Headwinds ……………..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. దీదీ వ్యతిరేక పవనాలు ఎదుర్కొంటున్నారు. సుదీర్ఘకాలం (సుమారు 15 ఏళ్లు) అధికారంలో ఉండటం వల్ల కొంతమేర వ్యతిరేకత సహజంగానే కనిపిస్తోంది.
ఇటీవల జరిగిన సర్వేల ప్రకారం 53.2% మంది ఓటర్లలో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.ఇక కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ఆర్.జి. కర్ మెడికల్ కాలేజీ ఘటనలు ప్రజాభిప్రాయాన్ని కొంత ప్రభావితం చేశాయి.
ఉపాధ్యాయ నియామక కుంభకోణం … ఇది అత్యంత చర్చనీయాంశమైన కుంభకోణం. అర్హత లేని వారికి ఉద్యోగాలిచ్చి, అసలైన అభ్యర్థులకు అన్యాయం చేశారనే ఆరోపణలతో 2025 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు సుమారు 25,000 మంది టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకాలను రద్దు చేసింది.
రేషన్ కుంభకోణం…. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో జరిగిన అవినీతికి సంబంధించి మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 100 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బొగ్గు అక్రమ రవాణా … బొగ్గు తరలింపులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, ఇది సుమారు 3,000 కోట్ల రూపాయల కుంభకోణమని కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఇటీవలే (జనవరి 2026) పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ IPAC కార్యాలయాలపై జరిగిన దాడులు ఈ కేసుతో ముడిపడి ఉన్నవే.
పాత కుంభకోణాలు… గతంలో వెలుగు చూసిన శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ పోంజీ స్కీమ్స్ ద్వారా వేలాది మంది పేద ప్రజలు తమ పొదుపు మొత్తాలను కోల్పోయారు. అలాగే నారద స్టింగ్ ఆపరేషన్ లో నేతలు లంచాలు తీసుకుంటూ కెమెరాకు చిక్కడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. MGNREGA, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన నిధుల దుర్వినియోగం జరిగినట్లు కేంద్రం ఆరోపిస్తోంది.
సందేశ్‌ఖాలీ గ్రామ ఘటనలు… ఈ ప్రాంతంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ మాజీ నేత షేక్ షాజహాన్, అతని అనుచరులపై లైంగిక వేధింపులు,భూకబ్జాలు వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి..రేషన్ కుంభకోణం కేసులో షేక్ షాజహాన్ నివాసంలో సోదాలు చేయడానికి వెళ్ళిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై అతని అనుచరులు మూకుమ్మడిగా దాడి చేశారు.
ఈ ఘటనతోనే ఈ ప్రాంతంలోని అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుల దర్యాప్తును సీబీఐ చేపట్టింది. 2025లో షేక్ షాజహాన్‌పై 2019 నాటి రాజకీయ హత్యల కేసులో కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
డిసెంబర్ 2025లో ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన భోలానాథ్ ఘోష్ కారును ఒక ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కుమారుడు,డ్రైవర్ మరణించగా, ఇది షాజహాన్ జైలు నుండి చేయించిన “హత్య” అని ఆరోపణలు వచ్చాయి. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల భద్రత, అవినీతి అంశాలపై సందేశ్‌ఖాలీ ఘటన ప్రభావం చూపే అవకాశాలున్నాయి.
బెంగాల్‌లో పాగా వేయడానికి బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.అవినీతి ఆరోపణలు, శాంతిభద్రతల అంశాలపై బీజేపీ నిరంతర పోరాటం చేస్తోంది. దీదీ పై ఉన్నవ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నది.
తృణమూల్ కాంగ్రెస్ నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ డిసెంబర్ 2025లో జనతా ఉన్నయన్ పార్టీ (JUP) అనే కొత్త పార్టీని స్థాపించారు. ముస్లిం ఓట్లను లక్ష్యం గా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే అది మమతా బెనర్జీకి లాభిస్తుందా లేదా అనేది 2026 మే నెలలో జరగబోయే ఎన్నికల్లో తేలనుంది.
ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ, మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్, ప్రజాకర్షణ తగ్గలేదు.‘లక్ష్మీర్ భండార్’ (నగదు బదిలీ) వంటి పథకాలు ఆమెకు భారీగా మహిళా ఓటర్ల మద్దతును అందిస్తున్నాయి. “బెంగాల్ గుర్తింపును కాపాడటం” అనే నినాదంతో ఆమె స్థానిక సెంటిమెంట్‌ను బలంగా వాడుకుంటున్నారు.
2026 ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215 కంటే సీట్లు సాధించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్ ..బిజెపి మధ్యే ఉండనుంది. అయితే, బిజెపిలో రాష్ట్ర స్థాయి బలమైన నాయకుడు లేకపోవడం మమతా బెనర్జీకి కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
2025లో జరిగిన ఉప ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఎంసి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఇది ఆమెకు సానుకూల సంకేతం.ఓటర్ల జాబితా సవరణ,కేంద్ర దర్యాప్తు సంస్థల చర్యల చుట్టూ జరుగుతున్న వివాదాలు ఎన్నికల నాటికి మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.మొత్తం మీద ఈసారి మమతా విజయం అంత ఈజీ మాత్రం కాదని అంటున్నారు.

