ఇందిర ఆ సినిమా విడుదల కు అడ్డం పడిందా ? (1)

Sharing is Caring...

Taadi Praksh……………………………….

A LANDMARK POLITICAL FILM—-———— సరిగ్గా 47 సంవత్సరాల క్రితం 1974లో ‘గరంహవా’ (Scorching Wind) విడుదల అయింది. ’వేడిగాలి’ లేదా ‘వడగాడ్పు’ అనొచ్చు. కొందరు ఈ సినిమాని నిషేధించాలి అన్నారు. హిందూ ముస్లిం గొడవల్ని ఇంకా పెంచే ప్రమాదకరమైన సినిమా అని ఇంకొందరు అన్నారు. మనదేశంలో వచ్చిన గొప్ప రాజకీయ చిత్రం అన్నారు విమర్శకులు.

దేశవిభజన తర్వాత పరిణామాలని ఇంత బాగా తెరకెక్కించడం అసాధారణం అన్నారు చాలామంది. ఉత్తర ప్రదేశ్‌లోని ఒక ముస్లిం కుటుంబం, విభజన తర్వాత పడిన అగచాట్లే ‘గరంహవా’. ఆరుగురు మహానుభావుల సృజనాత్మక కృషి ఫలితం ఈ Landmark Film. కథ : ఇస్మత్‌ చుగ్తాయ్‌, స్క్రీన్‌ప్లే : కైఫీ ఆజ్మీ, షామాజైదీ, ఫోటోగ్రఫీ : ఇషాన్‌ ఆర్య, సంగీతం : ఉస్తాద్ బహదూర్ ఖాన్హీరో : బలరాజ్‌ సహానీ దర్శకత్వం : ఎం.ఎస్‌. సత్యు.

మైసూర్‌ శ్రీనివాస్‌ సత్యు కన్నడిగ, బ్రాహ్మిన్‌. దక్షిణాదికి చెందిన ఒక బ్రాహ్మడు, ఉత్తరాది ముస్లింల సమస్య మీద సినిమా తీయడం ఏమిటో? అని కొందరు వెటకారంగా అన్నారు. సత్యు బాగా చదువుకున్నవాడు. వామపక్ష భావాలకు బంధువు. సత్యు భార్య ముస్లిం. ‘‘లోతైన అవగాహన, సరైన దృక్పధం, ఇంగితమూ, స్పందించే గుణమూ వున్న వారెవరైనా ఇలాంటి సినిమాలు తీయొచ్చు.

ముస్లిములు మాత్రమే ఇలాంటి సినిమా తీయాలన్న రూల్ ఏమీ లేదు అన్నారు సత్యు. గొడవలు జరగొచ్చని భయపడిన నిర్మాత వెనక్కి తగ్గాడు. ‘గరంహవా’ తీయడానికి అప్పట్లో 10 లక్షల రూపాయలు ఖర్చయింది. సత్యు దగ్గర పెద్దగా డబ్బుల్లేవు. ఇండియన్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ రెండున్నర లక్షలు ఇచ్చింది. ఇషాన్‌ ఆర్య కొంత డబ్బు పెట్టాడు. మిగిలింది అప్పు చేశాడు సత్యు.

ప్రఖ్యాత ఉర్దూ రచయిత్రి ఇస్మత్‌ చుగ్తాయ్‌, ప్రసిద్ధకవి, రచయిత కైఫీ అజ్మికి తన కథ వివరించారు. విభజన వల్ల చుగ్తాయ్‌ బంధువులు పాకిస్థాన్‌ వెళ్లిపోవడంలాంటి అనుభవాలు చెప్పారు. కైఫీ తన సొంత అనుభవాన్నీ, లక్నోలో ముస్లింలు నడిపే లెదర్‌ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాల్ని జోడించి ‘సినిమా కథ’ సిద్ధం చేశారు. కైఫీ, సత్యు భార్య షామా కలిసి స్క్రీన్‌ ప్లే రాశారు.

బలరాజ్‌ సహనీతో సహ వీళ్ళంతా అప్పటి ఇండియన్‌ పీపుల్స్‌ థియేటర్‌ (IPTA) లో కలిసి పని చేసేవారు. అందరూ కమ్యూనిస్టులే.సెట్టింగులు ఏమీ వేయకుండా, లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో సహజంగా వుండేలా షూట్‌ చేయాలని సత్యు నిర్ణయించారు. వామపక్షవాదులంతా కలిసి ముస్లింలకు అనుకూలంగా సినిమా తీస్తున్నారన్న కోపంలో కొందరు షూటింగ్‌ని అడ్డుకున్నారు.

