డా. వంగల రామకృష్ణ……………………………..
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన సమీప బంధువులతో, రక్తబంధువులతో ఎలా యుద్ధం చెయ్యాలా అని సతమతమవుతూ విషాదంలో కూరుకుపోతాడు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు. స్థిత ప్రజ్ఞత కలిగించి ఆత్మనిర్భరత కలిగిస్తాడు. దీంతో స్థిమితపడ్డ అర్జునుడు సమరానికి సై అంటాడు.
రామాయణంలో రావణుడితో అంతులేని పోరాటం చేసిన రాముడు విసిగిపోయి, అలసిపోయి, విరక్తుడై పోతాడు..కర్తవ్య నిర్వహణ పట్ల నిరాసక్తుడైపోతాడు. అగస్త్యుడు బోధించిన “ఆదిత్య హృదయం“ విని కోల్పొయిన శక్తిని మళ్లీ పొందుతాడు.గీతను మనిషికి శ్రీకృష్ణ భగవానుడు బోధిస్తే.. ఆదిత్యహృదయాన్ని మనిషి నారాయణుడికి బోధించాడు.
సీతమ్మ చెరవిడిపించడం కోసం రాముడు లంకలోకి అడుగుపెడతాడు. శ్రీరాముని సామాన్య మానవుడిగా ఎంచిన రావణుడు ఆయనను ఎదుర్కోవడానికి రాక్షస వీరులను పంపుతాడు. రావణుడి సేనను రాముడు సంహరిస్తుంటాడు. ఎంత పోరాటం చేసినా యుద్ధం ఒక కొలిక్కి వచ్చేపరిస్థితి కనబడదు. చంపిన కొద్దీ రాక్షసులు వచ్చి పడుతూనే ఉంటారు. పోరాడి పోరాడి విసిగి పోయిన రాముడు బాగా అలసిపోతాడు.
తనతో ప్రత్యక్ష శత్రుత్వం లేని అమాయక రాక్షసులు ఎందరో తన బాణాల దెబ్బకు విలవిలలాడి పోతుంటే చూసి రాముడు తట్టుకోలేకపోతాడు. ఇంత మారణహోమం నా వల్లనే గదా జరుగుతోందని బాధపడతాడు. ఘోరసంగ్రామం జరుగుతున్న సమయంలో రాముడు అకస్మాత్తుగా వైరాగ్యవంతుడై పోవడంతో దేవగణాలు ఆందోళనపడ్డాయి. కొద్దిసేపట్లోనే విజయవార్త వింటామనుకున్న వారంతా రాముడు విరక్తుడైపోవడం చూసి కంగారెత్తిపోయారు.
శ్రీరాముని మానసిక స్థితిని అర్థం చేసుకున్న అగస్త్యమహర్షి ఆయన దరి చేరి ముప్పై శ్లోకాల ఆదిత్య హృదయాన్ని బోధిస్తాడు. “ఈ స్తోత్రాన్ని పారాయణం చేసి నిబ్బరపడు..దీనివల్ల అనుమానాలన్నీ పటాపంచలై స్వస్థత చేకూరుతుంది.. నీకు కొత్త శక్తి వస్తుందని” చెబుతాడు.
అగస్త్యుడి బోధను సంస్మరించుకుని రాముడు కొత్త శక్తి పొందాడు. గీత విన్న అర్జునుడు ఏవిధంగా అయితే కురుక్షేత్రంలో తలపడ్డాడో అలా ఆదిత్యహృదయం విన్న రామచంద్రుడు రావణుడితో తలపడ్డాడు. దేవుడికే అంత ధైర్యాన్ని ఇచ్చి యుద్ధంలో విజేతగా నిలిపేలా చేసిన ఆదిత్య హృదయం సామాన్యులకు ఇక ఎంత శక్తిని ఇస్తుందో అర్థం చేసుకోవొచ్చు.
ఆదిత్య హృదయంలో మొత్తం 30 శ్లోకాలున్నాయి. ఇందులో 15 – 21 వరకు ఉన్న శ్లోకాలు ప్రత్యేకమైనవి. వీటిలో అమిత శక్తిమంతమైన పదాలు ఉన్నాయని అని కంచి పరమాచార్య చెప్పారు. కొత్త శక్తి కోరుకునేవారు ఆదిత్య హృదయాన్ని పూర్తిగా పఠించడం, సమయం చాలని వారు కనీసం 29,30 శ్లోకాలనైనా చదువుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
రామ తారకమంత్రంతో ఆదిత్యహృదయాన్ని కలిపి సూర్యోదయ సమయంలో జపిస్తే, మనసును నిర్మలం చేస్తుంది.హృదయం అనే పదం హృత్, అయం అనే రెండు పదాల కలయిక వల్ల ఏర్పడింది. హృత్ అంటే గుండె, అయం అంటే వ్యక్తి. రెండూ కలిపి చదివితే హృదయంలో ప్రకాశించే లేదా నివసించే వాడు అని అర్థం.
