శివగామి వెబ్ సిరీస్ ఆగిపోయిందా ?

Sharing is Caring...

Shivagami ………………………………..

ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను అప్పట్లో సంప్రదించారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది.

శివగామి బాల్యం నుంచి కథ మొదలవుతుంది. మలయాళ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన శివగామి (ద రైజ్ అఫ్ శివగామి ) ఆధారం గా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నారు. మూడు సీజన్స్ లో మొదటి సీజన్ లో కొన్ని భాగాలను షూట్ చేశారు. ఈ పార్ట్ లో యంగ్ శివగామి గా మృణాల్ ఠాకూర్ నటించారు.

షూట్ చేసిన భాగాలు సంతృప్తికరంగా లేకపోవడంతో సుమారు ఆరునెలక్రితం నెట్ ఫ్లిక్స్ మళ్ళీ మొదటి నుంచి రీ షూట్ చేయాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి.కాగా మృణాల్ ఠాకూర్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నది. సబ్జెక్టు పై డైరెక్టర్లకు క్లారిటీ లేదని మృణాల్ వ్యాఖ్యానించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఈ సిరీస్ ను రాజమౌళి పర్యవేక్షణలో దేవ్ కట్టా, ప్రవీణ్ సత్తారు లు డైరెక్ట్ చేశారు. మొదటి సీజన్ సంతృప్తి గా లేదని నెట్ ఫ్లిక్స్ మేనేజిమెంట్ అనడంతో ఆ ఇద్దరు కూడా తప్పుకున్నట్టు అప్పట్లో ఫీలర్లు వచ్చాయి. తర్వాత బాలీవుడ్ డైరెక్టర్లు కునాల్ దేశముఖ్,రీబు దాస్ గుప్తా పేర్లు తెరపైకి వచ్చాయి.

రాజమౌళి మినహా టీమ్ మొత్తాన్ని మార్చేస్తున్నారని అప్పట్లో అనుకున్నారు.ఈ క్రమంలోనే తొలుత యంగ్ శివగామి పాత్రకు సమంత ను నెట్ ఫ్లిక్స్ టీమ్ సంప్రదించింది. భారీ పారితోషికాన్నిఆఫర్ చేసింది. అయితే సమంత వెనకడుగు వేసింది. కథ నచ్చినప్పటికీ సుదీర్ఘ కాలం వెబ్ సిరీస్ కు కాల్ షీట్స్ ఇస్తే కెరీర్ కి ఇబ్బంది అవుతుందని సమంత సుముఖత చూపలేదని వార్తలు వచ్చాయి.

తర్వాత హిందీ నటి వామికా గబ్బీని శివగామి పాత్ర కోసం తీసుకుంటున్నారని కొన్నాళ్ళు ప్రచారం జరిగింది.ఈ క్రమంలోనే సౌత్ ఇండియా అగ్రనటి నయన తార పేరు కూడా వినిపించింది.రమ్యకృష్ణ నయనతార ముఖ కవళికలు ఒకేలా ఉంటాయి. యంగ్ శివగామిగా నయన కరెక్టుగా సూట్ అవుతారని అంచనా వేసినట్టు ఫీలర్లు వచ్చాయి.

ఏమి జరిగిందో ఏమో గానీ అసలు ప్రాజెక్టు నే వాయిదా వేసుకున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించలేదు. సుమారు 375 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేసింది.మూడేళ్ళనుంచి ఈ ప్రాజెక్టు వర్క్ నడుస్తోంది. ఆరునెలలుగా పెండింగ్లో పడింది.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!