Govardhan Gande ………………………………………
Self-examination……………మనిషి ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అబద్దాలు చెప్పడం ..తప్పులు, పొరపాట్లు చేయడం.. పాపాలు,మోసాలకు పాల్పడం నిత్య జీవితంలో తరచుగా, విరివిగా జరిగేవే.ఎవరికి వారు ప్రశ్నలు వేసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకోగలితే జవాబులు దొరికిపోవడం ఖాయం. ఏ తప్పూ చేయలేదని ఎంత గాంభీర్యం ప్రదర్శించినా అది వారికి తెలిసిపోతూనే ఉంటుంది.
కానీ దాన్ని మనిషి అంగీకరించే సందర్భాలు చాలా అరుదు. అలాంటి ఓ ఘటన ఇటీవల మన మధ్యనే సంభవించింది.
చెస్ ప్రపంచ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ను ఓ వ్యాపారి ఓడించాడు! ఆశ్చర్యం కలిగించే విషయమిది. కోవిడ్-19 రిలీఫ్ కోసం జరిగిన ఓ చారిటీ మ్యాచ్ లో ఆనంద్ ను నిఖిల్ కామత్ అనే వ్యాపారి ఓడించాడు! ఆనంద్ లాంటి చెస్ దిగ్గజ్జాన్ని ఓడించిన కామత్ పై అభినందనలు ప్రశంశల, వర్షం కురిసింది.
కానీ అపరాధభావం అతని మనసును తొలచివేసినట్లున్నది. మోసం చేసాననే అపరాధ భావం కలచివేసినట్లుగా ఉన్నది. చేసిన మోసాన్ని చెప్పుకొని ఊరట చెందగలననుకున్న కామత్ కంప్యూటర్ సహాయంతో ఆనంద్ ను మోసం చేశానని పశ్చాతాప ప్రకటన చేసి మనసులోని బరువును దించుకున్నాడు. తాను మోసం చేసానని చెప్పాడు. సరదా కోసం మాత్రమే ఈ మోసం చేశానని పేర్కొన్నాడు. క్షమాపణ కోరాడు. ఈ సంగతిని ఓ ట్వీట్ ద్వారా ప్రపంచానికి వివరించాడు. ఇందుకుగాను కామత్ ను తప్పకుండా క్షమించవలసిందే. అభినందించవలసిందే. నిఖిల్ కామత్ జీరోధా స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ ను నడుపుతున్నాడు.
గొప్పవాళ్ళలో కొందరు తమ ఆత్మ కథల్లో తాము చేసిన తప్పులు,పొరపాట్లను వివరించి ఊరట చెందుతుంటారు. కొందరు మోసగాళ్ళు కూడా పశ్చాతాపం చెందుతుంటారు. ఇలాంటిదే మరోఘటన కూడా చరిత్రలో నమోదైంది. సుమారు 20 ఏళ్ళ క్రితం ఓ పుస్తకం రిలీజైయింది. జాన్ పెర్కిన్స్ అనే వ్యక్తి ప్రపంచ దేశాలను మోసపు మాటలు, కుట్రలతో ఆర్థికంగా దెబ్బతీసి,అప్పులపాల్జేసి పరాధీనం చేసే అమెరికా కుట్రలో తాను Economic Hitman లాగా పనిచేశానని తన పుస్తకంలో వివరించాడు. ఈ “పెద్ద మనిషి” “Confessions of an Economic Hitman” అనే పుస్తకం ద్వారా పలు దేశాలను తన తెలితేటలతో నాశనం చేసిన సంగతులను వివరించాడు.చేసిన తప్పులను ప్రపంచానికి తెలియ జెప్పడం ద్వారా పశ్చాతాపాన్ని ప్రకటించాడు.అప్పట్లో ఇదొక సంచలనం.
ఓ 25 ఏళ్ళ పాటు ప్రపంచ దేశాలను మోసం చేసే కుట్రలో తాను భాగస్వామిని ఎలా అయ్యాను ఏ ఏ దేశాన్ని ఎలా మోసం చేసాను.ఎలాంటి ప్రాజెక్టుల వలవేసి,ఆ దేశాలను అప్పుల పాల్జేసిన సంగతులను.ఆ దేశాల నాయకత్వాలను అమెరికా ముందు మోకరిల్లేలా చేసిన వైనాన్ని వివరించాడు. అప్పట్లో ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ జాన్ పెర్కిన్స్ అమెరికాకు చెందినవాడు. ఇతగాడి ఇంటర్వ్యూ లు వీడియోల రూపంలో కూడా వచ్చాయి.
తప్పులు,మోసం చేసి ఆత్మానందం పొందే ఇలాంటి మానసిక దౌర్బల్యం నుంచి మనిషి వెలుపలికి వచ్చి హాయిగా నవ్వుతూ ప్రశాంతం జీవనం సాగించే దిశలో సమాజం పరిణామం చెందవలసి ఉన్నది కదా. ఇది అత్యాశే కావచ్చు. గాని ఆశపడడం కోరుకోవడం మంచిదేనని భావిస్తూ, స్వర్గ (స్వర్గం ఉందో లేదో వేరే సంగతి) తుల్యమైన అలాంటి సమాజ నిర్మాణం జరగాలని ఆశిద్దాం.