ఆనాటి వర్మ ఏమైపోయాడో ?

Sharing is Caring...

ముప్పయేళ్ల క్రితం రిలీజ్ అయిన “క్షణక్షణం” సినిమాను ఇపుడు చూసినా ఫ్రెష్ గానే ఉంటుంది. రాంగోపాల వర్మ కెరీర్ లో ఇదొక బెస్ట్ మూవీ. సినిమా చూసిన వారికి  “ఇప్పటి వర్మేనా? ఆ వర్మ “అన్నడౌట్ కూడా వస్తుంది.  తన అభిమాని నటి శ్రీదేవి కోసం కష్టపడి ఈ సినిమా తీసాడు వర్మ.

ఇందులో శ్రీదేవి నటన అద్భుతంగా ఉంటుంది. కథ మొత్తం శ్రీదేవి చుట్టూనే నడుస్తుంది. సత్య పాత్రలో అమాయకత్వాన్ని, భయాన్ని అవలీలగా ప్ర‌ద‌ర్శించి వెంకీ ని డామినేట్ చేసింది.  దేవుడా దేవుడా అనే మ్యానరిజం డైలాగు కూడా ఆమెకు ప్లస్ అయింది.

ఒక చిన్న పాయింట్ ఆధారంగా అల్లుకున్న కథను వర్మ సూపర్ గా తెర కెక్కించారు. బ్యాంక్ రాబరీ తో మొదలయ్యే సినిమా కథ  తిన్నగా అడవిలోకి వెళుతుంది. అక్కడనుంచి ఉత్కంఠ భరితంగా సాగుతుంది. సినిమాలో కీలక పాత్రల్ని వర్మ డిఫరెంట్ గా మలిచారు. పరేష్ రావల్ క్యారెక్టర్ పెక్యులియర్ గా ఉంటుంది. ఆ పాత్ర మరెవరూ చేసిన అంత క్లిక్ అయ్యేది కాదేమో. ట్రైన్ పై ఫైట్స్ కూడా ఆకట్టుకుంటాయి.

అడవిలో ప్రకృతి అందాలను ఎస్.గోపాల్ రెడ్డి గొప్పగా చిత్రీకరించారు. నైట్ ఎఫెక్ట్ సీన్స్ బాగుంటాయి.రచయిత సత్యానంద్ డైలాగ్స్ బాగా పేలుతాయి. కీరవాణి బ్యాగ్రౌండ్ మ్యూజిక్, పాటలు సినిమా హిట్ కావడానికి దోహద పడ్డాయి.   

‘జామురాతిరి జాబిలమ్మ.. చలి చంపుతున్న చమక్కులో.. అమ్మాయి ముద్దు ఇవ్వందే.. కో అంటే కోటి.. అందనంత ఎత్తా తారాతీరం’ పాటలు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ గా నిలిచిపోయాయి. పాటల చిత్రీకరణ లో కూడా వర్మ ప్రత్యేకతను చూపించారు.

ముందే చెప్పుకున్నట్టు వర్మ లోని ఆ దర్శకుడు ఇపుడు లేరు. మాయమై పోయారా అనిపిస్తుంది. ఈ సినిమాలో నటనకు గాను బెస్ట్ యాక్ట్రెస్‌గా శ్రీదేవి, ఉత్తమ స్క్రీన్‌ప్లే రైట‌ర్ .. బెస్ట్ డైరెక్టర్‌గా రామ్ గోపాల్ వర్మ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల రెడ్డి నంది అవార్డులు అందుకున్నారు.

ఈ షూటింగ్ సందర్భంగా జనాలు శ్రీదేవి మీద ఎగబడకుండా యూనిట్ సభ్యులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ట్రైన్ ఎపిసోడ్ తీసేటప్పుడు వెంకటేష్ ,శ్రీదేవి..ఫైట్ మాష్టర్ హార్స్ మెన్ బాబు.. ఇతర ఫైటర్స్..గోపాల్ రెడ్డి..రామ్ గోపాల్ వర్మ..మిగతా యూనిట్ అంతా నంద్యాల లో ట్రైన్ ఎక్కి.. షూటింగ్ చేసుకుంటూ ‘దిగువ మెట్ట’ స్టేషన్ కి చేరుకునే సరికి సాయంకాలం 5 గంటలు అయ్యేది.

లంచ్ కూడ ట్రైన్ లోకి తెచ్చే వాళ్లు ప్రొడక్షన్ సిబ్బంది..ట్రైన్ ఎక్కడ ఆగదు కాబట్టి జనం తో ఇబ్బంది రాలేదు. కానీ ‘దిగువ మెట్ట’ లో నటీ నటులు కార్లు ఎక్కుతారు అనే సంగతి చుట్టు పక్కల గ్రామాల్లో అందరికీ తెలిసి పోయింది.

రెండో రోజు ట్రైన్ ‘దిగువ మెట్ట’ వచ్చేసరికి శ్రీదేవి ని చూసేందుకు చుట్టు పక్కల ఊళ్ళ నుండి జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. బోగీ లు గాలిస్తున్నారు. అప్పట్లో హీరో హీరోయిన్ లకు బౌన్సర్లు లు ఉండేవారు కారు. జనాన్ని చూసిన అసిస్టెంట్ డైరెక్టర్ శివనాగేశ్వర రావు కు ఒక ఆలోచన వచ్చింది.

షూటింగ్ లో వాడే డమ్మీ రివాల్వర్ ని తీసుకున్నారు. ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న టవల్ పరిచి దాని మీద రివాల్వర్ ని వుంచి దాని వైపే చూడసాగారు. అపుడే ఉత్తేజ్ వచ్చారు. ఏదో అడగ బోతే వారించి రివాల్వర్ వైపే చూడమన్నారు. అంతే.. నెమ్మది గా ఒక్కొక్కరూ వచ్చి శివనాగేశ్వర రావు వైపు .. రివాల్వర్ వైపు చూడటం మొదలెట్టారు.

అలా అందరి దృష్టి ని శ్రీదేవి మీద నుండి రివాల్వర్ మీదకు మళ్లించారు శివనాగేశ్వరరావు. ఈలోగా ప్రొడక్షన్ సిబ్బంది శ్రీదేవి ని తీసుకెళ్ళి కారు ఎక్కించారు. ఈ సంగతి శివనాగేశ్వరరావు ఆమధ్య ఫేస్బుక్ లో షేర్ చేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఉంది. చూడని వాళ్ళు చూడొచ్చు. 

——-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!