దుమ్ముదులిపిన ‘దసరా బుల్లోడు’ !

Sharing is Caring...

The film brought a star image to ANR…………………………….

దసరా బుల్లోడు  ……. అక్కినేని నాగేశ్వరరావు కి  స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నో సినిమాల ను హిట్ రేస్ నుంచి పక్కకు  నెట్టిన చిత్రం.  అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం.

మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలితను అనుకున్నారు. అయితే డేట్స్ కుదరకపోడంతో వాణిశ్రీ తెరపైకి వచ్చింది.  అలాగే దర్శకుడు మధుసూధనరావు అనుకున్నారు. ఆయనకు కుదరకపోవడంతో అక్కినేని సలహాతో నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ సినిమాను డైరెక్ట్ చేసాడు. 
1971 లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా ఇది.

జగపతి బ్యానర్ స్థాయి ని పెంచింది..  అప్పటికే రాజేంద్రప్రసాద్ ఆరాధన ,ఆత్మబలం ,అంతస్తులు ,ఆస్తిపరులు , అదృష్టవంతులు ,అక్కాచెల్లెలు  సినిమాలు తీశారు. అవన్నీ కూడా బాగానే ఆడాయి. రాజేంద్రప్రసాద్ అక్కినేని ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే మంచి స్నేహితులు. రాజేంద్రప్రసాద్ అక్కినేని తో తప్ప వేరే వారితో సినిమాలు తీయను అనేవారు.అలాగే అక్కినేని తోనే ఎక్కువ తీశారు.

శోభన్ బాబు ,ఎన్టీఆర్ , బాలకృష్ణ లతో కూడా తర్వాత కాలంలో తీశారు.  అక్కాచెల్లెలు  తరవాత మంచి లవ్ స్టోరీ తీయాలనుకుని  సింగల్ లైన్ కథ అల్లుకున్నారు. ఆత్రేయను పిలిచి ఈ లైన్లో సినిమాకావాలని చెప్పారు. ఆ కథ విని  ఆత్రేయ తొలుత  పెద్దగా స్పందించలేదు. రెండురోజుల తర్వాత విస్తరించిన కథను వినిపించారు.

అది ఒకే కావడంతో  మాటలు పాటలు ఆయనే సమకూర్చగా 40 రోజుల్లో సినిమా తీసేసారు. అప్పట్లో అదొక రికార్డు. దసరాబుల్లోడు  పాటలు సూపర్ హిట్ అయ్యాయి . పాటల కోసమే సినిమా చూసిన వాళ్ళున్నారు.  70 దశకంలో యువతను ఉర్రూతల్లూగించిన పాటలున్న సినిమా ఇది.

నిజం చెప్పాలంటే ఆత్రేయ పాటలు సినిమాకు ప్రాణం పోశాయి.  “ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి” వంటి ఆత్రేయ  మార్క్ పాటలు కూడా ఉన్నాయి.  “నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే “,” చేతిలో చెయ్యేసి చెప్పుబావా”, వంటి పాటలు ఇప్పటికి అక్కడక్కడ వినబడుతుంటాయి. పాటలు అన్నిరకాల ప్రేక్షకులను  బాగా ఆకట్టుకున్నాయి.

ఆత్రేయ పాటలకు జనరంజకమైన ట్యూన్స్ ను మామ మహదేవన్ అందించారు. ఎస్ వెంకటరత్నం పాటల చిత్రీకరణ గురించి చెప్పనక్కర్లేదు.  పాటలకు తగ్గట్టు అక్కినేని స్టెప్స్ ప్రేక్షకులను అలరించాయి . అప్పటినుంచి ప్రతి సినిమాలో స్టెప్స్ పెట్టేవారు. అక్కినేని స్టెప్స్ చూసి ఈలలు వేసి థియేటర్ లో హడావుడి చేసేవారు. 

ఈ సినిమాలో వాణిశ్రీ … చంద్రకళ  ఇద్దరు హీరోయిన్లు గా  పాత్రల్లో జీవించారు. అక్కినేనికి పల్లెటూరి యువకుడి పాత్ర కొట్టిన పిండి.ఆయన సహజంగానే నటించారు. అక్కినేని డ్రెస్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. పంచెకట్టు వెరైటీగా ఉంటుంది.

“ఏంటి దసరాబుల్లోడిలా తయారయ్యావ్” అనేమాట అప్పటినుంచి వాడుకపదంగా మారింది. ఈ సినిమాలో హీరో అక్కినేని కోసం  బీచ్ బగ్లీ అనే కారును కొనుక్కొచ్చారు.  అప్పటికి దేశంలో అలాంటి కార్లు  రెండే ఉన్నాయట . ఈ కారును అన్ని థియేటర్ల వద్ద ప్రదర్శించారు.దసరా బుల్లోడు కి ముందు అక్కినేని కి హిట్ మూవీస్ లేవు .

ఈ సినిమా ధాటికి ఆయన సినిమాలు కూడా బోల్తా పడ్డాయి.  ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ విజయం , జీవిత చక్రం వంటి సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. రాజేంద్రప్రసాద్ కూడా అంతటి ఘన విజయాన్ని ఊహించలేదు . హిందీలో జితేంద్ర హీరో గా రేఖ ,షబానా అజ్మీ లు హీరోయిన్లుగా ” రాస్తే ప్యార్ కే ” పేరిట నిర్మించి విడుదల చేశారు.

బాలీవుడ్ లో కూడా హిట్ అయింది . ముందు రాజేష్ ఖన్నా ను సంప్రదిస్తే ఆయన డేట్స్  వరుసగా ఇవ్వలేదు . దీంతో జితేంద్ర ను హీరోగా పెట్టారు.  తమిళ్ లో ఉరిమైక్కురళ్ పేరిట వేరే వాళ్ళు  రీమేక్ చేశారు. 

రాజేంద్రప్రసాద్ ఈ సినిమా తర్వాత చాలా  సినిమాలు తీశారు కానీ దసరాబుల్లోడు స్థాయి హిట్ కొట్ట లేకపోయారు. మరో నాలుగు నెలల్లో ఈ సినిమా వయసు 53 ఏళ్ళు. ఈ రాజేంద్ర ప్రసాద్ ఎవరో కాదు నటుడు జగపతిబాబు తండ్రే. జగపతిబాబు ను ప్రమోట్ చేసేందుకు కూడా సినిమాలు తీశారు కానీ పెద్దగా విజయం సాధించలేదు. 

——————KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!