Pudota Showreelu ……………………………………
‘డేర్సు ఉజాల’….. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది..
ఇక కథ విషయాని కోస్తే, రష్యా దేశపు సైనిక సర్వే అధికారి అయిన వ్లాదిమిర్ అర్సెన్నేవ్ (యురి సొలోమెన్)1902 లో సైబీరియన్ అడవుల్లో తాను స్నేహం చేసిన గోల్డు తెగకు చెందిన డేర్సు వుజాలా (మాక్సిం ముంజుక్) సమాధి కోసం అన్వేషిస్తూ వుంటాడు. ఒకానొకప్పుడు డేర్సు ని సమాధి చేసిన ప్రాంతం ఒక దట్టమైన అడవి.ఇప్పుడా ప్రాంతం చెట్లన్నీ కొట్టి వేయబడి ఒక పట్టణం గా రూపాంతరం చెందుతూ ఉంటుంది.
వ్లాదిమిర్ నాగరిక ప్రపంచంలోని ఒక సైనికాధికారి. రష్యా దూర ప్రాచ్య ము లోని సికోటే అలీన్ అనే భూభాగాన్ని తన బృందంతో కలిసి పరిశోధించటానికి వెళ్తాడు..బృంద సభ్యులు గుర్రాలపై గుడారాలు,సామాన్లు,పరిశోధక వస్తు సామగ్రితో దట్టమైన ఆ అడవుల్లోకి బయలుదేరుతారు.. ఆ అడవుల్లో గోల్డు కొండ జాతికి,చెందిన ఆదివాసీ ” డేర్సు ఉజాలా,వ్లాదిమిర్ ఆర్సెన్నేవ్ కి పరిచయమై వారి పరిశోధనలలో తోడ్పడుతుంటాడు.వీరిద్దరి స్నేహమే సినిమా ప్రధాన కథాంశం.
డేర్సు కి అడవి దేవుడితో సమానం.నీరు,నిప్పు, గాలి,సూర్యుడు,చంద్రుడు,ఆకాశం,భూమి ఇవన్నీ గూడా మనిషి మనుగడకు తోడ్పడుతుంటాయని …. వీటిని మనిషి ఎప్పుడూ కాపాడు కోవాలని చెబుతుంటాడు. ఒకరోజు ఈ అన్వేషక బృందం తమ షూటింగ్ ప్రావీణ్యాన్ని పరీక్షించుకోవాలని చెట్టు కొమ్మకు కట్టిన వోడ్కా బాటిల్ వూగుతూ వుండగా ఆ సీసాను నిర్దేశిత దూరం నుండి పగల గొట్టాలనే పందెం వేసుకుంటారు..ఎవరూ ఆ లక్ష్యాన్ని ఛేదించ లేరు..
డేర్సు “నేను సీసాని కాదు,ఆ సీసా కున్న తాడునే కొడతాను” అంటాడు.అందరూ ఎగతాళిగా నవ్వుతారు..కానీ డేర్సు విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదిస్తాడు.ఒకరాత్రి విచార వదనంతో నెగడు ముందు ఒంటరిగా కూర్చుని,పాటలు పాడుకుంటూ వున్న డేర్సునీ,కెప్టెన్ వ్లాదిమిర్ అతని స్వవిషయాల గురించి అడుగుతాడు.
డేర్సు ” ఒకప్పుడు ఈ అడవిలో ఒక చక్కని గుడిసె లో నేను,నా భార్య,కొడుకు,కూతురు తో ఎంతో ఆనందంగా వుండే వాడిని.అయితే అమ్మవారు పోసి నా కుటుంబం మొత్తం ప్రాణాలు పోగొట్టుకున్నారు.నా గుడిసె కూడా కాలిపోయింది.అప్పటినుండీ ఈ అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్నాను.ఈ అడవే నా ఇల్లు”. అని చెబుతాడు.
