ఏపీలో వజ్రాల వేట !

Sharing is Caring...

Hunting for diamonds…………………………………………………………….

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆంధ్ర ప్రదేశ్ లోని  రాయలసీమ జిల్లాలలో వజ్రాల వేట కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలలో వజ్రాలు దొరికిన అనేక ఘటనలు ఇప్పటికే మనం విన్నాం. వర్షాలు పడుతున్నాయి అంటే ఎక్కడెక్కడి వజ్రాల వ్యాపారులు ఈ జిల్లాలపై దృష్టి పెడతారు.ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.  వైఎస్ఆర్ కడప జిల్లా పరిధిలో పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో వజ్రాలు ఉన్నట్టు  జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది.

దేశంలో ఎక్కడెక్కడ, ఏ స్థాయిలో ఖనిజాలు ఉన్నాయన్న అంశంపై GSI ప్రత్యేకమైన పరిశోధనలు నిర్వహించింది. ఈ పరిశోధనలో అత్యధికంగా ఖనిజాలు ఉన్న రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ను గుర్తించింది. అక్కడ 21 మైనింగ్ బ్లాక్ లున్నాయని తేలింది. కాగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో తొమ్మిది చొప్పున మైనింగ్ బ్లాక్ లను ఉన్నట్టు తేలింది. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో 37.65 చదరపు కిలోమీటర్ల పరిధిలో వజ్రాల లభ్యతకు అవకాశముందని, అక్కడ వజ్రాల గనులు ఉన్నట్లుగా  జీఎస్ ఐ  అధికారులు తేల్చారు.

ఇక ఏపీలో గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలంలో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాన ఉన్న కొల్లూరులో ఒకప్పుడు వజ్రాల గనులుండేవి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాలు ఇచ్చట లభించాయి. ఆంధ్రదేశానికి రత్నగర్భ అనే  పేరు ఈ గనుల వల్లనే వచ్చింది. ప్రఖ్యాత వజ్ర వ్యాపారి జాన్ బాప్టిస్ట్ టావర్నియర్ కొల్లూరు, పరిటాల గనులు సందర్శించాడని అంటారు.

కృష్ణ నదీ గర్భంలో రంగురాళ్ళవేట ఇప్పటికీ కొనసాగుతోంది.ఇక్కడే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోహినూర్ వజ్రం లభించింది.  ఈ కొల్లూర్ గనులు గోల్కొండ రాజుల సారధ్యంలో పనిచేసేవి. 16 వ శతాబ్దం నుంచి 19  వ శతాబ్దం వరకు ఈ గనులు పనిచేసాయి. తర్వాత పులిచింతల ప్రాజెక్టులో ఈ ప్రాంతం కలసి పోయింది.

అనంతపూర్ జిల్లా ఒకప్పుడు వజ్రాలకు ప్రసిద్ధి. ఆ జిల్లాలోని వజ్రకరూరు లో వజ్రాల ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉండేది.కొంత కాలంగా అక్కడ వజ్రాల లభ్యత తగ్గడంతో పనులు నిలిపి వేశారు. ఇటీవల  వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో జియాలజిస్టులు సర్వేలు నిర్వహించి వజ్రాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడి మట్టిని సేకరించారు. దాన్ని వజ్రకరూరులోని ప్రాసెసింగ్ యూనిట్ కి పంపి పరీక్షలు నిర్వహించారు.

వజ్రకరూరు పరిసర ప్రాంతాల్లో విలువైన వజ్ర నిక్షేపాలు, బంగారు గనులు ఉన్నట్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో తిరిగి వజ్రాన్వేషణ పనులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. రెండు సంవత్సరాల క్రితం కూడేరు మండలం శివరామ్‌పేట సమీపంలో గల పొలాల్లో జీఎస్‌ఐ అధికారులు సర్వేలు నిర్వహించి అక్కడ వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. సర్వే ప్రకారం ఇక్కడ గనుల్లో వజ్రాలు దొరికితే ఏపీ పంట పండినట్టే.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!