దానికి విరుగుడు కనిపెట్టాడు సత్యు. రీలులేని కేమెరా యిచ్చి ఒకచోట ఉత్తుత్తి షూటింగ్‌ చేయించాడు. అక్కడ నిరసనకారులు గొడవచేస్తుంటే, మరో ప్రాంతంలో ఆయన అసలు సినిమా షూట్‌ చేసుకున్నాడు. లక్నోలో ఆయన మిత్రులు కొందరు ఎంతో సహాయం చేశారు. తగినంత డబ్బులేకపోవడం వల్ల మాటలు, సంగీతం లేకుండా ‘మూకీ’ గానే షూట్‌ చేశారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌లో వాటిని కలిపారు.

కమర్షియల్‌గా లేకుండా, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత పండితుడు బహుదూర్‌ ఖాన్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నారు. లక్నో యిరుకు వీధుల్లో, పాత హవేలీల్లో నానా తిప్పలు పడి షూటింగ్‌ ముగించారు. సినిమా సిద్ధం అయింది. విడుదల ఎలా? బొంబాయిలోని భారత సినీ సెన్సార్ వారు సినిమా చూశారు. దీన్ని తక్షణం నిషేధించాలి అన్నారు. రివ్యూ కమిటీకి వెళ్ళాడు సత్యు.

సినిమా చాలా బావుందని కమిటీ వాళ్ళన్నారు. ఎటూ తేల్చకుండా వూరుకున్నారు బోర్డువాళ్ళు. సినిమా ఆగిపోయేట్టు వుందన్న అనుమానంతో సత్యు నాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిశారు. ఆమె ‘గరంహవా’ చూస్తానని అన్నారు. ఒక ఆదివారం రాష్ట్రపతిభవన్‌లో షో వేశారు. ఇందిరాగాంధీ, సమాచారమంత్రి ఐ.కె.గుజ్రాల్‌, సుభద్రాజోషి మరికొందరు కేంద్రమంత్రులు సినిమా చూశారు. ‘ఫిల్మ్‌ అచ్ఛాహై’ అని సత్యుతో చెప్పి ఇందిర వెళ్ళిపోయారు. ఏం చేయమంటారు? అని సత్యు అడిగితే, మా కాంగ్రెస్‌ ఎంపీలకు ఓసారి చూపించండి అన్నారామె.

అదయ్యాక, ప్రతిపక్షాలూ చూస్తే బావుంటుందిగా అన్నారు ఇందిర. ఆ షో కూడా అయింది. కొంపమునిగేట్టు వుందని భయపడిన సత్యు, కమ్యూనిస్టు నాయకులు, వామపక్ష జర్నలిస్టులు అందరికీ ఒక స్పెషల్‌ షో వేసి చూపించారు. అందరూ గొప్ప సినిమా అనే అన్నారు.

మళ్ళీ ఇందిరాగాంధీని కలిసి అడిగారు సత్యు. మీరు దక్షణాదిన విడుదల చేసుకోండి అన్నారామె. అదేమిటీ? అంటే, ఉత్తరాదిన మధ్యంతర ఎన్నికలు వున్నాయి, ముస్లిం వోట్లకోసం కాంగ్రెస్‌ వాళ్ళు స్పాన్సర్‌ చేసి ‘గరంహవా’ తీయించారంటారు. అది మాకు ఇబ్బంది అవుతుందని ఇందిరాగాంధీ చెప్పారు.

ఇంత మంచి సినిమా తీసి దేశమంతా విడుదల చేయలేకపోతున్నానని సత్యు విలవిల్లాడిపోయారు. పారిస్‌నుంచి దర్శకుడికి ఓ ఫోన్‌ వచ్చింది. ఢిల్లీలో ‘గరంహవా’ చూసిన వాళ్ళు సినిమా అద్భుతంగా వుందని అంటున్నారు. పారిస్‌రండి, ఇక్కడ ప్రీమియర్‌ షో వేద్దాం అని సత్యు మిత్రుడు అన్నాడు. పారిస్‌ వెళ్ళాలి. విమానం టికెట్‌కి డబ్బుల్లేవు.

ఓ పెద్దాయన ఫోన్‌తో ఎయిర్‌ఇండియా ఉచిత ప్రయాణం సాధ్యమైంది. ‘గరంహవా’ చూసిన పారిస్‌ సినీ పండితులు ఉద్వేగంతో ఊగిపోయారు. దీన్ని ప్రతిష్టాత్మకమైన కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి పంపాలి అన్నారు. కాన్స్‌లో ‘గరంహవా’ చూసి, దీన్ని ఆస్కార్‌ అవార్డుకి నామినేట్‌ చేయాలన్నారు.

 

pl. read it ……  ఇందిర ఆ సినిమా విడుదల కు అడ్డం పడిందా ? (2)

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!