చి అమ్మకు ఇచ్చిన పాలబువ్వే తినేస్తున్నానుకుని పాపాయి హాయిగా తినేసి బజ్జుంటుంది ….
చందమామనే కలగంటూ …. ఇలా ప్రపంచాన్ని చూడలేని ఓ పాప చూడాలనుకున్న వెన్నెల్లో బృందావనాన్ని చూపించి మనసుకు సాంత్వన కలిగించే సందర్భాన్ని సృష్టించడానికి ఎంత తపన ఉండాలి?
చందమామ రావే … సిరివెన్నెల…. అమ్మకడుపు చల్లగా … అంటూ బిడ్డకు ఆశీస్సులు ఇవ్వడం వెనకాల ఆ బిడ్డకు జన్మనిస్తూ ఆ తల్లి అనుభవించిన బాధకు అనునయింపు కూడా ఉంటుంది. బిడ్డ కేరింతలు వింటే చాలు అప్పటి వరకూ అనుభవించిన బాధనంతా ఒక్క క్షణంలో మర్చిపోతుందా మాతృహృదయం … ఈ సందర్భాన్ని పాటలో పొదివి తన సినిమాలో వినియోగించారు విశ్వనాథ్ …
ఒక్క క్షణం … స్వరాభిషేకం….. రొమాన్స్ కూడా లాలి పాటలోనే నడిపించడం మామూలు ఫీట్ కాదు ….నిజానికి హృద్యమైన ఆలోచన. రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై … సీత తోనే ఉండిపోరా… గీత నువ్వే దిద్దిపోరా అంటూ కథానాయకుడ్ని ఉద్దేశించి నాయిక పాడడం నిజంగానే సొగసైన మాత్రమే కాదు సంస్కారవంతమైన ఆలోచన.
జోలా జోలమ్మ జోలా – సూత్రధారులు
జోలపాటలు ఎప్పుడూ తల్లేలే పాడాలని నిబందన ఏదీ లేదు కదా … పిల్లలు కూడా తల్లులకు లాలి పాడవచ్చు.
కలికితనమున విధుల అలసినవుగాన లాలీ శుభలాలీ అంటూ తల్లికి లాలి పాడే సందర్భాన్ని ఊహించడం ఆ దర్శకుడి అద్భుతం అయితే … అన్నమయ్య ను తోడుగా తీసుకుని అంత చక్కటి సాహిత్యాన్ని అందించిన ఆ సాహితీమూర్తి దర్శనం. చిన్ననాటి నీ లాలి నన్ను నిదుర పుచ్చగా ఈ నాటి నీ లాలి మేలుకొలుపుకాగా అంటూ …. అమ్మతనాన్ని పాటంతా నింపారు వేటూరి విశ్వనాథులు.
పలుకు తేనెల తల్లి పవళించవమ్మ కలికితనమున – జననీ జన్మభూమి… స్వాతిముత్యం సినిమాలో రెండు రకాల లాలిపాటలుంటాయి. ఒకటి తల్లి పిల్లాడికి పాడే లాలి పాటైతే … మరోటి తన జీవితాన్ని ముందుకు నడిపించిన తోడు నీడ శాశ్వతనిద్రపోయిన సందర్భంలో ఆ దేవతకు పంచభూతాల లాలీ అని పాడించాలనుకోవడం …. హృదయాలను తడిమేస్తుంది.
మనసులను తడిచేస్తుంది … తల్లి పిల్లవాడికి పాడే జోలపాట నారాయణరెడ్డిగారు రాస్తే …. జీవిత సహచరి అయిన దేవతకు పాడే ఈ లాలిపాటను సీతారామశాస్త్రి రాశారు. నా దేవతకు పంచభూతాల లాలి .. అదండి సంగతి… అంచేత ఈ పాటలన్నీ వినేసి బజ్జోండి..