A singer who served the Lord ……………………
సంగీత ప్రియులలో గరిమెళ్ళ గానం వినని వారు ఉండరు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఖ్యాతి గాంచిన గరిమెళ్ల ఆరువందల కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 6వేలకు పైగానే ఆయన కచేరీలు చేశారు.
గరిమెళ్ళకు బాగా గుర్తింపు తెచ్చిన కీర్తనలలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’, ‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు’, ‘జగడపు చనువుల జాజర’, ‘ఇతడొకడే సర్వేశ్వరుడు’, ‘నమో నారాయణాయ నమో’ వంటివి ఉన్నాయి. వేలాది వేదికలపై గరిమెళ్ళ కచేరిలు చేశారు.
300 కీర్తనలు నాన్ స్టాప్ గా పాడి రికార్డ్ సృష్టించారు. సిలికానాంధ్ర సంస్థ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ‘లక్ష గళార్చన’ కార్యక్రమలో లో బాలకృష్ణ ప్రసాద్ ప్రధాన గాయకులు.. ఈ ప్రోగ్రాం గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు కెక్కింది. సంప్రదాయ కర్ణాటక సంగీతం తో పాటు లలిత, జానపద సంగీతంలోనూ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సుప్రసిద్ధులు.
రాజమండ్రి వారి స్వస్థలం .. 1948లో కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు గరిమెళ్ల జన్మించారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని ఎస్.జానకి ఈయనకు స్వయాన పిన్నిఅవుతారు. మృదంగ విద్వాంసులైన తండ్రి స్ఫూర్తితోనే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నారు. సాధన చేశారు.
1978లో టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో గాయకుడిగా చేరిన గరిమెళ్ళ 2006లో ఉద్యోగ విరమణ పొందారు. 2012 నుంచి 2023 వరకూ టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా పని చేసారు. కేవలం కొంతమందికి మాత్రమే వరించే అవకాశం గరిమెళ్ళకు దక్కింది. అన్నమయ్య కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు కృషి చేశారు.
నేదునూరి కృష్ణమూర్తి, పశుపతి వంటి గురువుల వద్ద గరిమెళ్ళ శిక్షణ పొందారు.హరి సంకీర్తన ప్రక్రియ ద్వారా ఎందరో శిష్యులను తీర్చిదిద్దారు. సినిమా అవకాశాలు వచ్చినా వదులు కున్నారు. తన జీవితం శాస్త్రీయ సంగీతానికి, స్వామివారి సేవకు అంకితం చేశారు. 2020లో గరిమెళ్ళకు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.
అపర అన్నమయ్య, అన్నమాచార్య సంకీర్తనా మహతి బిరుదులు అందుకున్నారు. గరిమెళ్ల గీత రచయిత కూడా .. శ్రీవేంకటేశ్వర స్వామి సేవకులుగా ఉన్నప్పటికీ ఆయన స్వతహాగా హనుమాన్ భక్తులు. 21 ఆంజనేయ కృతులు రచించి వాటిని స్వరపరిచారు. అలాగే వినాయకుడిపై 50 కృతులు రచించారు. 150 శివ పద కీర్తనలను స్వరపరచి ఆలపించారు.
ఆధ్యాత్మిక ప్రవచనకర్త, కవి సామవేదం షణ్ముఖశర్మ రచించిన శివపదం గీతాలకు సంగీతం సమకూర్చి నవరసాత్మకంగా, భావబంధురంగా గానంచేసి శివభక్తులను అలరించారు బాలకృష్ణ ప్రసాద్. వారే ధన్యులు, అమ్మచేతి పసుపుబొమ్మ, నమశ్శివాయ నటేశ్వరాయ, శివనామమా నీకు వంటి పలు గీతాలు జనరంజకమై ఇంటింటా మారుమోగుతున్నాయి.
గరిమెళ్ళ స్వరపరచిన సంకీర్తనలను టీటీడీ అనేక పుస్తకాలుగా తీసుకొచ్చింది.ఆయన పాడిన కీర్తనలు ఆడియో క్యాసెట్ రూపంలో కూడా సంగీత ప్రియులను అలరించాయి. గరిమెళ్ళ టీటీడీ తో పాటు కంచి కామకోటి పీఠం, అహోబిల మఠం ఆస్థాన సంగీత విద్వాంసులుగా సేవలు అందించారు.
అభినవ అన్నమయ్యగా ఖ్యాతి నందుకున్న టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మార్చి 9 వతేదీన కనబడని గంధర్వ లోకాలకు వెళ్లిపోయారు.