cow dung will cure corona ?………………………………..ఆవు పేడను ఒళ్ళంతా రాసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అలా చేస్తే కరోనా నుంచి రక్షణ పొందగలమని భావిస్తున్నారు. కానీ ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు.గుజరాత్ లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది సమీప గోశాలలకు వెళ్లి పేడ తెచ్చుకుని ఒళ్ళంతా రాసుకుంటున్నారు. ఎండిపోయే దాకా ఉండి తర్వాత పాలు లేదా పెరుగు తో స్నానం చేస్తున్నారు. అలా ఆవు పేడ ను వాడుతున్న వీడియోలు, ఫోటోలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ విధంగా చేయడం వలన కరోనా నుంచి రక్షణ లభించదని … పైగా బ్లాక్ ఫంగస్ సహా ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినా కూడా జనాలు ఏదో విధంగా కరోనా నుంచి రక్షణ పొందాలనే భావనతో కొత్త విధానాల వైపు చూస్తున్నారు. గోశాలలకు క్యూలు కడుతున్నారు. ఏ పుట్టలో ఏముందో ప్రయత్నిస్తే పోలా ? అన్నధోరణి జనాల్లో పెరుగుతోంది.
ఆవు పేడను ఉపయోగించడం సరికాదని … అలాచేయడం ద్వారా కరోనా తగ్గుతుందని .. రోగ నిరోధకశక్తి పెరుగుతుందని ఏ పరిశోధనలో తేలలేదని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ హెల్త్, గాంధీనగర్ డైరెక్టర్ దిలీప్ మౌలంకర్ చెబుతున్నారు. ఇవన్నీ అశాస్త్రీయ పద్ధతులని .. వీటి వలన ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు కూడా చెబుతున్నారు. గోమాత ను హిందువులు పూజించడం లో తప్పులేదు. కానీ ఇలాంటి సమయంలో గోవులకు కూడా వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదు. వాటి మూలంగా మనుష్యులకు వేరే వేరే వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి కొత్త వ్యాధుల బారిన పడటం మంచిది కాదు.
ఇదిలా ఉంటే గో మూత్రం తో కరోనాను నయం చేయవచ్చని యూపీ లోని బైరియాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ కొత్త విధానంతో ముందుకొచ్చారు. ఆవు మూత్రాన్ని ఎలా తాగాలో ఆయన చూపిస్తున్న వీడియో వైరల్ అయింది. సామాన్య ప్రజలే కాకుండా చాలామంది రాజకీయ నేతలు కూడా ఈ ఎమ్మెల్యేకు మద్దతు పలుకుతున్నారు. దీనిని గమనించిన నెటిజన్లు కొందరు విమర్శిస్తున్నారు. మరొకొందరు మద్దతు పలుకుతున్నారు. శాస్త్రవేత్తలు ఈ వాదనలను ఖండించినప్పటికీ ఈ విధానాలను గట్టిగా నమ్మేవారు ఉన్నారు.
ఇలాంటివన్నీ ఎక్కడో ఒక చోట మొదలై దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వెళతాయి. కొద్దీ రోజుల క్రితం నిమ్మకాయ రసం ముక్కులో పిండితే కరోనా వైరస్ మాయమౌతుందని ప్రచారం జోరుగా సాగింది. ఇలాంటి సమాచారం వాట్సాప్ లో ఎక్కువగా వస్తుంది. ఇంకా ఎన్నో చిట్కాలు కూడా వస్తుంటాయి. వాటిని నిర్ధారించుకోకుండా జనాలు ప్రయోగాలు చేస్తుంటారు. తద్వారా ఇబ్బందులు పడుతుంటారు. వైద్యుల సలహా లేకుండా ఏది పడితే అది వాడి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కంటే అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.