Affect of cold winds ………………………….
చలి కాలంలో రాత్రిళ్ళు ఇతర కాలాల్లో మాదిరిగా నిద్ర పట్టదు. మన నిద్రను చలి ప్రభావితం చేస్తుంది. చాలామంది చలికాలంలో లేటుగా పడుకుని లేటుగా లేస్తుంటారు. నిద్ర మధ్యలో మెలుకువ వచ్చి మళ్ళీ నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి మామూలు రోజుల్లో కూడా సరిగ్గా నిద్ర పట్టదు. ఇది మరో సమస్య
రూమ్ టెంపరేచర్ అనుకూలంగా లేక పోయినా నిద్ర సరిగ్గా పట్టదు. ఆ మధ్య జరిగిన అమెరికా లో జరిగిన ఒక అధ్యయనంలో కనుగొన్న దాని ప్రకారం, శీతాకాలంలో మామూలుగా కొందరు రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోతారు. ఉదయం ఆలస్యంగా మేల్కొంటారు
మన శరీరాలు సహజమైన సర్కాడియన్ రిథమ్స్ ను కలిగి ఉంటాయి. సర్కాడియన్ రిధమ్స్ అంటే 24-గంటల కాల చక్రాన్నిబట్టి కలిగే శారీరక, మానసిక, ప్రవర్తనా మార్పులు. ఈ సహజ ప్రక్రియలు ప్రధానంగా కాంతి, చీకటిని బట్టి స్పందిస్తుంటాయి. మనుష్యులు,జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులతో సహా చాలా జీవులలో ఈ రిధమ్స్ ఉంటాయి.
ఈ రిధమ్స్ ఎప్పుడు నిద్రపోవాలి అని సూచిస్తుంటాయి . మన శరీరానికి పగటిపూట తగినంత సూర్యరశ్మి అందకపోతే, మన సహజ సర్కాడియన్ రిథమ్ ఆలస్యం గా స్పందిస్తుంది. అది మన నిద్ర సమయాన్ని ఆలస్యం చేస్తుంది.కాబట్టి ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడం మంచిది.
మనుష్యుల శారీరక, మానసిక , ప్రవర్తన మార్పుల ప్రక్రియ వేసవి కాలంతో పోలిస్తే శీతాకాలంలో 40 నిమిషాలు ఆలస్యం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. చలికాలంలో శ్వాసకోశ సమస్యలు ఇబ్బందిపెడతాయి. జ్వరాలు కూడా వస్తుంటాయి. కాబట్టి శరీరానికి నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా చలికాలం నిద్ర మంచి ఔషధంగా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ కాలంలో తగినంత నిద్ర పోలేని వారిలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. రోజుకి 7-8 గంటల నిద్ర శరీరానికి తప్పనిసరిగా ఉండాలి. రాత్రిళ్లు తరచు మేలుకొనే వారికి నిద్రలేమి సమస్య ఉంటుంది. చక్కటి నిద్ర ఉన్నట్లయితే వారిలో జీవన క్రియలు సజావుగా జరిగి వ్యాధి నిరోధక శక్తి మెరుగ్గా ఉంటుంది.
జ్వరం, జలుబు వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు నిద్ర చాలా అవసరం. నిద్రద్వారా శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. తద్వారా వ్యాధులను అధిగమించడానికి వీలవుతుంది. నిద్రిస్తున్న గదిలో తగినంత ఉష్ణ వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అంటే కిటికీలు తలుపులు మూసి ఉంచుకోవాలి. అపుడు నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయి. శీతాకాలపు నిద్రలేమి నుంచి బయట పడటానికి కొన్ని చిట్కాలను పాటించండి.
@ నిద్రకు ముందు ఆల్కహాల్, కెఫిన్, నికోటిన్ వాడకానికి దూరంగా ఉండండి. ఇవన్నీ నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తాయి. @ పగటిపూట నిద్రపోకండి. మీరు తప్పనిసరిగా నిద్రపోవాలనుకుంటే , 30 నిమిషాల కంటే ఎక్కువ నిద్రపోకండి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అసలు నిద్రపోకండి.
@ రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయండి. ఈ రెగ్యులర్ యాక్టివిటీ నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
@ నిద్రవేళకు ముందు భోజనం తినవద్దు. కనీసం గంట రెండు గంటల ముందే లైట్ ఫుడ్ తీసుకోండి.
@ వారాంతాల్లో సహా ప్రతిరోజూ మీ నిద్రవేళ, మేల్కొనే సమయాన్ని స్థిరంగా ఉంచండి.
@ ఒత్తిడిని తగ్గించడానికి, మనస్సు,శరీరం విశ్రాంతి తీసుకోవడానికి నిద్రవేళకు ముందు వెచ్చని నీటితో స్నానం చేయండి. @ ధ్యానం, ప్రార్థన, యోగా లేదా శ్వాస వ్యాయామాలు చక్కగా నిద్ర పోవడానికి సహాయపడతాయి.