హృదయంలోకి ప్రవేశించిన వాడు ఊరికే ఉంటాడా? “ఇంద్రియాలను చూస్తాడు.” ఇంద్రియ వ్యాపారాలను పరామర్శించేవాడు..పరికించి చూసేవాడు ఎవరు? ఇంద్రియాలకు అతీతుడైన నారాయణుడు. ఆ నారాయణుడు ‘అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థితః’ మనకు లోపలా బైటా నిండి ఉండేవాడు. ఈ చైతన్యమూర్తే ప్రత్యక్ష నారాయణుడు..ఆయనే సూర్యనారాయణుడు.
“ఆదిత్య” అనే పదానికి ఇంద్రియాలను పరిశీలించేవాడు అని అర్థం. ఆకాశంలో కదులుతూ హృదయాకాశంలో నిశ్చలంగా ఉండేవాడు సూర్యనారాయణుడు. ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదవడానికి పట్టాల్సిన సమయం 7 నిమిషాలు. సప్తాశ్వాలతో..సప్తలోకాలూ తిరిగేవాడికి మనం 7 నిమిషాలు కేటాయిస్తేచాలు. అఖండ విజయం తథ్యం.
సూర్యుడు ఉదయించేటప్పుడు కనిపించే మొదటి రంగు నీల లోహితం. దీన్నే యు.వి. రే అంటారు. ఇది సరిగా 7 నిమిషాల పాటు కనబడుతుంది. సూర్యుడి నుంచి నీలలోహిత కిరణం వెలువడినప్పుడు ఆదిత్య హృదయం చదవడం మొదలుపెడితే దాని తరువాతిదైన తెల్లని కిరణం వచ్చేటప్పటికి పూర్తవుతుంది.
ఈ నీలలోహిత కిరణమే వానర రాజు ఔరస సంతానమై సుగ్రీవుడుగా అవతరించింది. ఈ నీలలోహిత కిరణమే కుంతీదేవి కడుపున కర్ణుడయింది. సూర్యుని గౌరవించి సత్యభామ తండ్రి సత్రాజిత్ శ్యమంతకమణిని పొందాడు.సూర్యుని ప్రార్థించి కుంతీ సుతాగ్రేసరుడు ధర్మనందనుడు అక్షయపాత్రను అరణ్యవాస కాలంలో ఆహారభద్రతను పొందాడు. అతిథి అభ్యాగతులకు లేదనకుండా ఆహార వితరణ చేశాడు.
సూర్యుని దయతో చేమకూరవేంకటకవి ప్రతిపద చమత్కృతి వెలయంగ పద్యం చెప్పే సత్తా సంపాదించాడు. సూర్య భగవానుని ఆరాధించడం ద్వారా జాంబవతి కొడుకు సాంబడు అనారోగ్యం నుండి విముక్తి పొందాడు. సూర్యుడికి ఉదయమే సుప్రభాతాలుపాడి మేలుకొలుపడమేకాదు రాత్రిపూట చిత్తుగా నిద్రపుచ్చడం కూడా బాగా తెలుసు. సూర్యుని ముందు నిలబడి ఆయన నీలలోహిత కిరణాలలో మునకలేయడం వల్ల మనకు విటమిన్-డి పుష్కలంగా అందుతుంది.
శరీరం నుంచి మెలటొనిన్ అనే హార్మోను రాత్రి పూట వెలువడడం వల్ల మంచి నిద్ర పడుతుంది. పగటి వెలుగు ఎంతగా మన శరీరానికి తాకితే అంత మంచిది. ఉదయం వేళ కనీసం 15 నిమిషాలు సూర్యకాంతి తగిలేలా నిలబడితే మెలటొనిన్ హార్మోన్ పుష్కలంగా వెలువడి మానసిక ఒత్తిడిని చిత్తు చేస్తుంది. ఆత్మన్యూనతను పారద్రోలుతుంది. సుఖ నిద్రను అందిస్తుంది.
రోగనిరోధకశక్తిని మెరుగుపరుస్తుంది. విటమిన్ డి వల్ల ఎముకలు గట్టిబడతాయి. ఉదయం 8 గంటలలోపు సూర్యకిరణాలకు ఎదురుగా నిలబడితే అది శరీర బరువును తగ్గించడానికి దోహదం చేస్తుంది. దీర్ఘాయువునిస్తుంది. సూర్యనమస్కారాలు శరీరాన్ని చువ్వలా వంచి చక్కని రూపాన్నిస్తాయి. ఇందుకే కదా ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అన్నది. అదండీ ఆదిత్య హృదయం విశిష్టత.