The last of the five kedaras ……………………..
పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో వెలసిన స్వామిని జటేశ్వర్ అని పిలుస్తారు.
శివుని జటాజూటం ఇక్కడ లింగ రూపంలో వెలిసిందని పురాణ కథనాలు చెబుతున్నాయి.ఆది శంకరాచార్యుని శిష్యులు అయిన నంబూద్రి బ్రాహ్మణులు ఇక్కడ ఆలయ పూజారులుగా ఉన్నారు. అత్రి, అనసూయల పుత్రుడైన దుర్వాస మహర్షి ఈ ఆలయప్రాంగణంలో ఉన్న కల్ప వృక్షం కింద తపస్సు చేసి శివుని నుండి అనేక వరాలు పొందాడని చెబుతారు.
కల్పవృక్షం సమీపంలో శివుని జటాజూటం పడింది కాబట్టి ఇక్కడ శివుడికి కల్పనాధుడు అనే పేరు వచ్చిందని అంటారు. కల్పేశ్వర్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని నమ్ముతారు. తర్వాత కాలంలో ఆది శంకరాచార్యులు ఈ ఆలయాన్ని కనుగొన్నారని …అందుకే ఆయన శిష్యులు ఇక్కడ పూజారులుగా ఉన్నారని చెబుతారు.
లోయ లోని ఆలయాన్ని చూసేందుకు చిన్న గుహ మార్గం ద్వారా వెళ్ళాలి . సందర్శకులకు ఇది ఒక అద్భుతమైన అనుభవం. ఇది దట్టమైన అటవీ ప్రాంతం, ఇక్కడ అలకానంద, కల్పగంగా అనే రెండు నదులు విలీనం అయ్యాయి. ఉర్గాం లోయ ఆపిల్ తోటలకు, కొండ ప్రాంత బంగాళాదుంపలకు ప్రసిద్ధి.
ఇతర పంచ కేదార్ దేవాలయాల మాదిరిగా కాకుండా కల్పేశ్వర్ శివాలయాన్ని ఏడాది పొడవునా సందర్శించవచ్చు.ఇక్కడికి సమీపంలోనే బుద్ధ కేదార్ ఆలయం ఉంది. కల్పేశ్వర్ ఆలయానికి వెళ్లే మార్గంలో కనిపిస్తుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రవాహాలు, సరస్సులు, వృక్షసంపద కల్పేశ్వర్ ఆలయ సందర్శనను గుర్తుండిపోయేలా చేస్తాయి.
ఈ ఆలయం పురాతన కాలం నుండి చాలా మార్పులకు గురైంది. ఒకే పర్వతం నుంచి సేకరించిన రాళ్ళతో ఈ ఆలయం నగరా నిర్మాణ శైలిలో నిర్మితమైంది.ఇదివరలో రుషికేశ్ బద్రీనాథ్ మార్గం లో హెలాంగ్ అనే గ్రామం నుంచి 12 కిమీ నడచి ఈ ఆలయానికి చేరుకునేవారు. ఇపుడు రోడ్డు మార్గం అభివృద్ధి చెందడంతో దేవుగ్రామ్ నుంచి 300 మీటర్లు నడిస్తే ఆలయానికి త్వరగా చేరుకోవచ్చు.
కల్పేశ్వర్ ఆలయాన్ని సందర్శించడానికి మే నుండి అక్టోబరు వరకు అనుకూల సమయం. ఈ నెలల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ట్రెక్కింగ్ మార్గం అందుబాటులో ఉంటుంది. మే నుండి జూన్ వరకు ఉష్ణోగ్రతలు కూడా అనుకూలంగా ఉంటాయి.
శీతాకాలం (నవంబర్ నుండి ఏప్రిల్ వరకు) హిమపాతం ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో యాత్రకు వెళ్లకుండా ఉండటం మంచిది.కల్పేశ్వర్ ట్రెక్కింగ్ ఒక ఆహ్లదకరమైన అనుభవం, ఉర్గామ్ వ్యాలీ సమీప గ్రామాలలో ప్రాథమిక వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. రైల్లో రిషికేశ్ చేరుకుంటే .. అక్కడ నుంచి కల్పనాథ్ కు టాక్సీ,బస్సులో హెలాంగ్ కు వెళ్ళవచ్చు. అక్కడనుంచి ఉర్గామ్ చేరుకుంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ కల్పనాధ్ ఆలయానికి వెళ్ళవచ్చు.