Creator of high yielding new varieties…….
ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త ఆయన. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని స్వామినాథన్ తపించారు. వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణల కోసం నిరంతరం కృషిచేసిన వ్యక్తి . వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్.
వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాల్సి ఉందని తపించిన ఎంఎస్ స్వామినాథన్.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని విశ్వసించారు. ఆధునిక పద్ధతులతో అధిక ఫలసాయం సాధ్యమని నమ్మిన ఆయన.. కొత్త వంగడాలు సృష్టించి దేశంలో వ్యవసాయం గతిని మార్చారు.
1960, 70దశకంలో భారత్‌లోనూ ఆహార సంక్షోభం ముప్పును ఎదుర్కొన్న సమయంలో భిన్న వ్యవసాయ పరిస్థితులను ఎదుర్కొని అధిక దిగుబడులిచ్చే పంటల అవసరం ఏర్పడింది. అప్పటికే వ్యవసాయంలో కీలక పరిశోధనలు చేస్తున్న ఎంఎస్ స్వామినాథన్.. అధిక దిగుబడులు ఇచ్చే గోధుమ, వరి రకాలను అభివృద్ధి చేసి చరిత్ర సృష్టించారు. ఆయన చేసిన కృషి.. వాటిని ఇక్కడ అమలు చేయడం భారత్‌లో హరిత విప్లవానికి నాంది పలికింది. అనంతరం అది భారత వ్యవసాయ పద్ధతుల ముఖచిత్రాన్నే మార్చివేసింది. దేశ వ్యవసాయ రంగం స్వయం సమృద్ధి సాధించేందుకు దోహద పడటం తో పాటు కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించింది.
దేశంలో ‘స్వామినాథన్ కమిషన్’ సిఫార్సులను అమలు చేయాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. రైతులకు మద్దతు ధర కోసం వ్యవసాయ పరిశోధకుడు స్వామినాథన్ నేతృత్వంలో ఓ ఫార్ములాను (MSP formula) రూపొందించారు. రైతుల పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 150శాతం దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది దీని ఉద్దేశం.
భారత వ్యవసాయ రంగంలో స్వామినాథన్ చూపిన ప్రభావం దేశ సరిహద్దులు దాటింది.ఆయన పరిశోధనల ప్రస్థానంలో 18 పుస్తకాలు, 250 పరిశోధక పేపర్లను (2021 వరకు) రచించారు. ప్రపంచ వ్యవసాయ రంగంపై ఆయన చూపిన ప్రభావానికి గాను ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులతోపాటు దాదాపు 84 డాక్టరేట్లు ఆయన్ను వరించాయి. ‘టైమ్స్’ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతుల్లో ఒకరిగా ఆయన నిలవడం విశేషం.
వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని.. అప్పుడే యువరైతులు ఈ రంగంలో కొనసాగడం, కొత్తవారు ఆకర్షితులవడం జరుగుతుందని ఎంఎస్ స్వామినాథన్ చెబుతుంటారు. వ్యవసాయ విధానాల రూపకల్పన ప్రక్రియలో రైతులు, విధానకర్తల మధ్య తగినంత చర్చ జరగడం లేదన్నది ఆయన అభిప్రాయం. ఇలాంటి చర్యలన్నీ మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెబుతుంటారు. ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఆర్జించిన స్వామినాథన్ సెప్టెంబర్ 28 న కనుమూశారు.