Rare Museums …………………..
రష్యాలో వందల సంఖ్యలో మ్యూజియాలు ఉన్నాయి. అప్పటి అధినేతలకు ఈ ప్రదర్శన శాలలంటే అభిమానం ఎక్కువ. ప్రత్యేక శ్రద్ధతో ఎన్నోమ్యూజియాలను నెలకొల్పారు. టాల్ స్టాయి,లెనిన్ ల సంస్మరణ కోసం అలాగే రెండవ ప్రపంచ యుద్ధం, తిరుగుబాటు వంటి అనేక చారిత్రాత్మక సంఘటనలను చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేందుకు ఈ మ్యూజియాలను ఏర్పాటు చేశారు.
అవే కాక చిన్న పిల్లల కోసం,సాంస్కృతిక అంశాల స్మరణ కోసం ప్రత్యేక మ్యూజియాలను నెలకొల్పారు. ఆ కోవలోనిదే “దెయ్యాల మ్యూజియం”. ప్రపంచంలో ఇలాంటి మ్యూజియం మరెక్కడా లేదు అంటారు. దీన్నే ‘డెవిల్స్ మ్యూజియం’ అని కూడా పిలుస్తారు. రష్యా లోని కౌనస్ ప్రాంతంలోని లిథువేనియాలో ఈ మ్యూజియం ఉంది.
ఈ మ్యూజియంలో దెయ్యాలు,చేతబడులు వంటి మూఢ నమ్మకాలకు సంబంధించిన అనేక వస్తువులను సేకరించి పదిలపరిచారు. మాంత్రికుల విగ్రహాలు, చేత్తో గీసిన బొమ్మలు,మాంత్రికుల దుస్తులు .. ముఖానికి వేసుకునే తొడుగులు,వారి చేతిలో ఉండే మంత్ర దండాలు, కమండలాలు వంటి వస్తువులను ఇక్కడ భద్ర పరిచారు.
ఆఫ్రికా, ఇండియా,జపాన్ , చైనా వంటి దేశాల్లో మంత్రగాళ్ళు వాడిన వస్తువులను కూడా సేకరించి పెట్టారు. క్షుద్ర శక్తుల ఉపాసన లో వాడే వస్తువులను కూడా ఈ దెయ్యాల మ్యూజియంలో భద్రపరిచారు.కాగా అప్పట్లో లిథువేనియాలో మతపరమైన విగ్రహాలపై నిషేధం ఉండేది.అలాంటి విగ్రహాలు ఎవరి దగ్గరైనా ఉంటే వారిని శిక్షించేవారు.
అంటనాస్ స్ముడ్జినావియస్ అనే కళాకారుడు ఈ విగ్రహాలను సేకరించి పెట్టుకున్నారు. మ్యూజియం మూల పురుషుడు ఇతనే. లిథువేనియా పై శతాబ్దాలుగా వలస పాలకులు పెత్తనం చెలాయించారు.20వ శతాబ్దానికి ముందు లిథువేనియన్ కళాకారుల గురించి ఎవరికి తెలియదు. వారి గొంతుకలు వినబడలేదు.అంటనాస్ యూరోపియన్ విశ్వవిద్యాలయాలలో చదువుకుని లిథువేనియాకు తిరిగి వచ్చాడు.
అంటనాస్ వివిధ దేశాల కళా ఉద్యమాలను అధ్యయనం చేసాడు. ఈ నేపథ్యంలోనే కళాప్రదర్శనలు ఏర్పాటు చేసాడు. ఎందరో వీటిని సందర్శించి అతనికి దేశీయ విగ్రహాలను,కళాఖండాలను,డెవిల్ బొమ్మలను ఇచ్చేవారు. అప్పట్లోనే చేతబడులు ఇతర క్షుద్ర విద్యల గురించి పరిశోధనలు చేసిన ఒక ప్రొఫెసర్ కూడా తాను సేకరించిన వస్తువులన్నీ అంటనాస్ కు ఇచ్చేసాడు.

మరికొన్ని మ్యూజియాలు
వారెన్ అకల్ట్ మ్యూజియం (The Warren’s Occult Museum) – అమెరికా: ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైనది. కనెక్టికట్‌లోని ఈ మ్యూజియంలో ప్రఖ్యాత ‘అన్నాబెల్లె’ బొమ్మ (Annabelle Doll) ఉండేది. ప్రసిద్ధ దెయ్యాల పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ సేకరించిన వింత వస్తువులు ఇక్కడ ఉన్నాయి. (తాత్కాలికంగా మూసివేసి ఉంది)
మ్యూజియం ఆఫ్ షాడోస్ (Museum of Shadows) – అమెరికా: నెబ్రాస్కాలో ఉన్న ఈ మ్యూజియంలో వేల సంఖ్యలో దెయ్యం పట్టినట్లుగా భావించే వస్తువులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశాలలో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది.
సోల్స్ ఇన్ పుర్గేటరీ మ్యూజియం (Museum of the Souls in Purgatory) – ఇటలీ: రోమ్‌లో ఒక చర్చి లోపల ఇది ఉంటుంది. చనిపోయిన వారి ఆత్మలు వదిలి వెళ్లిన గుర్తులు (ఉదాహరణకు పుస్తకాలపై కాలిన చేతి ముద్రలు) ఇక్కడ చూడవచ్చు.
మ్యూజియం ఆఫ్ గోస్ట్స్ (Museum of Ghosts) – చెక్ రిపబ్లిక్: ప్రేగ్ నగరంలో ఉన్న ఈ మ్యూజియం ఆ ఊరి పురాణగాథలు, దెయ్యాల కథల ఆధారంగా రూపొందించబడింది.
హాంటెడ్ మ్యూజియం (The Haunted Museum) – లాస్ వెగాస్: ప్రముఖ టీవీ స్టార్ జాక్ బాగన్స్ దీన్ని నడుపుతున్నారు. ఇందులో చారిత్రక నేరగాళ్లకు సంబంధించిన వస్తువులు, వింత బొమ్మలు ఉన్నాయి.
———–KNM

