Brain Wash……………………
ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి బీ.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ (సీఎం కాక ముందు) ఒక సందర్భంలో క్లాస్ పీకారట. ఈ ఘటన గురించి స్వయంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకున్నారు. ఇది జరిగింది ఇపుడు కాదు ..2005 జులై 20 వ తేదీన. ఢిల్లీ వెళ్లే విమానంలో కేసీఆర్ , ఆలే నరేంద్ర , ఉండవల్లి అరుణ్ కుమార్ లు ప్రయాణం చేస్తున్నసమయంలో.అప్పటికి కేసీఆర్, ఆలే నరేంద్రలు యూపీఏ సర్కార్ లో కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఉండవల్లి కొత్తగా ఎంపీ అయ్యారు.
ఆ రోజు ప్రయాణంలో ఏమి జరిగిందో ఉండవల్లి స్వయంగా ” ఒక విభజన కథ ” పుస్తకంలో రాసుకున్నారు. ఇక చదవండి. ఉండవల్లి మాటల్లోనే ….
“విమానంలో నన్ను గమనించిన కేసీఆర్ నరేంద్ర ద్వారా పిలిపించారు. తన పక్కన కూర్చోమన్నారు. ఉమ్మడి రాష్ట్రం వల్ల తెలంగాణా ఎంత నష్టపోయిందో అంకెలతో సహా ఆవేశంగా బహిరంగ సభల్లో చెప్పే కేసీఆర్ ఆరోజు నాతో ఉమ్మడి రాష్ట్రం మూలంగా కోస్తా .. రాయలసీమకు జరుగుతున్ననష్టం గురించి వివరించారు. స్కూల్ మాస్టర్ లెక్కలు చెప్పినట్టు ప్రతి ఒక్క దాన్ని అంకెలతో సహా వివరించి చెప్పారు.
గోదావరి , కృష్ణా నదుల నీరెంత ? ఎవరెంత వాడుకుంటున్నారు ? గోదావరి జిల్లాలకు ఎంత అన్యాయం జరుగుతోంది చెప్పారు. రాష్ట్రం విడిపోతే ఆ అన్యాయాన్ని ఎలా ఆపుకోవచ్చో కూడా చెప్పారు. పారిశ్రామికంగా సీమాంధ్ర ప్రాంతంలో చెప్పుకోదగిన పరిశ్రమ ఏది ?” అని ప్రశ్నించారు.
“మీ మాటలు వింటుంటే మీరు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వదిలేసి ప్రత్యేక ఆంధ్రా ఉద్యమం మొదలు పెట్టేలా కనబడుతున్నారు “అన్నాను.
“నిజమే మీ దగ్గర కూడా ప్రత్యేక రాష్ట్రం వల్ల వచ్చే ఉపయోగాల గురించి ప్రచారం జరగాలి అన్నారు. 1972 నాటి ఉద్యమం లో మీరు కూడా చురుగ్గా ఉన్నారు కదా అన్నారు. అయితే అప్పటి హైదరాబాద్ ,ఇప్పటి హైదరాబాద్ వేరని ఆయనకు చెప్పా . మీరు తెలంగాణను కోరుకుంటున్న విషయం మాకర్ధమైంది.
మమ్మల్ని హైదరాబాద్ వదిలి పొమ్మంటున్న విషయం కూడా అర్ధమైంది అని కేసీఆర్ తో అన్నాను. అయితే ఆ ఆలోచన తెలంగాణా వారికి లేదని ,కేవలం కొందరు సీమాంధ్ర నేతలు అలా ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. ఇదే విషయాన్నీ అందరిని పిలిచి చెప్పాలని సూచించాను. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అందుకు ఒప్పుకోడని అన్నారు. అలా విమానం ఢిల్లీలో ల్యాండ్ అయ్యేంతవరకు అంటే దాదాపు గంటంబావు కేసీఆర్ చెబుతూనే ఉన్నారు.
ఆయనతో కూర్చొన్నాకనే “బ్రెయిన్ వాష్ “అనే పదానికి అర్ధం తెలిసింది. ఆరోజు కేసీఆర్ చెప్పిన మాటల్లోని ప్రతి అక్షరం నాకు గుర్తుంది. అలా చెప్పగల నేర్పు కేసీఆర్ కి ఉంది ” అంటూ ఉండవల్లి ఈ ఘట్టం లో తన అనుభవాన్ని వివరించారు.
ఈ పుస్తకం 2016 సెప్టెంబర్ లో మార్కెట్లో కొచ్చింది.
———- KNMURTHY