చైనా,రష్యా బోర్డర్ లో మంచుతో గడ్డ కట్టి వుండే,khanka lake ని పరిశోధించటానికి బృందం బయలు దేరుతుంది..బృందం లో ఇద్దరు సభ్యులను,కొంత సామాగ్రిని తీసుకుని,ఆ ప్రాంతమంతా తెలిసిన డేర్స్నివెంట బెట్టుకుని కెప్టెన్ వ్లాదిమిర్ బయలుదేరుతాడు.మంచుతో గడ్డ కట్టిన ఆ ప్రాంతంలో కొంత ముందుకు వెళ్ళి తన బృంద సభ్యులను అక్కడే వుండి టెంట్ వేసి,తక్కిన ఏర్పాట్లు చూడమని చెప్పి కెప్టెన్ డేర్స్ తో ఇంకా బాగా ముందుకు వెళ్తాడు.
వాళ్ళు బయలుదేరిన కొద్ది సేపటికే భయంకరమైన మంచు తుఫాను ముంచు కొస్తుంది.పెద్దపెద్ద మంచు గడ్డలు పై నుండి పడుతూ వుంటాయి.వీరు వచ్చిన దారి గుర్తులు చెరిగి పోతాయి..ఎటు వెళ్ళాలో పాలు పోదు..మనిషిని గూడ పైకి ఎగరేసుకు వెళ్లేంతగా గాలి వీస్తుంది.
ఈ మంచు తుఫాన్ చిత్రీకరణలో దర్శకుని ప్రతిభ అనితర సాధ్యం..చివరకు ఎంతో అనుభవం వున్న డేర్సు,ఇంకా కొద్ది సేపైతే ఈ తుఫాన్ లో చనిపోవటం ఖాయం..ఇంకో పక్క చీకటి పడిపోతుంది.. తన ప్రకృతి జ్ఞానంతో డేర్శు తాను గబగబా అక్కడున్న గడ్డిని కోస్తూ ఒకచోట కుప్ప వేస్తూ,కెప్టెన్ని కూడా గబగబా కోయమంటాడు. రోజంతా నడవటం పైగా తుఫాన్ … దీనితో కెప్టెన్ వ్లాదిమిర్ పూర్తిగా అలిసిపోయి నీరసించి పోతాడు.
ఒక్క అడుగు గూడా వేయలేని స్థితికి చేరుకుంటాడు..చివరకు స్పృహ తప్పి పడిపోతాడు. డేర్సు అతన్ని ఆ గడ్డి కుప్ప కిందకు లాగి చలి తగలకుండా… మంచు గడ్డలు మీద పడకుండా జాగ్రత్తగా అతని ప్రాణాలు కాపాడుతాడు.తానూ ఆ గడ్డికుప్పలో దూరతాడు. తెల్లవారుతుంది.
కెప్టెన్ తన ప్రాణాలు కాపాడిన డేర్సు కు కృతజ్ఞత లు చెబుతాడు..అక్కడి నుండి బయలుదేరి బృందాన్ని కలుసుకుంటారు. పరిశోధనలు ముగింపు దశకు చేరుతాయి.తదుపరి పరిశోధనలకు మళ్ళీ వస్తామంటూ బృందం అప్పటివరకు తమతో వుండి, తమ కెంతో సాయం చేసిన ఆ గిరిజనుడు దేర్సు దగ్గర సెలవు తీసుకుంటారు.
కెప్టెన్ వ్లాదిమిర్ తానెంతో అభిమానించే,ప్రేమించే డేర్స్ ని వదలలేక తనతో రమ్మంటాడు.సిటీలోతనకన్ని ఏర్పాట్లు చేస్తానంటాడు.దానికి డేర్సు”నేను అడవి మనిషిని.సిటీలో నేను బతకలేను.ఈ అడవే నా ఇల్లు.నేను రాలేను.నన్ను మన్నించండి” అని ప్రాధేయ పడతాడు.
ఎప్పుడూ చేతిలో పంగలకర్ర పట్టుకుని తిరిగే డేర్సు కెప్టెన్ ని తనకొక తుపాకీ కొన్ని తూటాలు ఇవ్వమని అడుగుతాడు. కెప్టెన్ అతని బృందం డేర్స్ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతారు..దీనితో మొదటి భాగం పూర్తవుతుంది..
