సింగీతం స్టయిలే వేరు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………………

సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట.

ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. ఆయన దగ్గర పనిచేయాలని తపన పడి దొంగరాముడు సినిమా టైమ్ లో కె.విని అప్రోచ్ అయ్యి … మాయాబజార్ కు కుదురుకున్నాడు.ఆ తర్వాత కె.వి గారి జయంతి పిక్చర్స్ కాంపౌండులోనే ఫిడేలు రాగాల డజన్ పఠాభితో పరిచయం ఏర్పడి … ఆ తర్వాత ఆయన కన్నడలో తీసిన సంస్కారకు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ అయ్యారు. ఆ తర్వాత అదే ఊపులో తెలుగులో రియలిస్టిక్ సినిమాగా తరం మారింది , తమిళంలో థిక్కట్ర పార్వతి తీశారు.

తెలుగులో నీతి నిజాయితీ ఆయన తీసిన తొలి చిత్రమే అయినప్పటికిన్నీ ఆయన పేరు ఆడియన్స్ కు తెలిసింది మాత్రం అమెరికా అమ్మాయి అప్పుడే. అంతకు ముందొచ్చిన జమీందారుగారి అమ్మాయి మ్యూజికల్ గా హిట్టయినప్పటికీ… పేరు మాత్రం అమెరికా అమ్మాయే తెచ్చింది.సింగీతం ఏం తీసినా ఓ కొత్త పాయింటు ఉంటుంది. మాటలు లేని సినిమా అంటే సౌండు ట్రాకు తీసేస్తారేమో అనుకున్నాన్నేను.

ఏ పాత్రా కూడాను మాట్లాడాల్సిన అవసరం రాకుండా ఉండేలా స్క్రిప్టేసుకుని తీసిన పుష్పక విమానం సింగీతం కు సంబంధించి మాస్టరు పీసు. అప్పట్లో అదొక ప్రయోగం. ప్రేక్షకులను కూడా అలరించింది. ఆయన ఆ సినిమాకు సహ నిర్మాత కూడాను. కమల్ హసనుడితో ఆయన చాలా సినిమాలే తీశారు. సొమ్మొకడిది సోకొకడిది తో మొదలెట్టి అమావాస్య చంద్రుడి మీదుగా అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, ముంబై ఎక్స్ ప్రెస్సు, నవ్వండి లవ్వండి తీశారు.

కమల్ తర్వాత సింగీతం కంఫర్ట్ గా ఫీలైన హీరో నందమూరి బాలకృష్ణే. బాలయ్య తో మూడు సినిమాలు చేశారాయన. మొదటిది ఆదిత్య 369, రెండు భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం అలా మూడు సినిమాలు చేశారు. ఆదిత్య 369 కూడా కొత్త తరహా కథ. దీన్నిఒక ప్రయోగం అనుకోవచ్చు. బ్యాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం స్ఫూర్తిగా సింగీతం కథ తయారు చేసుకున్నారు. ఇది సూపర్ హిట్ అయింది.

సింగీతం మైకేల్ మదన కామరాజులో ఓ పాట పాడి నటించి మనల్ని అలరించారు.హిట్టు సినిమా తీయాలంటే కాంబినేషన్స్ వర్కౌట్ చేస్తే సరిపోతుందనుకునే నిర్మాత అశ్వనీదత్ ఓ సమయంలో చిరంజీవి రామ్ గోపాల్ వర్మలతో ఓ సినిమా తీసే ప్రయత్నం చేశారు. ఊర్మిళ చిరంజీవులతో ఓ పాట తీశారు. సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత సింగీతం చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేశారు. ఇళయరాజా సంగీతం అంటూ ఆయన చేసిన ఓ పాటను టబు చిరంజీవులతో షూట్ చేశారు. ఆ సినిమా కూడా ఎక్కువ రోజులు షూటింగ్ జరుపుకోకుండానే ఆగిపోయింది. అయితే ఆ పాట మాత్రం మిగిలిపోయింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!