అసన్‌సోల్‌ లో ఓటమి చిన్నదేమీ కాదు !!

Sharing is Caring...

అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది.

అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రెండో సారి పోటీ చేసి 197637ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.2021 లో జరిగిన మంత్రి వర్గ  ప్రక్షాళనలో భాగంగా బాబుల్ సుప్రియో ను తప్పించారు. దీంతో అతగాడికి కోపమొచ్చి ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసాడు. దాంతో ఈ స్థానానికి  వారం క్రితం ఎన్నిక జరిగింది.

ఆ ఎన్నికలో అసన్‌సోల్‌ స్థానం నుంచి టీఎంసీ అభ్యర్థిగా ప్రముఖ నటుడు శతృఘన్‌ సిన్హా బరిలోకి దిగి .. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌పై 3.3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గ చరిత్రలోనే ఇంత మెజారిటీ రావడం ఇదే తొలిసారి. ఇక్కడ తృణమూల్ గెలవడం కూడా ఇదే మొదటిసారి.

బాలీగంజ్‌ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహించిన బెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ చనిపోవడంతో ఏప్రిల్‌ 12న ఆ స్థానంలో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ టీఎంసీ తరఫున బరిలోకి దిగిన బాబుల్‌ సుప్రియో.. సీపీఐ(ఎం) అభ్యర్థి సైరా షా హాలిమ్‌పై 20 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ రెండు చోట్లా గెలుపు తృణమూల్ బలాన్నిపెంచేవే .

ఇదే విషయమై బాబుల్ సుప్రియో మాట్లాడుతూ గతంలో అసన్‌సోల్‌లో నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసి తన సొంత ఇమేజ్‌పైనే గెలిచానని వివరించారు.ఇప్పుడు బల్లిగంజ్‌లో ఎమ్మెల్యేగా సాధించిన విజయం తాలూకు క్రెడిట్‌ అంతా మమతా బెనర్జీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. బల్లిగంజ్‌లో బాబుల్‌కు 51,199 ఓట్లు రాగా.. సీపీఎం అభ్యర్థికి 30,971 ఓట్లు, బీజేపీ  అభ్యర్థికి 13,220 ఓట్లు వచ్చాయి.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని కొల్హాపూర్ నార్త్‌ను కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగా, బీహార్‌లో బోచాహన్ స్థానాన్ని  ఆర్జేడీ గెలుచుకుంది. ఛత్తీస్ ఘడ్ లో ఖైరాఘడ్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ 20 వేలకు పైగా ఓట్లతో గెలుచుకుంది. నెల క్రితం జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహం ఏమైంది ? అసెంబ్లీ స్థానాల సంగతి పక్కన బెడితే చేతిలో ఉన్న లోకసభ స్థానం లో ఎందుకు ఓడిపోయిందో బీజేపీ సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క సీటుకదా అని నిర్లక్ష్యం చేయకూడదు. అక్కడి నాయకులు కూడా అగ్రనేతలపై ఆగ్రహంతో ఉన్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!