****
కొన్నేళ్ల తర్వాత తిరిగి వసంత కాలంలో కెప్టెన్ వ్లాదిమిర్ ఆర్సెన్నేైవ్ అతని బృందం అన్వేషణ కు తిరిగి అడవులకు వస్తుంది.వీరికి డేర్సు జాడ దొరకదు. కెప్టెన్ మనసంతా అతని మీదే వుంటుంది.. డేర్సు, డేర్సూ అని పిలుస్తూ అతని కోసం వెతుకుతూనే వుంటాడు. కొంచెం వృద్దాప్యం మీద పడ్డ డేర్సు ఆ అడవుల్లో తిరిగి కనిపిస్తాడు.అతని సాయంతో అన్వేషణ కొనసాగుతూ వుంటుంది.బోర్డర్ లో వుండే చైనా అల్లరిమూకల దాడులు,అరాచకాలు ఎక్కువ అవుతాయి.
చైనీయులు చర్మాలు, గోళ్ళు కోసం అడవి జంతువులను చంపటం, ఆటవికులను హతమార్చడం,ఆడవారిని చెరపట్టి పాడు చేయటం,చెట్లను నరికేయటం, అడవిని నాశనం చేయటం వంటి సంఘటనలు డేర్సు ను, కెప్టెన్ ను,వారి బృందాన్ని కలచి వేస్తాయి. ఈ బృందం కొంత వరకూ వారి ఆగడాలను ఎదుర్కొంటాయి.
పరిశోధనలో భాగంగా ఈ బృందం నదిలో దుంగలపై ప్రయాణిస్తూవుంటుంది.కాసేపటికే నదిలో నీటిమట్టం పెరిగిపోతూ ప్రమాద స్థితికి చేరుకుంటుంది.సభ్యులంతా నదిలో దూకి ప్రాణాలు కాపాడుకుంటారు. కెప్టెన్, డేర్స్ మిగిలిపోతారు..ప్రవాహం ఇంకా ఎక్కువ అవుతుంది.
అప్పుడు డేర్సు ,కెప్టెన్ ప్రాణాలు కాపాడటానికి అతన్ని నీళ్ళలోకి నెట్టి,తాను మాత్రం నీళ్లలో మునిగి పోతుంటాడు.ఎలాగో ఒక చిన్న చెట్టు మొదలు ఆధారంగా పట్టుకుని, నిలబడ్డ అతన్ని బృందం కాపాడు కుంటుంది. అపారమైన ఆటవిక జ్ఞానంతో ఈ బృందాన్ని కాపాడుతూ,వారి పనుల్లో సాయ పడుతూ,వారికి చాలా ప్రియమైన వాడు అవుతాడు డేర్సు.
ఒకసారి ఈ బృందాన్ని పులి వెంబడిస్తూ వుంటుంది.దాన్ని గమనించిన డేర్సు పులిని బెదిరించ టానికి దాని పక్కకు కాల్చిన తూటా సరిగ్గా పులికి తగిలి దాన్ని గాయపరుస్తుంది.దీనితో డేర్స్ బాధపడి,” నా వనదేవత ను గాయపరిచాను.ఇక ఈ అడవి నన్ను బతక నివ్వదు.పులి మళ్ళీ వచ్చి నన్ను ఎలాగైనా చంపేస్తుంది.ఇక నా చావు తధ్యం” అని వెత చెందుతుంటాడు.
పులి విషయంలో తన గురి తప్పిందని,తన గురిని పరీక్షించు కోవటం కోసం,ఒక చెట్టుకొమ్మకి తన టోపీ తగిలించి కొడతాడు..కానీ గురి తప్పుతుంది.చూపు సరిగ్గా ఆనదు..వృద్ధాప్య సమస్యలు చుట్టుముడతాయి..
తమ పరిశోధనలు ముగించుకుని తిరిగి వెళ్ళబోతున్న కెప్టెన్ వ్లాదిమిర్,ఈసారి డేర్సు ని తనతో గట్టిగా అడుగుతాడు. తన ఇంట్లోనే ఒక గదిలో అన్నీ వసతులు ఏర్పాటు చేస్తానని,తన భార్య,కొడుకు ప్రేమగా చూసుకుంటారని,ఈ ముసలితనంలో ఇక అడవిలో ఆహారం కోసం తిరగలేవని,తనతో రమ్మని బతిమాలుతాడు. కెప్టెన్ ప్రేమకు కరిగిపోయిన డేర్స్ సరేనని సిటీ లోని అతనింటికి చేరతాడు.ఇంటిలో డేర్స్ కు ఒక గదిని కేటాయిస్తారు.
