Rare records ………………………
‘షోలే’ సినిమా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతోంది. ఈ నెల 15 కి షోలే విడుదలై 50 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన తెరవెనుక విశేషాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ తరం హీరోల పారితోషకాలతో పోలిస్తే అప్పట్లో హీరోలకు ఇతర ముఖ్య నటులకు ఇచ్చిన పారితోషకం చాలా తక్కువే అని చెప్పుకోవాలి.
షోలే సినిమాలో వీరు పాత్ర లో నటించినందుకు ధర్మేంద్ర రూ ..1.5 లక్షలు అందుకున్నారు. అప్పటికే ఆయన హీరోగా ప్రూవ్ చేసుకుని విజయ పధంలో ఉన్నారు. ఈ సినిమా నటుల్లో అత్యధిక పారితోషికం తీసుకున్ననటుడు ధర్మేంద్ర ఒక్కరే. ఠాకూర్ బల్దేవ్ సింగ్ లాంటి కీలక పాత్ర పోషించిన సంజీవ్ కుమార్‌కు రూ. 1.25 లక్షలు చెల్లించారు.
అదే సమయంలో అమితాబ్ బచ్చన్ పాత్రకు రూ. 1 లక్ష మాత్రమే ఇచ్చారు. అప్పటికి అమితాబ్ 24 సినిమాలు చేశారు..హీరోగా ప్రూవ్ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ పాత్ర చేసిన అంజాద్ ఖాన్ కి రూ. 50,000 మాత్రమే ముట్టాయి. అంజాద్ అప్పటికే బాలనటుడిగా రెండు సినిమాలు,ఒక చిన్నపాత్రలో ఒక సినిమా చేసారు
ప్రధాన నటీమణులలో హేమమాలిని రూ. 75,000, జయా బచ్చన్ రూ. 35,000 మాత్రమే అందుకున్నారు. ఈ చిత్రానికి కథ రాసిన రచయితలు సలీం ఖాన్, జావేద్ అక్తర్ లు కూడా రూ. 10,000 రూపాయలు చొప్పున తీసుకున్నారు.
ఈ సినిమా లో జై పాత్రకు ముందుగా శత్రుఘ్నసిన్హాను అనుకున్నారు. ఆయన డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ధర్మేంద్ర అమితాబ్ బచ్చన్‌ను సిఫార్సు చేశాడు.1975లో విడుదలైన ఈ సినిమా ను కేవలం 3 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. అప్పట్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు వసూలు చేసింది.అలాగే ఈ చిత్రం కొత్త చరిత్ర సృష్టించింది.
ఈ నాటికి షోలే రికార్డులను బద్దలు కొట్టిన సినిమాలు లేవు. దేశవ్యాప్తంగా ఎన్నో థియేటర్లలో వందల వారాల పాటు ఆడింది.‘షోలే’ విడుదలైన మొదటి రెండు వారాలు పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. విమర్శకుల నుండి కూడా మిశ్రమ స్పందన వచ్చింది.
” సినిమా నిడివి ఎక్కువ “, “హింస ఎక్కువగా ఉంది”, “హాలీవుడ్ వెస్ట్రన్ సినిమాల కాపీ” వంటి విమర్శలు వెల్లువెత్తాయి. చిత్ర బృందం కూడా కొంత నిరాశకు గురైంది. కానీ మూడవ వారం నుండి మౌత్ పబ్లిసిటీ ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే సినిమా ఒక్కో ప్రాంతం నుంచి 1 కోటి వసూళ్లు చేస్తున్నదని వార్తాపత్రికల్లో సలీం జావీద్ లు ప్రచారం చేశారు ఈ సినిమా కోసం తానే అలాంటి ప్రకటన ఇచ్చానని జావేద్ కూడా ఒక సందర్భం లో మీడియాకు వివరించారు.
తమాషాగా అదే నిజమైంది.ఈ సినిమా బాలీవుడ్లో ఎన్నో చరిత్రలు సృష్టించింది. నేటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.ఈ చిత్రం ముంబైలోని మినర్వా థియేటర్ లో వరుసగా ఐదు సంవత్సరాలు (1975-1980) ఆడింది. “షోలే” సినిమా పాటలు, సంభాషణలతో కూడిన ఆడియో క్యాసెట్లు లక్షల సంఖ్యలో అమ్ముడుపోయాయి.. షోలే సినిమా డాల్బీ సౌండ్ తో నిర్మించిన తొలి 70mm సినిమా కావడం విశేషం .