హరికృష్ణ తో సినిమా అలా ఆగిపోయిందా?

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ……………………..

నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం.

అదే మాట ఆయన తన కుమారుడు NTR కు చెప్పారు….NTR నవ్వి ఊరుకున్నారు తప్ప స్పందించలేదు.దీంతో ఆయనకు తిక్క రేగి ఇలా లాభం లేదని తనే నిర్మాత గా మారాలి అనుకున్నారు.

అనుకోవడం ఏమిటి వెంటనే రచయిత DV నరసరాజు గారిని పిల్చి అయ్యా నా మనవడు హీరోగా నా కొడుకు ప్రధాన పాత్ర లో ఓ కథ కావాలి.నేనే నిర్మాతను. అని అడ్వాన్స్ హరికృష్ణ చేతుల మీదుగా ఇప్పించేశారు.
నరసరాజు గారు కథ రాసేసారు.టైటిల్ “తమ్ముడి పెళ్లి మామ భరతం “ తమ్ముడు హరికృష్ణ అన్న NTR ఇది లైను.

కథ రాయడం పూర్తి అయ్యాక NTR గారి ఇంటికి వెళ్లారు రాజుగారు.ఆయన వెళ్లే సరికి NTR ఇంట్లో ఉన్నారు. ఏమిటి విషయం రాజుగారు ఇలా వచ్చారు అని అడిగారు అన్నగారు రాజుగారిని.
అయ్యా మీరు ప్రధాన పాత్రలో మీ అబ్బాయ్ హరికృష్ణ హీరోగా ఓ కథ కావాలి అన్నారు మీ నాన్నగారు.తనే నిర్మాతను అనికూడా చెప్పారు. అడ్వాన్స్ ఇచ్చారు. స్క్రిప్ట్ పూర్తి అయ్యింది.ఇవ్వడానికి వచ్చాను అని చెప్పారు రాజుగారు.

NTR పెద్దగా నవ్వి మా నాన్న గారి అభిప్రాయం ఏమిటో తెల్సా రాజుగారూ అంటూ మొదలుపెట్టారు అన్నగారు. తన మనవడిని హీరో చేయడం నాకు ఇష్టం లేదని ఆయన భావన. అంతే కాదు వాడు హీరో అయితే నా అవకాశాలు పోతాయ్ అని భయపడి సినిమా తీయడం లేదని కూడా ఆయన ఫీలవుతున్నారు తెల్సా? అని ఆపారు NTR.

ఆశ్చర్యంగా ఉందండి అన్నారు రాజు గారు.

ఆశ్చర్యం ఎందుకు మనవడి మీదున్న నమ్మకం. .. సరే మీకు బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి అని అడిగి చెక్ ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ తన టేబుల్ సొరుగు లో పెట్టి లాక్ చేశారు అన్నగారు. ఆ సొరుగు NTR కన్నుమూసిన తర్వాత ఓపెన్ చేశారు పిల్లలు.

అందులో. ..’తమ్ముడు పెళ్లి మామ భరతం’ స్క్రిప్ట్ చూసి ఆశ్చర్యపోయి బాలకృష్ణ కు ఇచ్చారు.
ఆయన దాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చిన తర్వాత నరసరాజు గారి ఇంటికి తీసుకువెళ్లి ఇవ్వబోయరట… బాబూ ఈ స్క్రిప్ట్ కు సంబంధించిన డబ్బులు మీ తాతగారు తండ్రి గారు కలసి ఇచ్చేసారు. అది మీదే. .. మీ దగ్గరే ఉంచండి అని చెప్పి పంపారట.

ఇది కథ. ..ఆ హరికృష్ణ గారు తర్వాత చైతన్యరథ సారధై అన్నగారిని ముందుకు నడిపాడు. …ఎన్టీఆర్ దగ్గర అలా పెండింగ్ స్క్రిప్ట్స్ చాలానే ఉన్నాయంటారు . చాణక్య చంద్రగుప్త కూడా చాలాకాలం పెండింగ్ లో ఉంది. సినిమా తీసేనాటికి పింగళి వారు లేకపోవడం తో కొండవీటి వెంకట కవి చేత మార్పులు,,చేర్పులు చేయించారు.  

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!