అందులో అన్నీ అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.కెప్టెన్ భార్య సమయానికి తగు ఆహారాన్ని డేర్స్ కి అందిస్తూ ప్రేమగా చూసుకుంటుంది. ఏడేనిమిదెళ్ళ కెప్టెన్ కొడుకు నోవా, డేర్సు కు బాగా చేరిక అవుతాడు. నోవా కు అడవి,అడవిలోని జంతువులు,పక్షుల గురించి చెబుతూ వుంటాడు.నోవా డేర్సు ను ఎంత గానో ప్రేమిస్తాడు.. ఎప్పుడూ అతని గదిలోనే వుంటాడు. డేర్సు తన దగ్గరున్న పులి గోళ్ళు,ఎలుగు బంటి దంతాలు నోవాకి కానుకలుగా ఇస్తాడు.
అయినా స్వేచ్ఛగా తిరిగే డేర్స్ కి ఈ సిటీ జీవితం అసలు నచ్చదు..ఒకరోజు కెప్టెన్ ని “ఈ పెట్టె ల్లాంటి గదిలో నాకు నిద్ర పట్టటం లేదు.బజారులోఆరుబయట పడుకుంటానని” అడుగుతాడు.. డేర్స్..దానికి రూల్స్ ఒప్పుకోవు. అలా బయట పడుకో కూడదు అంటాడు.కెప్టెన్ భార్య డబ్బులిచ్చి నీళ్ళు కొనటం డేర్స్ కి నచ్చదు. ఉచితంగా దొరికే నీటిని అమ్ముతావా..అంటూ ఆ మనిషి మీద పోట్లాట కు దిగుతాడు.
ఒకరోజు ఇంట్లో చెప్పకుండా వెళ్లి బయట తుపాకీ తో తిరుగుతున్న డేర్స్ ని పోలీసులు అరెస్ట్ చేయబోతారు.ఎలాగో విడిపించి తెస్తాడు కెప్టెన్..ఇక తాను ఎంత మాత్రం ఇక్కడ ఉండలేనని తనను తిరిగి అడవికి పంపమని కెప్టెన్ ను బతిమి లాడుతాడు డేర్స్ . దాంతో ఇంకా డేర్స్ మనసు కష్టపెట్టటం ఇష్టం లేక సరే నంటాడు కెప్టెన్. డేర్స్ కి ఒక కొత్త రివాల్వర్ కానుకగా ఇచ్చి అడవిలో వదిలి పెట్టి వస్తాడు కెప్టెన్.
కెప్టెన్,అతని భార్య,కొడుకు నోవా డేర్స్ వెళ్లిపోయినందుకు చాలా బాధ పడతారు..కొన్నాళ్ళకు కెప్టెన్ కు ఒక టెలిగ్రాం వస్తుంది.అడవిలో చనిపోయి పడి వున్న ఒక గోల్డ్ తెగకు చెందిన ఆటవికుని వద్ద మీ విజిటింగ్ కార్డ్ వుందని వెంటనే వచ్చి శవాన్ని గుర్తించమని టెలిగ్రామ్ సారాంశం. కెప్టెన్ అడవికి బయలు దేరుతాడు.. డేర్స్ శవాన్ని గుర్తిస్తాడు. కన్నీటితో అతని సమాధి దగ్గర అతని చేతిలో ఎప్పుడూ వుండే పంగల కర్రని నాటుతాడు..
గొప్ప స్నేహితుని కోల్పోయామని విలపిస్తాడు. ఈ సినిమా విడుదలయి ఇప్పటికీ 49 సంవత్సరాలు దాటినా ,నిన్న మొన్న తీసిన సినిమానేమో అనిపిస్తుంది..ఒక అద్భుతమైన దృశ్య కావ్యం..యూరి నాగిబిన్.. సినిమాటోగ్రఫీ,అసకాజు. సినిమాని జపాన్, రష్యా సంయుక్తంగా నిర్మించారు.
ఆస్కార్ తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డు లను ఈ సినిమా సొంతం చేసుకుంది.యూ ట్యూబ్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది..సైబీరియా అడవుల అందాలు, కళాకారుల సహజ నటన,గడ్డకట్టుకుపోయిన సరస్సు మరీ ముఖ్యంగా సినిమా అయిపోయేసరికి డేర్స్ మన ఇంట్లో మనిషే అన్నంతగా అతనితో మనమూ ప్రేమలో పడిపోతాము..