Success with hard work………………
గాయని మైథిలీ ఠాకూర్ బిహార్ శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టించారు. 25 ఏళ్ల వయసులోనే అసెంబ్లీకి ఎన్ని కైన అతిపిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పారు. అలీనగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన ఆమె ఆర్జేడీ నేత వినోద్ మిశ్రా ను సుమారు 11 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఆమె బీజేపీ టిక్కెట్ కోసం ప్రయత్నించడం .. టిక్కెట్ ఖరారు కావడం కూడా విశేషమే. ఆధ్యాత్మిక, జానపద గీతాలతో సోషల్ మీడియాలో సంపాదించిన పాపులార్టీ టిక్కెట్ పొందటంలో,విజయం సాధించడంలో ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. మైథిలీ తొలి సారిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే గా ఎన్నిక కావడం విశేషం.
గతంలో ఎన్నికల కమిషన్ బిహార్ ‘స్టేట్ ఐకాన్’గా నియమితులయ్యారు. బిహార్ సాంస్కృతిక అంబాసిడర్‌గా కూడా ఆమె గుర్తింపు పొందారు. బిహార్ జానపద సంగీతానికి చేసిన సేవలకుగానూ 2021లో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సంగీత నాటక అకాడమీ ఆమెను సత్కరించింది.
వాస్తవానికి అలీనగర్ నియోజకవర్గం ఆర్జేడీకి కంచుకోట వంటిది. అలాంటి బలమైన నియోజకవర్గంలో మైథిలీ గెలుపు గొప్ప విషయమే. 2024లో అయోధ్య రాముడి ఆలయ ప్రారంభ సమయంలో శబరి మీద మైథిలి పాడిన పాట ప్రధాని మోదీని ఆకట్టుకుంది.మోదీ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ నేపథ్యమే ఆమె రాజకీయాల్లోకి రావడానికి కారణమైంది..బీజేపీ లో చేరి అనూహ్యంగా… టికెట్ పొందడమే కాక విజయం సాధించారు.
అలీనగర్ నియోజకవర్గంపై గతంలో ఆర్జేడీకి చెందిన సీనియర్ నాయకుడు అబ్దుల్ బారి సిద్ధిఖీ ఆధిపత్యం చెలాయించారు. ఆయన ఇక్కడ నుంచి ఏడుసార్లు గెలిచారు. 2020లో ఈ సీటును NDA లో చేరిన మరో ఆర్జేడీ పాత నాయకుడు మిశ్రీ లాల్ యాదవ్ కేవలం 3,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.అపుడు కూడా ఆర్జేడీ నుంచి వినోద్ మిశ్రా నే పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
మైథిలి 2000 జులై 25న మధుబనిలోని జేని పట్టిలో జన్మించారు. తండ్రి రమేశ్ ఠాకూర్ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, తల్లి టీచర్..రమేశ్ చిన్నప్పటి నుంచే కుమార్తెకు శాస్త్రీయ సంగీతం నేర్పించారు. ఆమె సోదరులు ఆయాచీ, రిషణ్ కూడా సంగీతం నేర్చుకున్నారు.ఆమె తన జానపద పాటలతో ‘సోషల్ మీడియాలో అభిమానులను సంపాదించుకున్నారు.
మైథిలీ ఎన్నో పోటీలలో పాల్గొని బహుమతులు సాధించారు. చిన్నతనంలో మైథిలీ, ఆమె సోదరుల సంగీత సాధన ఇతరులకు ఇబ్బంది గా మారిన క్రమంలో వారు 17 సార్లు ఇల్లు మారారు. 2017లో వారు సొంత ఇల్లు కొనుగోలు చేశారు. మైథిలి 2017లో ‘రైజింగ్ స్టార్ ఇండియా’ అనే సింగింగ్ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
ఆమె స్వచ్ఛమైన స్వరం, సాంప్రదాయ గీతాలను పాడిన తీరు దేశవ్యాప్తంగా గుర్తింపును సంపాదించిపెట్టింది. ఆమె గెలవకపోయినా, ఆమె ప్రతిభ కు గుర్తింపు లభించింది. స్వల్పకాలం లోనే సంగీత ప్రియులలో సుపరిచితమైన పేరుగా మారింది..టెలివిజన్‌లో కనిపించిన తర్వాత, మైథిలి ఆన్‌లైన్‌లో తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించింది.
ఆమె యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా పేజీలు బాగా ప్రాచుర్యం పొందాయి, అక్కడ ఆమె శాస్త్రీయ ప్రదర్శనలను మాత్రమే కాకుండా భారతదేశ విభిన్న సంప్రదాయాలను ప్రతిబింబించే జానపద పాటలను కూడా పాడింది.
మైథిలి ఠాకూర్ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతతో కూడిన అనేక పాటలను పాడారు. ఆమెప్లే జాబితాలో ‘మై రి మై’, ‘రంగ్‌బటి’ ‘ఛత్ పూజ గీత్’ వంటి ప్రసిద్ధ ట్రాక్‌లు ఉన్నాయి. ‘నవరాత్రి కే భజన్’, ‘హరి నామ్ నహీ తో జీనా క్యా పతా నహీ కిస్ రూప్ మే ఆకార్’ .. ‘యే తో ప్రేమ్ కీ బాత్ హై’ వంటి భజనలను కూడా రికార్డ్ చేసింది.
మైథిలీ కి ఇన్స్టా. యూట్యూబ్లో కలిపి ఆమెకు 1.1 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఫేస్బుక్లో 1.4 కోట్ల మంది ఆమెను అనుసరిస్తున్నారు.నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మైథిలీ అంటున్నారు.

