సాధారణంగా అసెంబ్లీలలో ప్రజా సమస్యలపై ఎక్కువగా చర్చలు జరుగుతాయి. లేదంటే ఏదో అంశంపై గొడవ పడటం .. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మామూలే. దేశ వ్యాప్తంగా ఏ అసెంబ్లీ ని చూసినా ఇదే తరహాలో ఉంటుంది. అలాంటిది అనూహ్యంగా రాజస్థాన్ అసెంబ్లీలో దెయ్యాలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది.
సరిగ్గా మూడేళ్ళ క్రితం ఈ చర్చ చోటు చేసుకోవడం విశేషం. అసెంబ్లీ లో ఎమ్మెల్యేలు మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్య పరిచింది. అప్పటికి వరుసగా నాలుగు రోజుల నుంచి ఒక ప్రముఖ వార్తా దినపత్రిక అసెంబ్లీ లో దెయ్యాలంటూ పతాక శీర్షికలో వార్తలు ప్రచురించింది. అదే విషయం అసెంబ్లీలో చర్చగా మారింది.
చర్చ జరిగే నాటికి ఇద్దరు ఎమ్మెల్యేలు మరణించారని కూడా సభ్యులు ప్రస్తావించారు. చరిత్రలో ఎపుడూ ఇలా దెయ్యాలపై చర్చ జరిగిన దాఖలాలు లేవు. సభ్యులు విషయాన్నీ ప్రస్తావించి ప్రత్యేక చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో అప్పటి స్పీకర్ మేఘ్వాల్ చర్చకు అనుమతించారు.
బీజేపీ సభ్యుడు రెహమాన్ మాట్లాడుతూ ఇక్కడ అసెంబ్లీ భవనం కట్టకముందు శ్మశానం ఉండేదని .. ఆ స్థలం లో కొంత భాగం అసెంబ్లీ స్థలం లో కలసి పోయిందని .. అందువల్లనే ఇక్కడ దెయ్యాలు సంచరిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇద్దరు నేతలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని కాబట్టి అసెంబ్లీలో శుద్ధి కార్యక్రమాలు చేపట్టి ,శాంతి పూజలు చేయాలని సూచించారు.
మిగతా సభ్యులు కూడా ఇదే అంశాలను ప్రస్తావించారు. అయితే కొంతమంది సభ్యులు మటుకు దెయ్యాలపై చర్చించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. ముందుగా ప్రజా సమస్యలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కొందరైతే మధ్యాహ్నం 12 గంటల లోగా చర్చలు ముగించాలని డిమాండ్ చేశారు.
కొందరైతే ఒక విచారణ కమిటీని వేసి విచారించాలని కూడా స్పీకర్ కు సూచించారు.కాగా రాజస్థాన్ అసెంబ్లీ భవనాన్ని 2001 లో జైపూర్ లోని జ్యోతినగర్ లో దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ అసెంబ్లీ భవనాన్ని ఆనుకునే లాల్ కోఠీ శ్మశాన వాటిక ఉంది.పక్కనే శ్మశానం ఉండటంతో … దెయ్యాలు సంచరిస్తున్నాయని… దీని వాస్తు కూడా సరిగ్గా లేదని ఎమ్మెల్యేలు వాదించారు. ఆ తర్వాత ఏ శాంతి పూజలు చేయించారో, ఏమో మళ్ళీ దెయ్యాల ప్రస్తావన రాలేదు.